తెలుగుకు పాడె కట్టామోయ్‌!

 


తెలుగు పెద్ద: తెలుగు చచ్చిపోతోంది. 
                    వేల యేళ్ళ చరిత్ర ఉన్న భాష. 

తెలుగు ప్రేమికుడు: ప్రభుత్వంతో పోట్లాడి కేజీ నుండి 
                           పీజీ వరకు తెలుగును తప్పనిసరి చెయ్యండి? 

తెలుగు పెద్ద: అబ్బే, ఏదీ అలా బలవంతంగా రుద్దకూడదండీ. 
                    ప్రజల్లోనే మార్పు రావాలి. 
                    వాళ్ళలో చలనం లేకపోతే మనమేం చేస్తాం?

తెలుగు ప్రేమికుడు: బావుందండీ, ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు. 

తెలుగు పెద్ద: తెలుగు చచ్చిపోతోంది. 
                    కొన్ని లక్షలమంది ఉన్న తెలుగుల జాతిభాష. 

తెలుగు ప్రేమికుడు: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వోద్యోగం చెయ్యాలంటే తెలుగు మీడియంలో చదివిన వారికి ప్రాధాన్యం ఇవ్వండి.
 
లావాదేవీలు, దస్తావేజులన్నీ తెలుగులోనే తప్పనిసరిగా ఉండాలని చట్టం తీసుకు రండి? 

తెలుగు పెద్ద: అబ్బే, చట్టాలతో కుదరదండీ.
                    ప్రజలే సొంత ఆసక్తి మీద తెలుగు నేర్చుకోవాలి. 

తెలుగు ప్రేమికుడు: ఆకలేస్తే రోకలి మింగమన్నాడట వెనకటికెవడో. 

బడిలో, కళాశాలలో, ఉద్యోగంలో అన్నిచోట్లా ఇంగ్లీషుతో ప్రభుత్వమే తలంటి పోస్తుంటే తెలుగును ఎవరు సరిగ్గా శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారు?

తెలుగు పెద్ద: సినిమాల్లోను, టీవీల్లోను తెలుగును దరిద్రం పట్టిస్తున్నారు. 
కనీసం దుకాణదారులైనా తెలుగులో బోర్డులు వ్రాయడం లేదు.

తెలుగు ప్రేమికుడు: ప్రభుత్వపరంగా తెలుగు సంఘం ఒకటి పెట్టి భాషను గమనిస్తూ సినిమాలకు, టీవీలు ఇతర మాధ్యమాలకు సూచనలు, సలహాలు అవసరమైతే జరిమానాలు విధించండి?

తెలుగు పెద్ద: అబ్బే, అలా నియంతృత్వ విధానాలు చేయడం సరి కాదండీ. 
ప్రచార మాధ్యమాల వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుని మారాలి. 

తెలుగు ప్రేమికుడు: అసలుకే లేదురా మగడా అంటే పెసర పప్పు వండవే పెళ్ళామా అన్నాడట, వెనకటికెవడో. 

ప్రసార మాధ్యమాలకి, సినిమా వాళ్ళకి భాష పట్ల అంత ప్రేమ,శ్రద్ధ ఉంటే ఇంక అనుకోవడం ఎందుకు? 

తెలుగు పెద్ద: తెలుగు మెల్లిమెల్లిగా చచ్చిపోతోంది.
                   
                    తెలుగులో సాంకేతిక పదాలు లేవు. 
                   అన్నీ ఇంగ్లీషు పదాలే వాడుకోవాల్సి వస్తోంది. 
                   
                    ఇప్పుడంతా సాంకేతిక విద్యలేగా. 
                   ఇంక తెలుగు ఎక్కడ పనికొస్తుంది? 
                   ఏదో సాహిత్యం చదువుకోవడానికి తప్ప?

తెలుగు ప్రేమికుడు: తెలుగు పండితులతో ఒక సంఘం ఏర్పాటు చేయండి. 
ప్రతి సాంకేతిక పదానికి వెంటనే ఒక తెలుగు పదం సృష్టించి ప్రకటించండి. 
అన్ని ప్రచార మాధ్యమాల్లోను, విద్యాలయాల్లోను, ప్రతి చోటా ఆ పదాన్ని ఆ రోజునుండీ తప్పకుండా వాడాలని చట్టం చేయండి? 

తెలుగు పెద్ద: అబ్బెబ్బే, అవన్నీ ఏ తమిళనాడులోనో సాధ్యం అవుతాయిగానీ మనకు కుదరదండీ. 
ప్రజల్లోనే స్వయంసిద్ధంగా మార్పు వచ్చి…. 

తెలుగు ప్రేమికుడు: తమరి బొంద, తమరి బోలె!     
 అక్క ఆర్భాటమేగానీ బావ బతకడని, ఇలాగే చవటాయ కబుర్లు చెబుతూ కూర్చోండి, ఇంకో అర్థ శతాబ్దిలో తెలుగు భాష తెలుగు నేల మీద మాయం అయి కూచుంటుంది.
 ఇంక మనకు మిగిలేది ఎంగిలి ఇంగిలీషే!

తమరి మొహం మండాని! వెధవ సంత!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి