జీవన్‌ భద్రాణి పశ్యతి!

 


రామయ్య ఓ సంస్థలో వాచ్‌మాన్‌ గా పని చేస్తున్నాడు.


 సంస్థ గేటు వద్ద ఒక స్టూలు మీద కూచుని ఉండడమే అతని పని. 
ఆ సంస్థ యజమాని బయటికి వస్తున్నా లోపలికి వెళుతున్నా లేచి నిలబడి శాల్యూట్‌ కొడుతూ ఉంటాడు. 

ఓ రోజు కొంతమంది మనుషులు అతని వద్దకు వచ్చి తమనుతాము S.S.S సభ్యులుగా పరిచయం చేసుకున్నారు. 
అంటే శూర శుప్లవ సంఘం. 

చూడు రామయ్యా, నువ్వు నీ సంస్థ యజమానిని చూడగానే లేచి నిలబడి శాల్యూట్‌ చేస్తున్నావ్‌. అసలు యజమానిని చూడగానే నువ్వెందుకు లేవాలి?

 అతనూ మనిషే. నువ్వూ మనిషివే. 
నిలబడ్డమే కాదు, శాల్యూట్‌ కూడా కొడుతున్నావ్‌, బానిసలాగా. 

ఇకనించీ లేచి నిలబడొద్దు, 
శాల్యూట్‌ అంతకన్నా కొట్టొద్దు. 

నీ ఉద్యోగం వాచ్‌మాన్‌ పని. 
శల్యూట్లు కొట్టడం కాదు. తెలిసిందా? 
అన్నారు వాళ్ళు.

ఇదంతా కొత్తగా తోచింది రామయ్యకు. 
నిజమే కదా అనీ అనిపించింది. 

తనూ మనిషే, అతడూ మనిషే అన్న పాయింట్ బాగా మనసుకు హత్తుకుంది. 

తనేమన్నా బానిసా? ఛత్‌! 

మరుసటి రోజు యజమానిని చూసి అలవాటు కొద్దీ లేచినా, శాల్యూట్‌ కొట్టకుండా నిలబడ్డాడు. 

యజమాని పెద్దగా పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు. 

మళ్ళీ S.S.S వాళ్ళు వచ్చి, చూసావా, యజమాని రాగానే అలవాటుగా నిలబడ్డావ్‌ చూడు, అది తరతరాలుగా నీలో జీర్ణించుకుపోయిన బానిసత్వం. ఈమాటు చచ్చినా లేవకు. కూర్చునే ఉండు. ఇదిగో మా సాహిత్యం చదువు.  అని పరిపరి విధాలుగా రామయ్యకు బోధించిపోయారు. 

మరుసటి రోజు యజమానిని చూసినా లేవకుండా కూర్చున్నాడు రామయ్య. యజమాని అది గమనించినా, ఒంట్లో బాగోలేదేమో అనుకుని వెళ్ళిపోయాడు. 

రెండో రోజు లేవకపోవడమే కాక ఏదో పుస్తకం చదువుతూ కన్పించాడు యజమానికి.

మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు రామయ్య ఇలాగే చేసాడు. పైగా ఆ S.S.S సాహిత్యం వల్ల రామయ్యకు కొత్త కొత్త భావాలు కలుగుతున్నాయి. ఇది వరకు లేని ఆవేశం వస్తోంది.

ఆరో రోజు మానేజరు పిల్చి, ఏంటి సారొస్తే లేవట్లేదంటా? శాల్యూట్‌ చెయ్యట్లేదంట? అని అడిగాడు కోపంగా.

లేచి నిలబడాలా? శాల్యూట్‌ చెయ్యాలా? నేనేమైనా బానిసనా వాడికి?
వాడు రాగానే లేచి నిలబడాలని, శాల్యూట్‌ కొట్టాలని ఎక్కడ రాసుంది?  

ఇదంతా బుర్జువా కుట్ర. పీడితుల గళం పైకి లేస్తోంది. మీ కుటిల తంత్రాలిక సాగవు. లెనిన్‌గ్రాడ్‌ పై మన జెండా ఎగరబోతోంది కామ్రేడ్‌! అన్నాడు ఆవేశంగా పెద్ద గొంతుతో. 

అంతే, సాయంకాలానికి రామయ్య ఉద్యోగం ఊడింది.

 దాంతో ఇదే అవకాశంగా ఎదురు చూస్తున్న శూర శుప్లవం వాళ్ళు రామయ్యను ముందు పెట్టి, తామంతా వెనకాల నిలబడి సంస్థ ముందు నినాదాలు ఇవ్వడం, అల్లరి చేయడం ప్రారంభించారు. ఈ గొడవకి పోలీసులు రావడం,శూర శుప్లవ నాయకులను అదుపులోకి తీసుకుని బెయిలు మీద వదలడం జరిగాయి.
 
మరుసటి రోజు “ఫలానా సంస్థలో  లేచి నిలబడి శాల్యూట్‌ కొట్టలేదని వాచ్‌మాన్‌ ఉద్యోగం ఊడబీకిన యాజమాన్యం” అని పెద్ద అక్షరాలతో వార్తలు రావడంతో మొత్తం ఈ హడావిడికి, గందరగోళానికి బిత్తరపోయిన యాజమాన్యం నష్ట నిరోధక చర్యలు ప్రారంభించి, శూర శుప్లవ నాయకులను పిల్చి సంస్థ తరఫున నెలనెలా పార్టీ ఫండింగు ఇచ్చేటట్టు, రామయ్యను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేటట్టు ఒప్పందం కుదుర్చుకుని, “ వాచ్‌మాన్‌ తిరిగి ఉద్యోగంలో చేరిక” అని మళ్ళీ వార్త రాయించుకుని ఊపిరి పీల్చుకున్నారు.

రెండు నెలలయ్యాక వేరే ఏదో కారణం చూపించి సంస్థ వారు రామయ్య ఉద్యోగానికి ఊస్టింగ్‌ ఇచ్చారు. 

అది చూసి లబోదిబోమంటూ రామయ్య శూర శుప్లవం వారి ఆఫీసుకు పరిగెత్తి పోతే, ఆ వేరే కారణాలతో ఉద్యోగంలోంచి తీసేసే హక్కు యజమానికి ఉందని, కాబట్టి నోర్మూసుకుని అవతలికి పొమ్మని శూరశుప్లవ నాయకులు రామయ్యని కసిరి కొట్టారు.

మరుసటి రోజు సంస్థ వాచ్‌మాన్‌ ఉద్యోగానికి ప్రకటన వెలువడింది. 

ఉద్యోగ విధులలో భాగంగా యజమానిని చూడగానే లేచి నిలబడి శాల్యూట్‌ తప్పకుండా కొట్టాలనే నిబంధన ఉంది ఆ ప్రకటనలో. 


ఇది జరిగి రెండు సంవత్సరాలౌతోంది.

రామయ్య వ్యవహారమంతా పేపర్లలో వచ్చింది కనుక ఆ ఊళ్ళో ఏ సంస్థా అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. 

అతను ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి, అప్పులపాలై, ఆరోగ్యం చెడి చివరకు ఓ దేవాలయం ముందు టెంకాయలు, పూజాసామాగ్రి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. 

శూరశుప్లవం వారికి మాత్రం సంస్థ వారినుండి పార్టీ ఫండ్ నెలనెలా ఠంచనుగా అందుతోంది. 


( నీతి: జీవన్‌ భద్రాణి పశ్యతి. యజమాని మహావిష్ణు స్వరూపము. ఉద్యోగంలో యజమానికి  శాల్యూట్‌ కొడితే పోయేదేమీ లేదు, పైగా నెల తిరిగేటప్పటికి నిండు జీతం ఇంటికి వస్తుంది.)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన