నాది తెలుగని, నేను తెలుగని పలుకరా!
మీ పిల్లది మాబళ్ళో చదవాలంటే తెలుగులో అస్సలు మాట్లాడకూడదు.
సరే సార్!
ఇంట్లో కూడా మీరంతా మీ పిల్లదానితో ఇంగ్లీషులోనే మాట్లాడాలి.
సరే సార్!
బొట్టు పెట్టుకుని బడికి రాకూడదు.
సరే సార్!
గాజులు వేసుకోకూడదు.
సరే సార్!
కాళ్ళకు పట్టీలు పెట్టుకోకూడదు.
సరే సార్!
గొలుసులు వేసుకోకూడదు.
సరే సార్!
పువ్వులు పెట్టుకోకూడదు.
సరే సార్!
దారినపోయే దానయ్య: ఏందిరా గంగిరెద్దులాగా అన్నింటికీ సరే సార్! అని తలూపుతుండావు? మన అమ్మ పలుకు పోయి, మన వేషం కట్టుబొట్టు అన్నీ తీసేసి ఏందిరా ఈళ్ళు సెప్పే సదువులు? అట్టా కుదరదని గట్టిగా సెప్పు. పిలకాయలు లేకుండా బడెట్టా నడుపుతారో సూద్దాం. పులిలాగా లేవాల.
దారిన పోయే దేశభక్తుడు: ఇది నీ దేశమయ్యా. నీకోసం ఎంతోమంది దేశభక్తులు ప్రాణాలిచ్చారయ్యా. ఇలా బానిసలా బతకమని కాదు. నువ్వు భరతమాత ముద్దుబిడ్డవి. సింహానివి. లే! నీ భాష కోసం, నీ సంస్కృతి కోసం మాట్లాడు.
వెయ్యేళ్ళుగా వానపాములా పడి ఉండడం అలవాటై పోయింది సార్! ఇప్పుడేమో మీరొచ్చి నువ్వు వానపామువి కాదు, నాగు పామువి, పులివి,సింహానివి అంటుంటే ఏంటో కొత్త కొత్తగా ఉంది సార్.
చాలా ధాంక్స్ సార్ ధైర్యం, దన్ను ఇచ్చినందుకు.
దారిన పోయే దానయ్య, దేశభక్తుడు: చాలా బావుందయ్యా. దీనికి తొలి మెట్టుగా ముందు నువ్వా ధాంక్సులు, ధమ్సప్పులు చెప్పడం ఆపెయ్. నీ భాషని, సంస్కృతిని గౌరవించని వాడికి సార్, సార్ అని వంగి వంగి దండాలు పెట్టడాలు మానెయ్. సరేనా? విజయోస్తు.