ఒక కథ,అనేక దర్శకులు-part-3
Story Plot1:
రాజు, రాధ ప్రేమించుకున్నారు. కానీ విధివశాత్తూ రాధ పెళ్ళి సోముతో జరిగిపోయింది. ఆ తరువాత కొన్నేళ్ళకి కాకతాళీయంగా రాజు, రాధ ఇంటికి రావడం తటస్థించింది.
దర్శకుడు విసు ( ఆడదే ఆధారం ఫేం):
రాజు: రాధా, సరుకులు తేవడానికి పచారీ కొట్టుకు వెళుతూ నిన్ను చూసి ఇటు వచ్చాను. ఇది మీ ఇల్లా? నిన్ను చూస్తుంటే ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయిన భారత వనితలాగా ఉన్నావు, రాధా. చాలా సంతోషం. నేను అల్పుడిని. దురదృష్టవంతుడిని. విధి వక్రించి మనల్ని విడదీసింది. రాధా, నిన్ను పెళ్ళాడిన ఆ అదృష్టవంతుడెవరో తెలుసుకో వచ్చా రాధా?
రాధ: రాజు, నిజమే. విధి ఆడిన వింత నాటకంలో నువ్వు, నేనూ పావులమయ్యాం,రాజు! నేను సోమూ గారికి శ్రీమతిని కావాల్సి వచ్చింది. అయినా వివాహమైన మరుక్షణం నుండీ ఒక భార్యగా, ఒక ఒదినగా, ఒక మరదలిగా, ఒక కోడలిగా, ఒక తోడి కోడలిగా నా విధులను తూచా తప్పకుండా నిర్వహిస్తూ ఒక గొప్ప ఇల్లాలిగా పేరు తెచ్చుకుంటూ అటు పుట్టింటికీ ఇటు మెట్టింటికీ ఖ్యాతి తెస్తున్నాను రాజూ..
రాజు: ఆహా! ఎంత చల్లని మాట చెప్పావు, రాధా! ఒక తల్లిగా,ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక ఆడబడుచుగా ఆడదాని త్యాగాలకు వెల కట్టలేం, వెల కట్టలేం! నీ విధి నిర్వహరణకే నీ జీవితాన్ని అంకితం చెయ్యి రాధా. నేను త్వరగా సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది.
రాధ: అలాగే చేస్తాను రాజు. నిన్ను పెళ్ళాడిన ఆ అదృష్టవంతురాలు, నీ ఇల్లాలు ఎవరు రాజు?
రాజు: నేను పెళ్ళి చేసుకోలేదు, రాధా!
భర్త వదిలేసిన అక్క, పెళ్ళి కాని ముగ్గురు చెల్లెళ్ళు, డిగ్రీలు చేసి ఇరవై యేళ్ళు అయినా ఇంకా ఉద్యోగాలు రాని నలుగురు తమ్ముళ్ళు, ఒక అమ్మ- ఇంతమంది నామీద ఆధారపడి ఉంటే నేను పెళ్ళి ఎలా చేసుకోను రాధా? అందుకే ఈ జీవితంలో పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను రాధా. అయినా నిన్ను ప్రేమించి మరొకరిని మెడలో ఎలా తాళి కట్టగలను రాధా?
రాధ: రాజు!రాజు!రాజు! ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావ్ రాజు!!
వంశీ:
రాజు: రాధా, అడగనులే చిరునామా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా అని పాడుకుని నీ చిరునామా తీసుకోక పోవడం వల్ల ఇన్నేళ్ళు దూరం అయ్యాం. గోదాట్లో చేపలా కొట్టుకుంటూ అలా ఉండిపోయిన నాకు వెన్నెల్లో గోదారి అందంలా నువ్వు కనిపించావ్. ఎలా ఉన్నావ్ రాధా?
రాధ: అమావాస్యలో గోదాటి రేవులో గుంజకు కట్టేసిన పడవలా ఉన్నా రాజు.
రాజు: ఆ! నిన్నూ నన్నూ కలిపిన గోదారి ఇలా మనల్ని దూరం చేసి నవ్వుతుందనుకోలేదు. మీ వారు ఎలా ఉన్నారు?
రాధ: లేరు.
రాజు: లేరంటే ఈ లోకంలోనే లేరా రాధా?
రాధ: కూరలు తేవడానికి బజారుకు వెళ్ళారు.
రాజు: ఓస్, అంతే కదా. నేనింకా ఏదో అనుకున్నాను. అరే, నీ బుగ్గ మీద జమ జచ్చ! ఓహ్! హిప్! హిప్! హుర్రే!
నిన్ను అయిదేళ్ళు ప్రేమించినా నీ బుగ్గ మీద ఉన్న కుంకుడుకాయంత మచ్చ గమనించనే లేదు సుమీ! ఇంక నన్నెవ్వరూ ఆపలేరు.
( అని జేబులో ఉన్న తాళి తీసి రాధ మెడలో కట్టి, రాధను భుజాన వేసుకుని పరుగు పరుగున గోదావరి ఒడ్డుకు మోసుకెళ్ళాడు)
రాధ: రాజు,రాజు,రాజు! అది పుట్టు మచ్చ కాదు. రోజూ నేను కాటుకతో పెట్టుకునే బుగ్గన చుక్క!
రాజు: పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చా? అయినా ఏం పర్వాలేదు. పుట్టు మచ్చతో మహా రాజ యోగం అయితే పెట్టు మచ్చతో కనీసంలో కనీసం మంత్రి యోగం అయినా పడుతుంది. నువ్వా పెట్టుడు మచ్చ అలాగే కంటిన్యూ చెయ్.
రాధ: నాకు పెళ్ళైపోయిన విషయం మర్చి పోయావా రాజు?
రాజు: అదిగో చూడు, మీ ఆయన కూరగాయల సంచి గోదాట్లో విసిరి కొట్టి ఎలా వెళ్ళి పోతున్నాడో చూడు. మీ ఆయన కట్టిన తాళి తీసెయ్. నేను కట్టిన తాళి దాచుకో. కన్నీళ్ళు తుడుచుకో రాధా. జమ జచ్చ పోకుండా చూసుకో డార్లింగ్!