The practical రచయిత

 


ప్రముఖ ప్రాక్టికల్‌ రచయిత శ్రీ బండబారి గారితో ప్రశ్నారావు గారి ఇంటర్యూ-

ప్రశ్నారావు: మీ దెయ్యాల ఊళ, భూతాల కోన, ప్రేత ప్రవల్లిక నవలలు చదివి ఆ రోజుల్లో మీ అభిమానిగా మారా సార్‌. అలాంటి రచనలు చేయడానికి కారణం మీకు మంత్ర తంత్రాల మీద ఆసక్తా సార్‌? 

బండబారి: చూడండి. నేను చాలా ప్రాక్టికల్‌.
 దెయ్యాలు,భూతాలు, చేతబడులు అంటే జనాలకి బాగా ఆసక్తి అని గ్రహించాను. అలాంటి నవల్లు రాసి బాగా డబ్బు, పేరు సంపాదించాను. అంతే సింపుల్‌. 

ప్రశ్నారావు: హహ, భలే చెప్పారు సార్‌. మీ సమాధానం చాలా బావుంది. మీ “గెలుపుకి పాకుడురాళ్ళు” అన్న పుస్తకం చాలా పాపులర్‌. దాని గురించి చెప్పండి. 

బండబారి: చూడండి. నేను చాలా ప్రాక్టికల్‌.
సెంటిమెంట్లు తుంగలో తొక్కి,  ప్రాక్టికల్‌ గా ఎలా బతకాలో, చుట్టు పక్కల వాళ్ళ మీద ఎలా గెలవాలో  నా పుస్తకంలో తెలుగు ప్రజలకి నేర్పాను. ఇప్పుడొస్తున్న టీవీ సీరియళ్ళలో నక్క జిత్తులు, ఎత్తుకు పై ఎత్తులు నా పుస్తకంనించి తీసుకున్నవే. 

ప్రశ్నారావు: హహ, భలే చెప్పారు సార్‌. మీ సమాధానం చాలా బావుంది. ఆ రోజుల్లో మీకు ప్రపోజ్‌ చేస్తూ ఎంతో మంది లేడీ ఫాన్స్ ఉత్తరాలు వ్రాసే వారని విన్నాము. ఆ విషయం గురించిన విశేషాలను మా పాఠకులతో పంచుకుంటారా? 

బండబారి: చూడండి. నేను చాలా ప్రాక్టికల్‌. నాకు చాలామంది లేడీస్‌ ఉత్తరాలు వ్రాసిన మాట వాస్తవమే. వారందరికీ ఒకటే చెప్పే వాడిని. మీరు నన్ను అభిమానిస్తున్నారు కాబట్టి ఫ్రీగా ఎంతైనా ప్రేమించి పెడతాను. పెళ్ళి చేసుకోమని మాత్రం అడగొద్దు అని. 

ప్రశ్నారావు:  హహ, భలే చెప్పారు సార్‌. మీ సమాధానం చాలా బావుంది. ఇంతటితో ఈ ఇంటర్వూ ముగిస్తున్నాను.  మీ విలువైన సమయాన్ని మా పత్రిక కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. 

బండబారి: చూడండి. నేను చాలా ప్రాక్టికల్‌. 
మీ ఇంటర్వూ కోసం గంట సేపు కేటాయించాను. నా సమయం చాలా విలువైంది. ఈ గంటలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ క్లాస్‌ తీసుకుంటే నాకు పది వేలు వస్తాయి. కాబట్టి ఆ పది వేలు, ప్లస్‌ గంటసేపు ఏసీ ఖర్చు, మీరు తాగిన టీ ఖర్చు, మీరు తిన్న ఉప్మా ఖర్చు అన్నీ కలిపి పన్నెండు వేలు అక్కడ పెట్టి అప్పుడు కదలండి. లేకపోతే మీమీద చట్టపరమైన చర్య తీసుకుంటా. 

ప్రశ్నారావు: సార్‌…..!!



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి