చీరేస్తే చీరేస్తాం

 


మేం ఇకనించీ చీరలే కట్టుకొస్తాం అని డిగ్రీ అమ్మాయిలు, లంగా ఓణీలలోనే వస్తాం అని ఇంటర్‌ అమ్మాయిలు ప్రతిజ్ఞ చేసారు ఓ కాలేజీలో.


 అది మిగిలిన కాలేజీలకీ పాకడంతో  చీరలు, పరికిణీ ఓణీలు వేసుకున్న విద్యార్థినులతో రాష్ట్రమంతా కళకళలాడసాగింది.

దీని మీద-

 పెడదారి టీవీ ఛానల్‌ యాంకర్‌:

ఇక మీదట మోడ్రన్‌‌ దుస్తులు వద్దు, చీరలు ఓణీలే ముద్దు అంటున్న అమ్మాయిలు! 

ఇది వెనకబాటుతనమా? 

పాకెట్స్ లోంచే రాకెట్స్ లాంచ్‌ చేస్తున్న ఈ అణుయుగంలో ఇంకా చీరలా? 

మనతో బాటు ఉన్నారు, ప్రముఖ యాక్టివిస్ట్ పప్పుల పెద్దమ్మ గారు. ఆవిడేమంటున్నారో విందాం: 

ఆ ఆడపిల్లలు అలా ప్రతిజ్ఞ చేయడానికి కారణం బ్రామ్మినికల్‌ పేట్రియార్కీతో వాళ్ళ బుర్రలన్నీ బ్రెయిన్ వాష్‌ చేయబడడమే. 
ఇది హిందుత్వవాదుల కుట్ర.

ఇది నిస్సందేహంగా దేశాన్ని పదిహేను వందలేళ్ళు వెనక్కి తీసుకుపోవడమే. 

తరతరాలుగా అణిచివేయ బడ్డ స్త్రీ బానిసత్వానికి సంకేతం 
ఆ ఓణీ, ఆ చీర.

 చీరలను కాకులకు గద్దలకు వేయాలి!
ఓణీలను వల్లకాట్లో పడెయ్యాలి!


పెడవాద చరిత్రకారుడు: 

అసలు ఈ చీరలు,ఓణీలు మన భారతదేశానివి కాదు.
 ఓణీలు ఆఫ్రికానుండి, చీరలు అరేబియా నుండి వచ్చాయి. 
వాళ్ళు మానేసారు గానీ మనం వేసుకుంటున్నాం.
 కాబట్టి చీరలు,ఓణీలు మన మీద రుద్దబడ్డాయి. 
వాటిని నేటి నుండి రద్దు చేయాలని నేను ఐక్యరాజ్య సమితికి ఉత్తరం రాస్తున్నా. 

పెడవాద సాహితీకారుడు: 

ఈ చీరలు కట్టిన ఇంతులను, ఓణీలు వేసుకున్న పడుచులను వర్ణించి వర్ణించి పెట్టారు ఈ అగ్రవర్ణ కవులూ వాళ్ళు. 

ఇంక అగ్రవర్ణం వాళ్ళ సినిమాల్లో అయితే 
సరిగంచు చీర నేయించినాను అని,
 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని 
ఇంకా ఇట్టాంటివే తట్టలు తట్టలు చీరల మీద పాటలు రాసిపెట్టారు. 

అంతా ధనస్వామ్య అహంకార…


పెడవాద ఉద్యమకారుడు: 

చీరలు, ఓణీలు కట్టాలంటే ఎంతవుద్ది?
 బీదోడికి అయ్యేదేనా? 
చీర కట్టాలంటే ఒక్క చీర కొంటే అవుద్దా? 
దానికి మాచింగు ఎన్నెన్ని కొనాలి? 
ఇది ముమ్మాటికీ బీదోడి మీద బండరాయి. 

 SSR, జబరంగ్‌ జళ్‌ లాంటి హిందూ సంస్థలు దీని ఎనకమాల ఉన్నయ్యి.


ఈ వ్యవహారమంతా చూసిన ప్రభుత్వం ఇందులో మనకి ఓట్లు వచ్చే పాయింట్ ఉందని గ్రహించి వెంటనే “అన్న లంగాఓణీ పధకం” , “ఉండక్కా, చీర పెడతా పధకం” ప్రారంభించి కాలేజీ పిల్లలకి పంపిణీ చేయడం ప్రారంభించింది.

ప్రభుత్వం లాభపడుతోందని గ్రహించిన పెడవాదులు ఈ చీరలు అవీ కొనే క్రమంలో  పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తమ పెడ పత్రికల్లోను, పెడ ఛానెల్స్ లోను ఎడాపెడా ప్రచారం మొదలు పెట్టాయి.

తరువాత టన్నుల కొద్దీ మిడ్డీలు,మాక్సీలు గోదాముల్లో మూలుగుతున్నవని, ఆడపిల్లలు కొని కట్టకపోతే తమ బతుకు బస్టాండేనని మోడ్రన్‌ దుస్తుల వ్యాపారస్ధుల చేత రచ్చ రచ్చ చేయించారు. 

దానికి విరుగుడుగా అవన్నీ గాడాన్,వాడాన్‌,చాడాన్‌,పాడాన్‌ వంటి దేశాలకు ఎగుమతి చేయించే ఏర్పాటు చేయిస్తామని ప్రకటించి ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

ఈవిధంగా పెడవాదులంతా పెద్ద పెద్ద ఉద్యమాలను లేవదీస్తూ  పెదవాద మార్గ్ లో ఉన్న తమ పెడవాద పార్టీ ఆఫీసులో పెద్ద సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ఏమిటో ఎడాపెడా చర్చిస్తుండగా,

 అమాయక చక్రవర్తి అయిన ఓ పార్టీ కార్యకర్త లేచి, 

నాదో కొచ్చెన్‌ సార్‌! 
ఇది వరకు ఇట్టానే వేరే వర్గం వాళ్ళ ఆడోళ్ళు గోల చేత్తే మన పార్టీ అది  ఆళ్ళ అణిచివేత అని, ఆళ్ళ గొంతు నొక్కడం అని, ఆళ్ళ స్వేచ్చ అని, 
అదని ఇదని ఆ ఆడోళ్ళకి మద్దత్తుగా గోల చేయిపిచ్చింది కదా సారు. 

మరి ఇప్పుడు మన ఆడ పిలకాయలు లచ్చనంగా చీర కట్టుకుంటామంటాంటే ఒద్దని మనం ఉద్యమం చేసేదేంది? 
నాకర్దం కాలా? అన్నాడు అయోమయంగా.

అది విని అదిరిపడ్డ వృద్ధ జంబూక నాయక వర్గం, ఈ బుద్ధి లేని తిరోగమనవాదిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నాం అని ప్రకటించి మెడబట్టి బయటకు గెంటించింది. 

ముప్పై యేళ్ళుగా బార్యాబిడ్డల్ని సైతం పట్టించుకోకుండా పార్టీ జెండా మోశానన్నా అని బయట ఉన్న విలేఖరుల ముందు అతగాడు వాపోతే అక్కడున్న పెడవాద ఛానెల్స్ వాళ్ళు అతని మాటలను పెడచెవిన పెట్టి అవతలికి పొమ్మన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన