పండుగంటే ఆరాధన

 


పెద్దాయన: వినాయక చవితి నాడు ఏం చేయాలిరా? 

ఆకలేష్‌‌: ఏముంది పెద్దాయనా! 
వినాయకుడి పూజేదో చేసేసుకుని, ఉండ్రాళ్ళు, పులిహోర, పరవాన్నం, గారెలు,బూరెలు, నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, పులుసు చేసుకుని తినడమే.

లొట్టేష్‌: బిర్యానీ కూడా.

పెద్దాయన: వినాయక చవితి అంటే వినాయకుడిని ఇంటిలో ప్రతిష్టించుకుని ఆరాధించాల్సిన రోజు. 

ఆ రోజంతా వినాయకుని ధ్యానంలోనే గడపాలి. 

పిండి వంటలు అవీ చేయడం వినాయకుడికి నైవేద్యం పెట్టడానికే. తెలిసిందా ? 

మరి, దీపావళి రోజు ఏమి చెయ్యాలిరా? 

ఆకలేష్‌: ఏముంది, మిఠాయిలు, పిండి వంటలు, కొత్త బట్టలు,టపాసులు! 

లొట్టేష్‌: బిర్యానీ కూడా.

పెద్దాయన: దీపావళి అంటే లక్ష్మీ దేవిని ఆరాధించవలసిన రోజు. 

అది ముఖ్యం. 

ఇంతకీ మన పండుగలన్నీ ఆయా పండుగలకు సంబంధించిన దేవతల ఆరాధనలో గడుపవలసిన రోజులు. 

అంతేగానీ కేవలం ఉత్సవాలు కాదు.

 పండుగ అనగానే హడావిడి చేసేది ఎవర్రా? 

ఆకలేష్‌: వ్యాపార సంస్థలు, పెద్దాయనా! 

“దీపావళీ ధమాకా!”

“దీవాలీ సేల్స్!”

“ఈ దివాలీ రోజు మా బ్రాండ్‌ చాక్లెట్లతో నోరు తీపి చేసుకోండి”

“ఈ హోలీ జరుపుకోండీ, మా కూల్‌డ్రింక్స్ తో!”

“ఈ సంక్రాంతి మా బ్రాండ్ ప్రోడక్ట్స్ తో ఇల్లంతా నింపుకోండి” 

అని అన్ని చోట్లా యాడ్స్ తో ఊదరగొడతారు పెద్దాయనా! 

దసరా దుర్గా పూజ కూడా వేడుకే! 


లొట్టేష్‌: బిర్యానీ కూడా తినొచ్చు. 


పెద్దాయన: పండగంటే  ఆరాధన, ఆరాధన,ఆరాధన. 

ఆరాధనలో గడపవలసిన ముఖ్యమైన రోజు.
 
మిగిలిన వేడుకలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి కుటుంబం అంతా కలిసి పూజ చేసుకోవాల్సిన రోజు. 

లొట్టేష్‌: బిర్యానీ కంపల్సరీ ఉండాలి.

పెద్దాయన: బిర్యానీ యుద్ధంలో ఉన్న మొగలాయి సైనికుల కోసం అన్నం, మాంసం, ఇతర ద్రవ్యాలు అన్నీ కలిపేసి ఉడికించి పెట్టడడంలో తయారైన వంటకం.
 
ఈ బిర్యానీలకి మన పండుగలకి ఏ సంబంధం లేదురా అబ్బాయ్! 

లొట్టేష్‌: బిర్యానీ ఇంట్లో చెయ్యకపోతే బయట హోటెల్‌ కెళ్ళి తింటా అంతే! ఆ! 

పెద్దాయన: రేయ్‌, తెలివి తక్కువ సన్నాసీ! 
చెబుతున్న విషయం మీద శ్రద్ధ లేకుండా బిర్యానీ,బిర్యానీ అని తెగ కలవరిస్తున్నావ్‌? 

 ఇంకోసారి బిర్యానీ అన్నావనుకో మూతి మీద కొడతా గాడిదా!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!