పూజకు వేళాయె

 


ఏమిటే, స్పాంజితోను,గుడ్డ ముక్కలతోను కుట్టిన ఈ అమ్మవారి మొండేనికి, ఈ కొనుక్కొచ్చిన అమ్మవారి ముఖం తగిలించి పూజ చేస్తావా?
 నీ మొహంలా ఉంది! 
ఆ బొమ్మ తీస్కెళ్ళి షోకేసులో పెట్టుకో. 

నాకో కొబ్బరికాయ,పసుపు,బియ్యప్పిండి ఇవ్వు. 
చక్కని అమ్మవారి మొహం చేసి ఇస్తాను.

ఇదేమిటే? ఈ వెండి పూలు, బంగారు రంగు వేసిన పూలేవో పెట్టావు? ఇదేవిటి? ప్లాస్టీకు‌ పూలదండలా? 
పూలంటే ఇలా మనుషులు చేసిన పూలు పెడతారా ఎవరైనా? 

నిజం పూలు లేవూ?
 చక్కగా బంతులు,చామంతులు,మల్లెలు,గులాబీలు తెప్పించు.

ఏమిటే,ఇవి పీటకి అటూఇటూ పెట్టావు? 
ప్లాస్టీకు‌ అరటిబోదెలా? హవ్వ! 
పెరట్లోంచి రెండు అరటి బోదెలో,చిన్నవి అరిటాకులో ఉంటే తీసుకొచ్చి అలంకరణగా పెట్టు. లేకపోతే లేదు. అంతేగానీ ప్లాస్టీకు‌ చెట్లు పెట్టడమేమిటే? 

ఇదేమిటే? స్టీలువో వెండివో ఇవి? చెఱుకుగెడ బొమ్మలు పెట్టావు అటూఇటూ. 
దొరికితే నిజం చెఱుకుగెడలు తెచ్చి పెట్టాలిగానీ ఇదేమిటే బొమ్మలు పెట్టడం ఏమిటే? 

ఇదేమిటీ, వెండి తమలపాకు బొమ్మలా? రామ!రామ! 

అబ్బబ్బా! బామ్మా! ఇప్పుడిదే ట్రెండ్. ఇవన్నీ బజార్లోంచి కొనుక్కొచ్చి అలంకరించడమే ఫాషన్‌. పూజ ఎవరూ చూడరు. ఎంత గ్రాండ్‌గా అలంకరించామనేదే చూస్తారు. 

చూడు అమ్మడూ, మనం ప్రకృతిలో దైవాన్ని చూస్తాం.
 దైవం యొక్క రూపాన్ని ప్రకృతినుండే తయారు చేసి, ఆ రూపంలో దైవాన్ని ఆవాహన చేస్తాం. 
ప్రకృతి నుండి వచ్చిన పూలు,పళ్ళు,ఆకులతో ఆ రూపాన్ని పూజిస్తాం.  పూజ అయ్యాక, ఉద్వాసన పలికి,  ఆ రూపాన్ని, ఆ పూజాసామాగ్రిని తిరిగి ప్రకృతిలో కలిపేస్తాం. 

ఇదీ మన సంప్రదాయం. 
వినాయక చవితైనా, వరలక్ష్మీ వ్రతమైనా ఇలాగే చెయ్యాలి. 
తెలిసిందా? 

సరేలే బామ్మ, రేపు ఉదయం పూజ నువ్వు చెప్పినట్టే చేస్తాను.
  నువ్వు ముందీ ఉప్మా తిను కాస్త. 

అలాగే తల్లీ. పెట్టు. 
అయ్యో రామ! రామ! ఈ ప్టాస్టీకు పళ్ళెం ఏమిటే?
 అరిటాకులో వడ్డించలేవూ? 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన