భూత పిశాచ నికట నహీ ఆవై!
దారిన పోయే దానయ్య: బైరాగి స్వామీ, మన ఆధునిక కవులు,రచయితల్లో ఎక్కువమంది నాస్తికుల్లా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా ఎవరిని పూజిస్తారయ్యా?
బైరాగి: వాళ్ళంతా పైకి సౌందర్య దేవతారాధకులమని చెప్పుకుంటూ ఉంటారు.
కానీ వారు కామ పిశాచికి వశులై ఉంటారు.
దాని చెప్పుచేతల్లో బతుకులు ఈడుస్తూ,
అది చెప్పినట్టు వింటూ,
దానికి నిత్యము పాదపూజ చేస్తూ,
వయసుకు తగని వెర్రిమొర్రి వేషాలు వేస్తూ
ఉన్మత్తావస్థలో ఉంటారు.
దానయ్య: అలాగా.
మరి శాకిని,ఢాకిని వంటి పిశాచాలు కూడా ఉన్నయ్యా స్వామీ?
బైరాగి: ఉన్నాయి.
అవి కొత్త కోడలు ఇంటికి రాగానే
ఈర్ష్యాఅసూయలతోను,
అభద్రతాభావంతోను
నిండిన మనస్సులు ఉన్న
ఆ ఇంటి అత్త గారిలోను,
ఆడపడుచుల్లోను ప్రవేశించి,
కోడలిని సాధించు,
హింస పెట్టు,
వేధించు అని
నిరంతరం చెవిలో పోరుతూ ఉంటాయి.
వాళ్ళ మనసులు ఎంత అరిషడ్వర్గాలతో నిండి ఉంటాయో,
అంతగా అవి వాళ్ళలో చెలరేగిపోతూ ఉంటాయి.
దానయ్య: అలాగా.
మరి మర్రి చెట్టు పైని బ్రహ్మ రాక్షసుడి కథలు విన్నాం కదా.
ఆ బ్రహ్మ రాక్షసులు ఇంకా ఉన్నారా స్వామీ?
బైరాగి: ఉన్నారు.
విద్యతో మనుషులను ఆకర్షించి,
వారిని తమ స్వార్థానికి వాడుకునే వారిలోను,
ఇతరుల విద్యను చూసి అసూయతో
వారి మీద ద్వేషం వెళ్ళగక్కే వారిలోను,
విద్య దగ్గర పెట్టుకుని,
అర్హులకు పంచని వారిలోను
ఈ బ్రహ్మ రాక్షసులు ఆవహించి ఉన్నారని తెలుసుకోవచ్చు.
దానయ్య: మరి ఈ పిశాచాలు అన్నీ కానీ, ఒకటికంటే ఎక్కువకానీ ఎవరిలోనైనా ఉండే అవకాశం ఉందా?
బైరాగి: తప్పకుండా ఉంది.
సమాజంలో
డబ్బు,
హోదా,
పరపతి
అన్నీ ఉండడం వల్ల
బుద్ధి వక్రించిన పెద్ద మనుషుల్లో
ఈ పిశాచాలు అన్నీ కొలువై ఉంటాయి.
అవి అన్నీ చేరి,
నిన్ను ఎవడూ ఏమీ చెయ్యలేడు,
తప్పు చెయ్యి ఏమీ పర్వాలేదు,
హింసించు,ఏమీ కాదు,
నీ స్వార్థానికి వాడుకో,
ఎవ్వడు ఏమీ పీకలేడు,
అని,
నిరంతరం చెవిలో
ఊదుతూ ఉంటాయి.
దానయ్య: పిశాచాల గురించి అంతబాగా చెబుతున్నావు స్వామీ,
ఏదైనా పిశాచి నిన్ను చంపడానికి వస్తే ఏం చేస్తావు?
బైరాగి: నా మీదకే తిరిగిందీ? పగ వాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికే మరణం అన్నాడని సామెత.
జితేంద్రియుడిని,
బుద్ధిమంతుడిని,
బలశాలిని
ఏ పిశాచీ ఏమీ చెయ్యలేదు.
మరి ఈ సద్గుణాలన్నీ ఎలా వస్తాయని అడగవేం?
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా సమామి।।
జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా సమామి।।
జితేంద్రియుడు,బుద్ధిమంతుడు అయిన హనుమను ఆదర్శంగా తీసుకుని జీవించడం వల్ల.
హనుమద్భక్తుడనైన నన్ను ఏ పిశాచీ ఏమీ చెయ్యలేదు!
భూత పిశాచ నికట నహీ ఆవై!
మహావీర జబనామ సునావై!
హనుమంతుడి మాట వింటూనే,
అయ్య బాబోయ్! అంటూ దానయ్య రూపంలో ఉన్న పిశాచి అక్కడినుండి ఎగిరి దాపులనున్న శ్మశానంలోకి పారిపోయింది.