కల్లు మామకు కోపమొచ్చింది
బాల సాహిత్యంపై సభ జరుగుతుంది.
పెద్ద పెద్ద బాల సాహితీకారులంతా విచ్చేసారు.
నమస్కారం. నేను బాల బంధు వికటేశ్వర రావుని.
నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల సాహిత్యంలోని అన్ని అవార్డులూ వచ్చాయి. ఎవరైనా అవార్డు పెట్టగానే నేనే వారిని కాంటాక్టు చేసి నా గొప్పదనాన్ని వారికి విశదీకరించి మొహమాట పడకుండా ఆ అవార్డు పుచ్చుకుని వస్తా.
ఇటీవల అవార్డు పొందిన నా పుస్తకంలోంచి ఒక పిల్లల కథ వినిపిస్తా.
అనగనగా ఒక దెయ్యం. ఆ దెయ్యానికి ఓ అలవాటు ఉండేది. రోజూ ఓ మనిషిని చంపి పాతిపెట్టడం. అలా ఓరోజు తను ముందు రోజు చంపిన మనిషి లోపలినించి అరుస్తున్నట్టు శబ్దాలు చేయడంతో అక్కడ తవ్వి చూస్తే తను చంపిన మనిషి బ్రహ్మ రాక్షసుడై వచ్చాడు. ఆ బ్రహ్మ రాక్షసుడు ఆ దెయ్యాన్ని తినేసి ఎముకలు పాతి పెట్టి, పాతిపెట్టిన ఎముకల్లో కొన్ని మెడలో వేసుకుని…
ప్రేక్షకుల్లో కూర్చున్న కల్లు మామకు భయంతో చెమటలు పోసాయి. ఈ బాలబందు కతలా నా పిల్లలు చదువుతుంది? అని.
నమస్కారం. నా పేరు బాల రత్న కిష్నా రావు.
నాకు ఇటీవల బాల సాహిత్యంలో బీభత్స అకాడెమీ అవార్డు వచ్చింది. అవార్డు పొందిన నా పిల్లల పుస్తకం నుండి ఒక కథ మీకోసం-
పూర్వకాలంలో చిలుకలన్నీ నల్లగా ఉండేవి. అవి నల్లగా ఉన్నాయని ఆ అడవిలోని అన్ని జంతువులు వాటిని ఎగతాళి చేసేవి. వాటిని చూసిన చేపలు నవ్వేవి. కోతులు కిచకిచగా హేళన చేసేవి. అడవిలోని ప్రతి జీవి చిలుకల నల్లదనాన్ని చూసి హేళన చెయ్యడమే. ఆ చిలకలేమో వెక్కి వెక్కి ఏడ్చేవి. ఓ రోజు అవన్నీ కలిసి వన దేవత దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకున్నాయి. వన దేవత అవి చెప్పిందంతా విని, ఓస్, మీకు నలుపు కాకుండా వేరే రంగు కావాలి, అంతే కదా. మీ వంటికి పచ్చ రంగు ఇస్తున్నా తీసుకోండి. మీ ముక్కులకు ఎర్ర రంగు పూస్తా, తీసుకోండి అని వరం ఇచ్చింది. అప్పటినించి చిలుకలు పచ్చ పచ్చగా ఎర్ర ముక్కుతో అందంగా తయారయ్యాయన్న మాట. అదీ కథ.
ఈ కథ విన్న కల్లు మామ ఆశ్చర్య పోయాడు.
పిల్లలకి నలుపు తెలుపు అని చిన్నతనంలోనే తక్కువతనం కలిగించడమేంది? ఆ నలుపు చూసి ఎగతాళి చేత్తారని చెప్పడమేంది? మన దేశంలో ఎక్కువ మంది నలుపేగా, లేకపోతే చామనచాయేగా. ఇవా బాల రత్న కతలు? అనుకుని విసుక్కున్నాడు.
నమస్కారం. నా పేరు బాల మిత్ర శకటారావు.
నేను చాలా యేళ్ళుగా బాలల పుస్తకాలు ప్రచురిస్తున్నా. ఎన్నెన్నో బిరుదులు, అవార్డులు పొందా. నా కథ ఒకటి చదివి వినిపిస్తా.
అనగనగా ఒక అత్తా కోడలు. అత్త కోడలిని కొట్టేది. కోడలు అత్తని తిట్టేది. కొడుకు కోడలిని తిట్టేవాడు. ఓ రోజు కోడలు అన్నంలో విషం కలిపి…
ఇందాకటి నుండి ఓపిక పడుతున్న కల్లు మామకి బీపీ అమాంతం పెరిగి పోయింది. చేతిలో కర్ర తీసుకుని పైకి లేచి, పిల్లల కతలు రాసే మొహాలారా మీవి? పిల్లల కతలంటే ఎలా ఉండాలిరా? చకచక్కని నీతిని చలచల్లగా చెప్పాల్రా. రాములోరి మెడలో దండలాగా అందంగా ఉండాల్రా పిల్లలకు చెప్పే కతలు.
చంపుకోడాలు, తిట్టుకోడాలు,ఏడ్చుకోడాలు ఏంట్రా పిచ్చినాయాళ్ళారా. తొడపాశం పెట్టాల్రా మీ అందరికీ. గోడ కుర్చీ ఏయించాలి గాడిద కొడుకుల్లారా. బాల బందుల్రా మీరు బొందుగాళ్ళారా అని రెచ్చిపోతూ బాలబొందూస్ గాళ్ళ వీపులు విమానం మోత మోగిస్తుంటే-
అప్పుడే కుడుములు ఆరగించిన గణపయ్య అది చూసి, నిండు చందమామతో కలిసి మబ్బుల్లో దొర్లి దొర్లి నవ్వడం తెలుగు పిల్లలందరికీ కనువిందు చేసింది. కిలకిలా నవ్వించింది.