నీకు నాకు చెల్లంట! టాం!టాం! టాం!

 



రమణికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. 

ఒకటో పెళ్ళి కొడుకు వసంత కుమార్‌: 

 మా అమ్మకు ఆచారం ఎక్కువ. మీరు అవన్నీ పాటించాలి.

రమణి: అలాగేనండీ. 

మాకు బలగం ఎక్కువ. మా ఇంటికి బంధువులు, స్నేహితులు తరచూ వచ్చి పోతుంటారు. 
మీరు రోజూ వచ్చిన చుట్టాలకు  వంటలు వండి వార్చి వడ్డించాలి.

రమణి: అలాగేనండీ. 

 అన్నింటికీ అలాగే అంటున్నారు కనుక అసలు విషయం చెబుతున్నా. నేను మా ఆఫీసు మా కొలీగ్ ని ప్రేమించా. కానీ, ఆ అమ్మాయిది వేరే కులం. మా అమ్మ బలవంతం మీద ఈ పెళ్ళి చూపులు అవీ చూస్తూ టైం పాస్‌ చేస్తున్నా. 

రమణి: ఓ, అలాగా. ఇందాకట్నించీ భయపెడుతుంటే ఏమిటో అనుకున్నా. పోన్లేండి, ఉన్న విషయం చెప్పారు. మరి ఆ వేరే కులం అమ్మాయి మన ఇంట్లో మళ్ళు దళ్ళు, వంటలు వార్పులు చేస్తుందంటారా? 

మా ఇంటికొచ్చిన అమ్మాయి మా అమ్మ చెప్పినట్టు చెయ్యాల్సిందే. 

రమణి: బావుందండి. అయితే అమ్మని ఒప్పించి ఆ అమ్మాయిని చేసుకుని, ఆ అమ్మాయిని ఒప్పించి అమ్మ చెప్పినట్టు చాకిరీ చేయించండి. All the best!

…..

ఫోన్‌ కట్‌. 😁😉


రెండో పెళ్ళి కొడుకు చైత్ర కుమార్‌: 

మీరు విదేశాల్లో చదువుకుని వచ్చినట్టున్నారు. నాకు చదువుకున్న అమ్మాయిలంటే అస్సలు ఇష్టం లేదు. ఏదో అమ్మ బలవంతం మీద మాట్లాడుతున్నా. 
చదువెక్కువైతే పొగరు చూపిస్తారు. చెప్పిన మాట వింటారా? 

రమణి: మీరు చెప్పింది రైటే. అమ్మాయికి చదవడం రాయడం వస్తే పర్వాలేదంటారా? అది కూడా వద్దంటారా? 

…..

ఫోన్‌ కట్‌. 😁😉


మూడో పెళ్ళి కొడుకు గ్రీష్మ కుమార్‌: 

నాకు ఎర్రగా బుర్రగా ఉండే అమ్మాయిలు నచ్చరు. మగవాళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఆఫీసులో చూస్తుంటాగా. ఎప్పుడూ మగవాళ్ళతో ఇకఇకలు,పకపకలు.

మీరు అందంగా ఉన్నా ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నారు. మీకు  బాయ్‌ ఫ్రెండ్సు ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా? 


రమణి: మీరు అంత ఓపెన్‌గా అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్పేస్తా. పదేళ్ళ క్రితం ఒకడుండే వాడు, బ్రేకప్పయ్యింది. ఐదేళ్ళ క్రితం ఒక బ్రేకప్‌, ఆర్నెల్ల క్రితం ఇంకోటి. ప్రస్తుతం ఖాళీ. You are very lucky! 

……..

ఫోన్‌ కట్‌. 😁😉


నాలుగో పెళ్ళి కొడుకు వర్ష కుమార్‌: 

మీరు నాకు చాలా నచ్చారు. విదేశాల్లో కూడా చదువుకుని వచ్చారు. మీరు ఉద్యోగం చెయ్యక్కరలేదు. మా అమ్మా నాన్నా పెద్దవాళ్ళై పోయారు. వాళ్ళని చూసుకుంటే చాలు. ఇంకా మాది చాలా పెద్ద ఫామిలీ. మా పెదనాన్నా వాళ్ళ ఫేమిలీ, బాబాయి ఫేమిలీ, భర్త పోయిన మేనత్త, ఆవిడ పిల్లలు అంతా కలిసే ఉంటాం. మీరు అందరితో కలిసి పోవాలి. నేను చాలా మంచివాడిని. కావాలంటే చెక్‌ చేసుకోండి. ఇదీ నా జీమెయిల్‌ పాస్‌వార్డ్, ఇదీ నా యాహూ పాస్‌వార్డ్, ఇది నా ఫేస్బుక్కుది. ఓకేనా? 

రమణి: ఆగండాగండి. నా మాట విని  ఏ డిగ్రీయో, ఇంటరో, టెంతో చదివిన అమ్మాయిని చేసుకోండి. అలాంటి అమ్మాయి అయితే చక్కగా వంటావార్పూ చేస్తూ ఇంటి పట్టున ఉంటుంది మీక్కావాల్సినట్టు. ఓకేనా? 

మీరు నాకు నచ్చలేదు.
నచ్చలేదు. 
నచ్చలేదు. 
 నా పాస్‌వార్డ్స్ అన్నీ ఇప్పుడే మారుస్తా. 

…..

ఫోన్‌ కట్‌. 😁😉


( రమణికి తగిన వరుడితో పెళ్ళైపోయింది గానీ ఈ కుమారులంతా ఇంకా శ్రీమతుడులు కాలేదు.  కుమారులుగానే ఉన్నారు.
 వీరంతా మన భాగ్యనగరంలో ఉంటూ సాఫ్ట్వేరులో పెద్ద కొలువులు చేస్తున్న భాగ్యశాలురు. వీరి ప్రస్తుత వయస్సు ఏభై కి కొంచెం అటూఇటూగా ఉంటుంది. ఈ పురాతన భారత పౌరులకు పెళ్ళి సంబంధాలు చెప్పి పుణ్యం కట్టుకోగలరు. వీరిలో కొంతమందికైనా భావి భారత పౌరులు కలుగవచ్చును కదా పాపం.)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన