గుర్నాథానికి దక్షిణామూర్తి దర్శనం

 



తాతాచారి, జెప్ఫా భాయి, వెవ్వెవ్వే వెంకోజీ, చండ్రహింసా రావు కలిసి ఏలూరు మురిక్కాలువ వంతెన మీద కాళ్ళు వేలాడేసుక్కూచుని వచ్చే పోయేవాళ్ళని చూస్తూ కామెంటరీలతో కాలక్షేపం చేస్తూ ఉండగా, 

అటుగా వెళుతున్న లేత రచయిత గుర్నాథం, ఈ ముదురు టెంకి సీనియర్‌ గాళ్ళని చూసి భక్తి పారవశ్యంతో నోట మాట రాక, 

సార్‌! సార్‌! సార్‌! ఇంతమంది సీనియర్లని ఒక దగ్గర చూసి నాకు నోట మాట రావడం లేదు సార్‌! బాగున్నారా సార్‌? అని పలకరించాడు.

బాగున్నాం గానీ, నువ్వేంటయ్యా అంత నీర్సంగా నిరుత్సాహంగా కనిపిస్తున్నావ్‌? అడిగాడు తాతాచారి, వీడితో కొంచెం కాలక్షేపం చేద్దాం అనుకుంటూ.

ఆమాత్రం మాటకే లేత రచయిత గుర్నాథం కదిలిపోయి, కన్నీళ్ళు పెట్టుకుంటూ- 

ఏం చెప్పను, గురూజీ. నాకు ఎన్నో గొప్ప ఆదర్శాలున్నాయి. 
నా రచనల్లో కూడా నా ఆదర్శాలన్నీ మసాలా వేసి కూరి కూరి కమ్మటి కథలు రాస్తున్నా. 
కానీ, నిజ జీవితంలో మోహాలు,వ్యామోహాలు,కోరికలు,కోపతాపాలతో అతలాకుతలం అయిపోతున్నా. 
నా ఆదర్శాలకు తగ్గట్టు నేను జీవించలేక పోతున్నా. 
ఆ ఆవేదన తట్టుకోలేక పోతున్నా సార్‌!  అన్నాడు.

ఆ మాటలకు వంతెన మీది సీనియర్స్ అంతా విరగబడి నవ్వారు. 

తాతాచారి వాళ్ళను కోప్పడి, 
చూడు గుర్నాథం, నువ్వు నీ రచనల్ని చాలా సీరియస్‌ గా తీసుకుంటున్నావని అర్థం అవుతోంది. 

కానీ, ఒక విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. 
రచనలు వేరు, మనుషులు వేరు. 
రచనల్లో చూపించిన ఆదర్శాలు రచయితలు పాటించాలని ఎవరు చెప్పారు నీకు? 

అవన్నీ గొప్ప కోసం, పేరు కోసం రాస్తాం. 

నిజ జీవితంలో హాయిగా సుఖంగా బతకడానికి అన్ని ఎత్తులూ వేస్తాం. ఎన్ని వేషాలు వేసి అయినా సుఖంగా బతకడమే కావాల్సింది. 
మహా రచయిత తిరకాసో చెప్పింది అదే. 
తెలిసిందా? అన్నాడు.

ఈ మాటలకు గుర్నాథం ఆశ్చర్య పడుతూ ఉండగా- 

లేజీ కవి భావుకశ్రీ, 
మహా రచయిత హలాహలం 
వీళ్ళంతా ఏం చేసారు? 
ఎలా బతికారు? 
వాళ్ళే మనకు ఆదర్శం.
Don’t worry my boy! 
అన్నాడు, వెంటనే అందుకున్న వెవ్వెవ్వే వెంకోజీ. 


ఈ మాటలేవో బావున్నట్టు అనిపించసాగింది గుర్నాథానికి,మెల్లిమెల్లిగా.


తప్పులు చెయ్యనివాడు మనిషే కాడు. 
తప్పుల మీద తప్పులు చెయ్యని వాడు మంచి రచయితే కాడు. 
అసలు లోకం తప్పు అనుకునే దాన్ని తప్పు అనుకోవడం మన తప్పు. 

హాయిగా తప్పులు చేస్తూ మనిషన్నాక రకరకాల సందర్భాల్లో స్వార్థం,ద్వేషం,అవకాశవాదం బయట పడతాయని మనల్ని మనం నమ్మించుకుంటూ పాఠకుల్ని నమ్మించాలి. 

Keep it up! All the best! 
హిహ్హిహ్హి అని ముక్తాయించాడు చండ్రహింసా రావు. 

గుర్నాథానికి ముందున్న అపరాధభావం అంతా తొలగిపోయి మబ్బులు విడిపోయి తేలికగా హాయిగా అనిపించసాగింది.

వలపు చిటికె మహా నచ్చేలా చిలిపి చిలకలకి వల వెయ్యాలోయ్‌! 
 అన్నాడు, ప్రసిద్ధ బిర్యానీ కవి హాజీ షంటో, చదవలేదా? అన్నాడు జెప్ఫా భాయి మధ్యలో నాది చూడు బుడంకాయ తొక్కు అన్నట్టు. 

మీ మాటలు వింటుంటే మనసుకు హాయిగా ఉంది సార్‌! 
ఇకనించీ రచనల్లో ఆదర్శాలు కుమ్మేసి నిజజీవితంలో నాకు నచ్చినట్టు  అంతా నా ఇష్టం బతుకుతా.. 

అని అంటున్నాడో లేదో-

అక్కడికో వ్యక్తి వచ్చి తన బజాజ్‌ స్కూటర్‌ ఆపి అందులోంచి హాకీ స్టిక్‌ తీసుకుని కోపంగా వచ్చి, 

రచనల్నే చూడాలి రచయితని కాదు అన్నప్పుడు మిమ్మల్నెందుకురా గౌరవించాలి? బొంగులోది!
 పులి తోలు గుంట నక్క నాయాళ్ళారా! 
మీరు చెడ్డది కాక కొత్తగా రాస్తున్న వాళ్ళనీ చెడగొడతార్రా? 

డప్ఫార్‌ అల్బిత్తర్‌ చెంచాగాళ్ళరా! 
చెత్త రాతల్రాసే తొత్తు కొడుకుల్లారా! 

అని తిడుతూ హాకీ స్టిక్ తో కాళ్ళ మీద ఒక్కటివ్వగానే 
అందరూ ఢామ్మని వెనక గలగల పారుతున్న ఏలూరు మురిక్కాల్వలో పడి, 
విరిగిన నడుముల్ని తడుముకుంటూ,
అక్కడ ఆల్రెడీ దొర్లుతున్న తమ ఫ్రెండ్ వరాహాలకి హాయ్‌ చెప్పారు. 

ఇదంతా అయోమయంగా చూస్తున్న గుర్నాథం వైపు తిరిగి, ఆ కొత్త వ్యక్తి-

చూడు బాసు, నేనూ నీలాగే రచనలు చేసే కొత్తల్లో వీళ్ళంతా గొప్పవాళ్ళేమో అనుకుని వీళ్ళ మాయలో పడబోయా.
 సకాలంలో నాకో గురువు దొరికి ఈ బురదనించి బయట పడ్డా అన్నాడు.

అలాగా? ఎవరు సార్‌ ఆ గురువు? ఆశగా అడిగాడు గుర్నాథం. 

ఇంకెరు బాసు? జగద్గురువు ఆదిశంకరులు! 
వారి వివేక చూడామణి చదివారా? 

ఇంటిదాకా డ్రాప్‌ చేస్తా రండి, 
దోవలో మాట్లాడుకుందాం 
అన్నాడా కొత్త వ్యక్తి  స్కూటర్‌ స్టార్ట్ చేస్తూ.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి