భక్తి ముఖ్యం కానీ?

 


అమ్మా, దేవాలయానికి ఇలా కురచ దుస్తుల్లో రావొచ్చునా?

బట్టలు ఏమేసుకుంటే ఏమిటండీ? భక్తి ముఖ్యం కానీ?

అమ్మా, బొట్టు లేకుండా దేవాలయానికి వచ్చారేమీ? 

ఎలా వస్తే ఏమిటండీ? భక్తి ముఖ్యం కానీ?

అయ్యా, దేవాలయానికి టీ-షర్టు, షార్ట్స్ లో వచ్చారేమీ? 

నేను చాలా భక్తుడినండీ. షార్ట్స్ వేసుకొచ్చారా, పంచె కట్టుకొచ్చారా అని చూస్తాడా దేవుడు?  భక్తి ముఖ్యం కానీ?

ఏవమ్మా, అపసవ్య దిశలో ప్రదక్షిణ చేస్తూ ఫోనులో అరుస్తున్నావు?

నాతోపాటు వచ్చిన వాళ్ళు వేరేచోట ఉన్నారండీ. వాళ్ళతో కో-ఆర్డినేట్‌ చేసుకుంటూ ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడా. ఫోనుదేముందిలెండి. భక్తి ముఖ్యం కానీ?


అమ్మలారా, అయ్యలారా! మీరంతా చెబుతుంది నిజమే. భక్తే ముఖ్యం. మీరంతా శ్రమపడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీ ఇళ్ళలో కూచుని భక్తి చేసుకోండి. 

మీరెవరండీ, రావద్దని చెప్పడానికి? 

నేను ఈ దేవాలయ ధర్మకర్తని. ఈ గుడిని కట్టించింది నేనే. బయట పెద్ద బోర్డు పెట్టించాను, ఏమి రాసున్నదో చూడండి.

1. దేవాలయానికి సంప్రదాయ దుస్తుల్లోనే రావలెను.
2. హిందూ సంప్రదాయ వేషధారణలో వచ్చిన వారికే అనుమతి.
3. దేవాలయంలో బిగ్గరగా మాట్లాడరాదు. 
4. దేవాలయంలో లౌకిక విషయాలు మాట్లాడరాదు.

గమనిక: ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించు వారికి ప్రవేశము లేదు.

చదివారుగా,బోర్డు. దేవాలయం అంటేనే సనాతన సంప్రదాయాలు పాటింపబడాల్సిన ప్రదేశం. ఇది పిక్నిక్కు, టూరిస్టు ప్రదేశం కాదు. 

ఏమిటండీ, ఇన్ని రూల్సా? వేరే టెంపుల్‌కి వెళ్తాం. ఎక్కడ లేడూ దేవుడు? భక్తి ముఖ్యం కానీ?

వేరే టెంపుల్‌కి మాత్రం వెళ్ళడం ఎందుకమ్మా? ఇంటికి వెళ్ళి చెప్పుల స్టాండుకి దణ్ణం పెట్టు. ఎక్కడ లేడూ దేవుడు? 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన