ఒక కథ,అనేక దర్శకులు-part-1
Story Plot1:
రాజు, రాధ ప్రేమించుకున్నారు. కానీ విధివశాత్తూ రాధ పెళ్ళి సోముతో జరిగిపోయింది. ఆ తరువాత కొన్నేళ్ళకి కాకతాళీయంగా రాజు, రాధ ఇంటికి రావడం తటస్థించింది.
దాసరి :
రాజు: రాధా, ఇది మీ ఇల్లా? ఎలా ఉన్నావు రాధా? నీ చేత్తో కాఫీ ఇస్తావా?
రాధ: ఏదో ఇలా ఉన్నాను. జీవితాన్ని ఇవ్వలేక పోయినా కాఫీ తప్పక ఇస్తాను రాజూ..
రాజు: కాఫీ చాలా బావుంది రాధా. ఆనాటి మన ప్రేమలాగే.
చక్కెర కాస్త తక్కువైంది.
రాధ: నువ్వు వెళ్ళిపోయాక నా జీవితంలో చక్కెర కరువైనట్టుగానే.
రాజు: పాలు కూడా కొంచెం తక్కువైయ్యాయి, రాధా!
అయినా పరవాలేదు. సర్దుకు పోతాను.
నా జీవితంతో నేను సర్దుకు పోతున్నట్టే.
రాధ: అయ్యో, నా తలరాత. నా జీవితాన్ని పంచివ్వలేక పోయాను. కనీసం మంచి కాఫీ కూడా ఇవ్వలేక పోయాను.
రాజు: కాఫీకేం?
పాలు తక్కువైనా, చక్కెర తక్కువైనా అమృతంలా ఉంది,రాధా! అభిమానం, ఆప్యాయత రంగరించి నీ చేత్తో ఇచ్చావుగా.
ఇంతలో ఫ్లవర్‌వాజ్ భళ్ళున పగిలిన చప్పుడు.
సోమూ వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళి పోతున్నాడు.
రాధ, రాజుల సంభాషణ సోమూ విన్నాడా?
ఆ తరువాత ఏం జరిగింది? వెండి తెరపై చూడండి.
రాఘవేంద్రరావు :
రాజు: రాధా, ఇది మీ ఇల్లా? బావుంది.
నువ్వు అంతకన్నా beautiful గా ఉన్నావు.
ఏమీ మారలేదు. అదే beauty!
( రాజు ఊహల్లో ఇప్పుడొక ఊహా duet)
రాధ: Same to same.
నువ్వూ ఏమీ మారలేదు.
అదే naughty!
( ఆ మాట వినగానే ఔచిత్యభంగం లేకుండా మళ్ళీ రాజు ఊహల్లోనే ఇంకో ఊహా duet)
రాధ: నాకు పెళ్ళైపోయింది.
రాజు: పోతే పోయింది. మనం మంచి friends గా ఉందాము.
( మళ్ళీ ఇంకో పాట. ఇది మాత్రం స్నేహ గీతం)
రాధ: ఇంకో విషయం చెప్పాలి, రాజు. ఈమధ్యే మావారు స్వర్గానికి వెళ్ళారు.
రాజు: ఇంత ఆలస్యంగానా చెప్పడం? నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను.
( మళ్ళీ ఇంకో duet. ఈసారి రాజు,రాధ ఇద్దరి ఊహల్లో)
కే.విశ్వనాథ్:
రాజు: రాధా, ఇది మీ ఇల్లా. వీథిలో వెళుతూ నీ పాట విని, నీ గొంతు గుర్తు పట్టి లోపలికి వచ్చాను. నువ్వు పాడుతోంది కనక ప్రియ రాగం కదూ? ఆ రాగం వింటుంటే నాకు శివపార్వతుల అనురాగమే గుర్తొస్తుంది. ఈ జన్మలో శివపార్వతులం కాలేకపోయాం. కనీసం కలిసి కనక ప్రియ పాడుకుందాం. నువ్వు పాడు. నేను ఈ వయెలిన్ పుచ్చుకుని నీతో శృతి కలుపుతాను.
రాధ: అంత కన్నానా. ఇవాళ చారు పెట్టాను. ఎందుకో చారుకేశి పాడాలనిపిస్తోంది,రాజూ. నువ్వు వయెలిన్ శృతి చేసుకో. నేను గొంతు సరి చేసుకుంటాను.
వాళ్ళిద్దరూ అలా కర్ణాటక సంగీతంలో మునిగి ఉండగా సోము అక్కడికి వచ్చాడు.
అది చూసి రాధ పాడ్డం ఆపి-
మీరా? ఎంత సేపైంది వచ్చి?
సోము: చాలా సేపైంది. కళారాధనలో మునిగి ఉన్న ఇద్దరు కళాకారులను మధ్యలో అపశృతిలా వచ్చి ఇబ్బంది పెట్టడం మహాపరాధం. అది సంగీత సాహిత్య సమలంకృతురాలైన సరస్వతీ దేవి పట్ల అపచారం.
ఈ మాటలు విని రాధ తల వంచుకుంటే, తల ఎత్తి సోము వంక చూసిన రాజుకు మతిపోయింది.
ఎదురుగా తన సంగీత గురువు సోము the సోమయాజి!
అంటే, తను ప్రేమించింది తన గురువు గారి భార్యనా?
తన ప్రియురాలే తన గురు పత్నా?
గురు పత్ని తల్లితో సమానం.
ఎంత అపచారం!
తను ఇప్పుడో గురుద్రోహి!
వెంటనే లేచి, రాధ కాళ్ళకి, తన గురువు సోము కాళ్ళకి నమస్కారం చేసుకుని, అలా పాడుకుంటూ నడుచుకుంటూ సరయూ నదిలోకి వెళ్ళి నదిలో కలిసి పోతుంటే,
ఉత్తములైన వారు
ఏమి చేస్తారో,
ఎలా ప్రవర్తిస్తారో
లోకం అంతా
వారినే అనుసరిస్తుంది
అన్న అక్షరాలు నదిలోంచి బయటికి వస్తుండగా,
శుభం కార్డు,
తర్వాత “ఇది కళాతపస్వి కే.విశ్వనాథ్ సవినయ సమర్పణ” అన్న అక్షరాలు.