దోస తీగవోలె పాకవలె తెలుగు
ఇయ్యాల తెలుగు భాషాదినోత్సవం తమ్మీ. నువ్వేం జేసావ్?
అవునన్నియ్యా, తెలుగు దినం అన్జెప్పి నాకు పదిమంది పంపిన శుబాకాంక్షల్ని నేనుంకో పదిమందికి forward చేసానన్నియ్యా.
అబ్బో, చానా గొప్ప పని. నీ పిల్లలు తెలుగులో మాట్లాడతారా?
నో అన్నియ్యా. పిలకాయలకి తెలుగు సరింగా రాదన్నియ్యా. ఆళ్ళంతా ఇంగ్లీషే నన్నియ్యా.
నువ్వు మాత్రం తెలుగోడివి, నీ పిల్లలు ఇంగ్లీషోళ్ళంటావ్? అంతేగా.
****************************** ****
తెలుగు సాహితీవేత్త గారు, తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలండీ.
ఈ రోజు ఏం చేసారు?
పొద్దున్ననగా లేచి తెలుగు భాష గొప్పతనం గురించి ఫేస్‌బుక్‌లో పెద్ద post పెడితే ఇప్పటిదాకా 60 likes, 20 loves వచ్చాయి. సాయంకాలానికి నెంబర్ పెరుగుతుందని చూస్తున్నా.
మీ పిల్లలు తెలుగు మాట్లాడతారాండీ?
చిన్నప్పుడు నేర్పించానండీ, ఇప్పుడు తెలుగులో మాట్లాడాలంటే కొంచెం షై ఫీలౌతారు.
ఓహో, తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పలేకపోయారా షై పోయేట్టు?
*****************************
తెలుగు సినీ కవి గారు, తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలండీ.
ఈ రోజు ఏం చేసారు?
పొద్దున్నే లేచి టీవీ వాళ్ళను పిలిచి,
తీపి తీపి
తెల్గు
ఇది
కడక్ చాయ్
తెల్గు
మందిని
తిట్టాలన్నా
పిల్లను
పట్టాలన్నా
పరేషాన్
గాకుండ్రి
మన్కుంది
తెల్గు
అని నేను ఫ్రెష్‌గా రాసిన పాటను పాడి వినిపిస్తే, ముంబై నుండి అమితాబ్ బచ్చన్ ఫోన్ చేసి అద్భుతమని మెచ్చుకున్నారు. ఈ భాషాదినోత్సవం నా జీవితంలో మరపురాని రోజు.
మీ పిల్లలకు మీఅంత తెలుగొచ్చా?
అబ్బే, నేను చాలా బిజీ కదండీ. అంతా మాయావిడే చూస్కునేది. మా పిల్లలు మొదట్నించీ ఇంగ్లీషే. తెలుగు కొంచెం మాట్లాడతారు గానీ చదవడం,రాయడం రాదు. ఇప్పుడింక ఫారిన్‌లో సెటిలయ్యారు.
ఓహో! మీ తెల్గు పాటకు వారసులు లేరన్న మాట.
****************************** *
అన్నయ్యా, తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలన్నయ్యా! ఇయ్యాల నువ్వేం చేసావ్ అన్నయ్యా?
మార్నింగ్ నించీ కూచోని,
తెలుగదేల యన్న అన్న మన అన్నగారి పద్యం సిన్మాలోంచి కట్ చేసి, దానికి శుభాకాంక్షలు add చేసి దాన్ని నా contact list లో అందరికీ పంపి, status లో కూడా పెట్టా తమ్ముడూ!
మరి, మీ పిల్లలకి తెలుగొచ్చా అన్నయ్యా?
ఈ పిల్లలు, వాళ్ళకి తెలుగు నేర్పడం ఇదంతా మనవల్ల కాదని అసలు పెళ్ళే చేస్కోలేదు తమ్ముడూ!
తెలుగు రాని పిల్లల్ని తెలుగు సమాజానికి ఇవ్వకపోవడమే తెలుగు జాతికి నా contribution!
అన్నయ్యా, అసలు నువ్వు కదా తెలుగు వీరుడివి!