తూస్కాన్‌ బాబుకి బామ్మ చీవాట్లు

 


ఎవరు బాబూ నువ్వు? 

బ్రాహ్మీ తేజస్సుతో  వెలిగిపోతూ చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉన్నావు? 

నేను తూస్కాన్‌ నించి వచ్చాను బామ్మ గారు.
 మేము కృష్ణ భక్తులం. 
ఇదిగోండి, భగవద్గీత ప్రతి పుచ్చుకోండి. 

ఆహా! కృష్ణ భక్తుడివా బాబూ. 
చాలా సంతోషం నాయనా. 
నేనూ కృష్ణ భక్తురాలినే. 
నా శివ పూజ అయ్యాక శ్రీ రామ రక్షా స్తోత్రము, 
హనుమాన్‌ చాలీసా చదువుకుని, 
ఆనక తీరుబడిగా నాకు వచ్చిన కృష్ణ భజనలను పాడుకుంటూ ఉంటానయ్యా! 

మీకు అర్థం కావడం లేదండీ బామ్మ గారు, 
మాకు కృష్ణుడొక్కడే దేవుడు. శివుడు దేవుడే కాదు. 

ఆరి బడుద్ధాయ్‌, ఇదా నీ భక్తి? 
నీ బొందలా ఉంది.
 కృష్ణుడు, అర్జునుడు, రాముడు, రావణాసురుడు అందరూ శివుడినే పూజించారని రామాయణ మహాభారతాల్లో చదవలేదుట్రా అబ్బాయ్‌?

అవ్వన్నీ మేం చెప్పకూడదండీ బామ్మ గారు.
 మా సంస్థ వారు ఎల్లా చెబితే అల్లా మాట్లాడాలి. 
ఆ మాటకొస్తే మాకు రాముడికన్నా కూడా కృష్ణుడే గొప్ప. 

అల్లాగని కృష్ణుడొచ్చి చెప్పాడా? 

మా సంస్థ వారు చెబుతారండీ. 
మాకు కృష్ణుడొక్కడే దేవుడు. 
భగవద్గీత ఒక్కటే పుస్తకం. 

ఏడిసినట్టే ఉంది. 
మీరు కూడా ఒక దేవుడు, ఒక పుస్తకం గాళ్ళన్న మాట. 

చూడు బాబు, మన ధర్మంలో వివిధ దేవతామూర్తులు వివిధ శక్తులకు ప్రతీకలు. 
ఒక్కో దేవతని ఆవాహన చేసుకున్నప్పుడు ఒక్కో రకమైన శక్తి మనిషిలో పైకి లేస్తుంది.
 ఒక్కో మనిషి దగ్గరకు ఆ శక్తి ఇష్ట దేవత రూపంలో దగ్గరికి వస్తుంది. 

ఇంకా ఇందులో ఎన్నో నిగూఢ రహస్యాలున్నాయి. 

నువ్వింకా చాలా చిన్నవాడివి. 
కృష్ణ భక్తిలో ఓలలాడుతున్నట్టున్నావు. మంచిదే.
 మన ధర్మంలోని మిగిలిన దేవతామూర్తులను తూలనాడకు. తెలిసిందా?

అవన్నీ మేం ఆలోచించమండీ బామ్మ గారు. 
ఇందులోకి వచ్చాక మా గురువులు ఏం చెబితే అది చెయ్యాల్సిందే.

ఓరి తింగరబుచ్చి సన్నాసీ! సొంత బుర్ర వాడలేవూ? 
ఇలా పైత్యపు మాటలు చెబుతూ తిరుగుతావూ? 

ఏదో రోజు కృష్ణుడొచ్చి మీ అందరి బుర్రలు రామ కీర్తన పాడిస్తాడులే!
 ఫో! ఫో!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన