బఠాణీ పాటల పండిత తిరకాస్
సినీ గీత రచయిత తిరకాస్ ఇటీవల రాసిన ఓ పాట పై కొందరు కవులు, రచయితలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివరణ ఇవ్వడానికి ఆయనో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసాడు.
విలేఖరి: మీరు ఇటీవల రాసిన పాట-
పీతా !
పీతా !
మనసైన
మల్లెలు
రోతా?
అన్న పాట, పాత సినిమాలో,
రాధా !
రాధా !
మదిలోన
మన్మథ
గాథా !
అన్న పాటకు అనుకరణ అంటున్నారు. మీరేమంటారు?
తిరకాస్: ఆ ఆరోపణ పూర్తిగా తప్పని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అనుకరణ వేరు, ప్రేరణ పొందడం వేరు. అర్థం అవుతోంది కదండీ? నేను ఆ పాత పాటనుండి ప్రేరణ మాత్రమే పొందాను. అది ప్రేరణ మాత్రమే అనుకరణ కాదు అని తెలియజేసుకుంటున్నాను.
విలేఖరి: హీరోయిన్ ను హీరో పీతా అని పిలవడమేమిటని అభ్యంతరం చెబుతున్నారు. దానికి మీ సమాధానం?
తిరకాస్: ఇది విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల వచ్చిన ఆక్షేపణ.
పీత అనేది బుజ్జిగా, చిన్నగా అందంగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీలో చాలామందికి ఆ విషయం తెలియకపోవచ్చు. అందుకని నేను నొక్కి వక్కాణిస్తున్నాను. అందువల్ల, బుజ్జిగా, చిన్నగా,బొద్దుగా ఉన్న హీరోయిన్ని హీరో, పీతా, పీతా అని పిలవడంలో గొప్ప రసజ్ఞత ఉంది. అది రస హృదయం ఉన్న ప్రేక్షకులకి మాత్రమే అర్థం అవుతుంది.
విలేఖరి: మీరు మీ పాటలో రోతా,వాతా, తీతా,తొక్కుతా లాంటి అసహ్యకరమైన పదాలను వాడ్డం వల్ల పాట అందం చెడిపోయిందని కొందరు ఆక్షేపిస్తున్నారు. మీరేమంటారు?
తిరకాస్: ఈ ప్రశ్న వస్తుందనే నిన్ననే తెలుగులో ఉన్న అలంకారాలన్నీ బట్టీ పట్టుకొచ్చా. వినండి. మనకు ఎర్ర బస్సాలంకారము, రిక్షాలంకారము, జట్కాలంకారము ఇలా ఏభై ఎనిమిది రకాల అలంకారాలు ఉన్నాయి. కానీ, ఎవ్వరికీ తెలియని మరో అలంకారముంది. అది, విరోధాభాస వికృత అలంకారము. మొన్ననే ఈ పాట కోసం నేను చేస్తున్న పరిశోధనలో భాగంగా కొన్ని మళయాళీ తంత్ర గ్రంథాలు తిరగేస్తుంటే ఈ అలంకారం కన్పించింది. వెంఠనే నా పాటలో వాడెయ్యడం జరిగింది. వికృతమైన, విరోధాభాస ఉన్న పదాలు వాడి అందుకు విరుద్ధమైన భావాన్ని పుట్టించడం అన్న మాట. ఇది మీకు పూర్తిగా అర్థం కావాలంటే కొన్ని పుస్తకాల పేర్లు ప్రెస్ రిలీజ్ చేస్తాను, అవన్నీ చివరి పేజీ వరకూ చదివి నోట్సు రాసుకుని సారాన్ని పిండితే మీకు ఆ పాటలో ఆ పదాలు నేనెందుకు వాడానో తెలుస్తుంది. విషయం మీద అర్థమైందని భావిస్తాను, కాకపోతే చెప్పండి. మళ్ళీ వివరిస్తా.
విలేఖరి: మీ రాబోయే ఇతర పాటల గురించి చెప్పండి.
తిరకాస్: నా రాబోయే ఇంకో పాట-
వైజయంతీ !
వైజయంతీ !
నీకెందుకంత
కుతి?
పోయిందా
మతి?
ఈ పాట గురించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతాయని తెలుసు. అవన్నీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఆ సమావేశంలో చివరి కుర్చీలో కూచుని ఇదంతా వింటున్న బ్రహ్మీ,
నీ బొందరా నీ బొంద. ఇక్కడికొచ్చినందుకు మాకు లేదురా మతి. హాఫ్ నాలెడ్జీ ఓవర్ ఏక్షనూ నువ్వూను. వినే వాళ్ళకి సగం మందికి తెలుగు రాదు, సగం మందికి ఛాయిస్ లేదు. అందుకే నీలాంటోళ్ళు ఎగిరెగిరి పడతన్నారు. తెలుగు పాటకి ఏం గతి పట్టిందిరా నాయనా! థూ! ఇదో పాటా? తొక్కలోది.
అని మనసులో అనుకుంటూ చాయ్ బిస్కెట్ కోసం పైకి లేచాడు.