ఆత్మతో ఉపాసకుడి సంభాషణ

 


1953 లో చనిపోయిన ఒక తెలుగు మనిషి ఆత్మ తెలుగు నేల మీదకు వచ్చింది. 

దోవన పోతున్న ఒక దేవీ ఉపాసకుడితో సంభాషించడం మొదలెట్టింది.

ఆత్మ: అయ్యా, తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టింది పొట్టి శ్రీరాములు గారు కదా. ఇప్పుడేమిటి, ఇంకెవరెవరి పేర్లో చెబుతున్నారు? 

ఉపాసకుడు: నువ్వు 1953 లో పోయానంటున్నావ్. తరువాత ఎంతోమంది నాయకులు వచ్చారు. కేంద్రంలో పని చేసి తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టిన వారు, కేంద్రంతో పోట్లాడి తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన వారు ఇలా చాలామంది ఉన్నారు. తెలిసిందా? 

ఆత్మ: ఏమిటో అంతా అయోమయంగా ఉంది. తెలుగు నేల చాలా మారిపోయింది. ప్రజలూ మారిపోయారు. మా ఊరి కరణం గారు, ఆయన కుటుంబం ఎలా ఉందో? వారు నాకు చాలా సన్నిహితులు.

ఉపాసకుడు: ఇంకెక్కడి కరణాలయ్యా? కరణీకాలు ఎప్పుడో రద్దు చేసారు. ఆ కరణాల కుటుంబాలు ఏవో ఇతర ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటూ బ్రతుకుతున్నాయి.

అత్మ: ఆ! అలాగా!  

ఉపాసకుడు: అంతకన్నా పెద్దవి ఎన్నో జరిగాయయ్యా. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. 

అత్మ: తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారా? అయ్యో! ఎందుచేతో?

ఉపాసకుడు: దానికి ఎన్నో రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నాయయ్యా. ఏం చెప్పను? 

అత్మ: సరి,సరి. నేను మీరు ఏం చేయగలంలెండి. ఇంతకీ ఆ లోకంలో ఉన్న నాకు నా స్నేహితులకి నీరు, ఆహారం అందట్లేదయ్యా. మాకు ఆబ్దికాలు పెట్టడానికి మా వారసులకి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో చూసి రమ్మని నన్ను పంపారు.

ఉపాసకుడు: ఫలానా జిల్లాలో, ఫలానా ఉళ్ళో ఫలానా వీథి వాళ్ళేగా, మీరు, మీ స్నేహితులు. మీ స్నేహితుల పిల్లలు మతం మార్చుకున్నారు. అంచేత ఆబ్దికాలు పెట్టరు. మీ పిల్లలు నాస్తికులు, ఆధునికులు అయ్యారు. అంచేత ఇక మీదట నీకూ ఆబ్దికాలు ఉండవు.

అత్మ: అయ్యో, ఖర్మ. మా వారసులు ఇలా అవుతారని కలలో కూడా ఊహించలేదు. ఇక మీదట మేం తిండీ నీరు లేక ఆ లోకంలో మలమల మాడాల్సిందేనా? హయ్యో! 

ఉపాసకుడు:  విచారించకు. నీకు, నీ స్నేహితులకి నా శక్తి మేరకు నేనే ఆబ్దికాలు పెట్టి స్మరిస్తాను. 

అత్మ: ధన్యోస్మి ఉపాసకా! ధన్యోస్మి.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన