కర్ర తిరగేసి కొట్టవోయ్‌!

 


హలో,అప్పారావు గారు, అంతా కులాసాయేనా?

బాగున్నామండీ, సుబ్బారావు గారు.ఇంటిల్లిపాదీ కర్రసాము నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాం. 

కర్రసామా? ఎందుకు? 

వచ్చే నెల్లో కొండకి నడిచి ఎక్కబోతున్నామండీ, మొక్కు తీర్చుకోవడానికి. 

ఓహో, భలే. అయినా ఈరోజుల్లో కర్రసాము నేర్పించేవాళ్ళు ఎక్కడున్నారండీ? 

అయ్యో, మీకు తెలీదా? ఇప్పుడు ఊరూరా కర్రసాము నేర్పించే కోచింగ్‌ సెంటర్లు వచ్చేసాయండీ.
 మన ఊళ్ళోనే నాలుగు సెంటర్లు పోటీల మీద నడుస్తున్నాయి. 

పులి వస్తే కర్రతో ఎలా కొట్టాలి,
 సింహం వస్తే కర్రతో ఎలా కొట్టాలి,
ఎలుగుబంటి,చిరుత, ఇలా,
ఏ జంతువుని కర్రతో ఎలా ఎదుర్కోవాలో 
అక్కడ ట్రైనింగు ఇస్తారు.

NRI లకి 2-days crash course కూడా ఉందిట!

బావుందండీ. ఇవేవీ నాకు తెలియవు. మంచిది. క్షేమంగా కొండెక్కి రండి. తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. 

నెల రోజులయ్యాక అప్పారావు సుబ్బారావు మళ్ళీ కలిసారు.

హలో సార్‌! అప్పారావు గారు, ప్రయాణం బాగా జరిగిందా? క్షేమంగా వెళ్ళి వచ్చారా?
పులులు అవి ఏమీ కన్పించలేదు కదా? 

ఏం చెప్పమంటారండీ? దోవలో పులి కనిపించింది. 
దాన్ని చంపడం కూడా జరిగిపోయింది. 

నేర్చుకున్న కర్రసాము అక్కరకొచ్చిందన్న మాట. 
మొత్తానికి మీమీద దాడికి దిగిన పులిని చంపి వీరుడనిపించుకున్నారు. 

వీరత్వమా పాడా? 
పులిని చంపింది డెబ్భై యేళ్ళ మా అమ్మగారు.

ఆ! అలాగా! పోన్లెండి.
 మొత్తానికి పులి దాడినుండి మీ కుటుంబం తప్పించుకుంది.

అబ్బే, అదేమీ దాడి చెయ్యలేదండీ. అదే కదా, సమస్య. 

అందరం దైవ స్మరణ చేసుకుంటూ నడుస్తున్నామా, ఇంతలో హఠాత్తుగా అక్కడ పులి ప్రత్యక్షమైంది. 

మేం నేర్చుకున్న కర్రసామంతా మర్చిపోయి, ఎక్కడివాళ్ళం అక్కడ బిగుసుకుపోయాం. 
అది మా అందరి వంకా చూస్తూ నిలబడింది. 

ఇంతలో మా అమ్మగారు తన చేతి కర్ర తిరగేసి, ఆ పులి నెత్తి మీద ఒఖ్ఖ దెబ్బ వేసారో లేదో, అది కాస్తా చచ్చి ఊరుకుంది. 

హమ్మయ్యా, అని మేము, మా వెనకాల నిలబడిన భక్తులు అంతా ఊపిరి పీల్చుకున్నాం. 

కానీ, ఆ పులి మామీద ఏమీ దాడి చెయ్యకుండానే మా అమ్మగారు దాన్ని చంపడం నేరం అని, అదేదో వన్యప్రాణి చట్టం అని అందరూ మమ్మల్ని భయపెడున్నారు సార్‌! 
 పైగా ఇదంతా అక్కడున్న cc కెమెరాల్లో record అయిందిట. 

అయ్యో,అలాగా. 

“కర్రతో పులిని విచక్షణారహితంగా కొట్టి చంపిన భక్తురాలు“ అని మొన్న పేపర్లో వచ్చింది. ఇదేనన్న మాట.

అయినా పాపం పిచ్చిముండ. 
ఆ పులి అడవిలో ఆహారం దొరక్క మీ చేతుల్లో ఉన్న బిస్కెట్ల పాకెట్లు, చిప్స్ పాకెట్లు చూసి ఏమైనా పెడతారేమోనని మీవంక చూస్తూ నిలబడి ఉంటుంది. 

పాపం, ఆకలి ఏ జీవికైనా ఒకటే కదా సార్‌!

మీ అమ్మగారైనా ఆ పులి మీమీదికి ఎగిరి దూకిందాకా ఆగి, అప్పుడు కర్రతో చిన్నగా అదిలిస్తే పోయేది. తొందర పడ్డారు సార్‌! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన