నిరాశ్రయా న శోభన్తే పండితా వనితా లతాః

 


బాబూ, నేను విన్నకోట రామన్న కవిని. 
రాజమహేంద్ర ప్రభువు ఆస్థానంలో ఉండెడి వాడను.
 వారి ప్రాపకంలో అనేక కావ్యాలను రచించితిని. 

నేనే కాదు, ఆ రోజులలో గొప్ప పాండిత్యం ఉన్న కవులందరు మొదట రాజుల ఆస్థానాలలోను, ఆ తరువాతికాలంలో జమీందారుల ప్రాపకంలోను కావ్యాలను రచించి దేశ పాండిత్య పరంపరను నిలుపుతూ వచ్చిరి. 

నన్నయను రాజరాజనరేంద్రుడు, 
తిక్కనను మనుమసిద్ధి, 
ఎర్రాప్రగడను ప్రోలయ వేమారెడ్డి ఆదరించిరి. 

మరి ఈకాలమున ఏ ఏ రాజులు, జమీందారులు అటువంటి సాహిత్య పోషణ చేయుచున్నారో చూతమని భూలోకమునకు వచ్చితినయ్యా.

నీవు చూడగా కవి కుమారుడవు వలెనున్నావు. 
నాకు విషయము వివరముగ దెలుపుము. 

అయ్యా, మహానుభావా! సాహిత్యానికి స్వర్ణయుగమునుండి సాహిత్యము అనాథ అయిన కాలమును చూడవచ్చినారా తమరు? 

ఇప్పుడు రాజులు లేరు, జమీందారులు అంతకన్నా లేరు. 

ఇప్పటి కవులు తమ పుస్తకాలను తామే ముద్రించుకుని, ఉచితంగా పంచిపెట్టడమో, అటకల మీద దాచిపెట్టడమో చేస్తున్నారు.
 తెలుగు సాహిత్యాన్ని చదివే వారు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. 
అదీ నేటి పరిస్థితి. 

అయ్యో, అటులనా? ఎంతటి దుస్థితి! ఎంతటి దుస్థితి!
కనీసం ధనికులైనా సాహితీ పోషణకు ముందుకు రావడం లేదూ? 

కొంతమంది సాహితీ ప్రియులైన ధనికులు, అధనికులు కూడా తెలుగు సాహితీ సంస్థలు స్థాపించి ఏదో యథాశక్తి కృషి చేస్తున్నారు, సాహిత్యం పూర్తిగా చచ్చిపోకుండా. 

మరి మీ క్రౌంచ ద్వీపంలో సాహిత్యం ఎలా ఉందో? 

ఇక్కడా ఉంది, కొడిగట్టిన దీపంలా, ఏదో మిణుకు మిణుకుమంటూ.

ఏదీ ఒక సభ చూపించు కవి కుమారా? 

అదిగో చూడండి. 

కవి కుమారా! ఎవరాతడు? అతనికి మెడలో మాల వేసి జయ జయ ధ్వానములు చేయుచున్నారు? మహా పండితుడా? 


హహ! కాదు, కవి గారు. అతనొక సినీ నటుడు.
 గండ్ర గొడ్డళ్ళతో శత్రువులను నరుకుతున్నట్టు తెర మీద నటిస్తాడు. మధ్య మధ్యలో కథానాయిక పృష్టభాగాన్ని చరుస్తూ పాటలు పాడుతూ గెంతులు వేస్తాడు. 

ఒక నటుడికి ఇంత గౌరవమా? 
మరి ఆ పక్కన జనసమూహం యొక్క అభినందనలు అందుకుంటున్న ఆ స్త్రీమూర్తి మొల్ల వలె కవయిత్రియా?

కాదండీ,కాదు. 
ఆమె అర్థనగ్నత్వానికి వెరువక తెర మీద నటించు నటీమణి.
 ఇటీవల ఆమె పాట, నీ యెదలో డేరా వేస్తా, గుండెలో గుడిసేస్తా అన్న పాట ప్రసిద్ధి పొందింది.

నటీమణులకు ఇంత ఆరాధనా?
 ఏమిటయ్యా వీరు తెలుగు ప్రజలేనా?
ఇంతకీ సాహిత్యమెక్కడ?  

అదిగో చూడండి, ఆ మూల చిన్న గది కేటాయించారు సాహిత్యానికి.

ఓహో! బాగు! బాగు! సభయంతయు ప్రేక్షకులతో నిండియున్నదే?
 కన్నుల పండువగానున్నది.

ఆగండాగండి కవి గారు. అతనొక సినీ కవి.
 అందుకే అంతటి ఆదరణ. 
కాసేపు ఓపిక పట్టండి. చూడండి ఏం జరుగుతుందో? 

అదేటయ్యా, అతను వెళ్ళిపోగానే సగం సభ ఖాళీ అయిపోయింది? 

ఓహో,ఇప్పుడేమీ? అవధానమా?
 పోనీలెమ్ము,  సగంమంది ప్రేక్షకులు అయినా ఉన్నారు.

కవి కుమారా, అవధానం అవుతూనే ఆ కొద్దిమందీ వెళ్ళిపోతున్నారే?
అయ్యో,పదిమంది మిగిలారు!

ఇప్పుడు వచన కవిత్వము, సాహితీ ప్రసంగాలు కవి గారు. 
ఆ కూర్చున్న పదిమందీ, ఆ పైన కూర్చున్న కవులు, సాహితీవేత్తలకు తోడుగా వచ్చిన వారి కుటుంబ సభ్యులు! 

అటులనా? సాహిత్యం సర్వ మంగళం! హరోం హర!

కవి కుమారా, నేటి సాహిత్యపు స్థితిగతులను దెలిపినందులకు చిన్నవాడవైన నీకు ఆశీస్సులు. 

పైన స్వర్గంలో కవి సమ్మేళనానికి సమయమగుచున్నది.
నిర్వహించునది పిఠాపురం సంస్థానపు ప్రభువు, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు గారు! 

పోయి వచ్చెద, సెలవు మరి!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1