కోడి బాయె లచ్చమ్మాది!

 


ఏమిటండీ, మిట్ట మధ్యాహ్నం పూజ చేస్తున్నారేమి?


నన్నందరు TCube అక్కయ్యా అని పిలుస్తుంటారమ్మా.  

నా TCube channel కి 3 లక్షలమంది subscribers ఉన్నారమ్మా.

 పూజలు, వ్రతాలు చూపిస్తుంటా. 

ఉదయం ఇంటి పనితో కుదరదమ్మా,
 అందుకని అందరూ వెళ్ళిపోయాక ఇలా వీడియో కోసం ఉదయం పూజ మధ్యాహ్నం చేసి record చేసి upload చేస్తా.

ఏ పూజకి ఏ రంగు చీర కట్టాలి, 
ఏ రంగు పూలు పెట్టాలి,
ఏ రంగు జాకెట్‌ వెయ్యాలి,
పూజ గదిని ఎలా ఎలా ఎలా డెకొరేట్‌ చెయ్యాలి,
ఇవన్నీ చెబుతా!

👀 👀


అదేమిటండీ, మీ చుట్టూ రంగు రంగుల పెన్నులు, 
పూసలు, శంఖాలు పోసుకుని కూచున్నారు? 

నన్నందరు TCube అత్తయ్యా అని పిలుస్తుంటారమ్మా.

మన TCube channel కి నాలుగు లక్షలమంది subscribers ఉన్నారమ్మా.

నేను సమస్యలకి రెమెడీస్‌ చెబుతుంటా కదమ్మా.

 ఎర్ర రంగు పెన్నుతో మన సమస్యని బిర్యానీ ఆకు మీద రాసి,
 దాన్ని నిప్పుల్లో కాల్చి, 
ఆ నుసంతా పక్కింట్లో వేస్తే మన సమస్య తీరిపోతుంది. 

పచ్చ ఇంకుతో శంఖానికి పచ్చ రంగు వేసి, 
దానిలో రెండు పూసలుంచి, 
అర్ధరాత్రి అమావాస్య బీసెంట్‌ రోడ్‌ నేలమాళిగలో ఉన్న 
భైరవ స్వామీజీకి మొక్కు తీర్చుకుంటే మనం అనుకున్నది ఇట్టే అయిపోతుంది.

ఇలాగా బోల్డు రెమెడీస్‌ చెబుతూ ఉంటానమ్మా మన ఛానెల్లో.

ఇంతకీ నీ పేరు Manasa కదమ్మా, ఏవో సమస్యలున్నట్టున్నాయి. 

రేపటినించీ నీ పేరును “Mahaanasaa” గా మార్చుకుని 
ఆ పేరుని పచ్చ ఇంకు పెన్నుతో 5 లక్షల సార్లు, 
ఎర్ర ఇంకు పెన్నుతో 5 లక్షల సార్లు వ్రాసి, 
అరుణాచలం కొండ మీదున్న మర్రిచెట్టు కింద పాతిపెడితే 
నీ సమస్యలన్నీ తీరిపోతాయి.
 ఓకేనామ్మా? 

ఆ పచ్చ పెన్నులు, ఎర్ర పెన్నులు ఎక్కడ కొనుక్కోవాలో నా ఛానెల్‌ description box లో ఇచ్చానమ్మా. 

ఆ షాపుకెళ్ళి మన ఛానెల్‌ పేరు చెబితే ఒక్కో పెన్ను మీదా పది పైసలు discount కూడా ఇస్తారమ్మా, 
ఓకేనామ్మా?

👀 👀

అదేమిటండీ,పెద్దమ్మ గారు,ఈ వయసులో విశ్రాంతి తీసుకోకుండా పుస్తకాలన్నీ ముందేసుకుని కూచున్నారు? 

నన్నందరు TCube పెద్దమ్మా అని పిలుస్తుంటారమ్మా.

మన TCube channel కి నాలుగు లక్షలమంది subscribers ఉన్నారమ్మా.

నేను పుష్కాలన్నీ తిరగేసి,

మంగళసూత్రాల్లో పూసలెన్ని గుచ్చాలి?
 కుడి కాలుకి మెట్టెలెన్ని పెట్టాలి?
ఎడం కాలుకి ఎన్ని పెట్టాలి? 
నల్లపూసలు ఏ రోజు వెయ్యాలి?
ఎర్రపూసలు ఏ రోజు వెయ్యాలి?
పచ్చ పూసలు ఏ రోజు వెయ్యాలి?
ఇవన్నీ చెబుతానమ్మా.

👀 👀

అదేమిటండీ, బామ్మగారూ,  ఈ వయసులో మేడపైకెక్కి  డాన్సాడుతున్నారు? 

నన్నందరు TCube డాన్సింగ్‌ బామ్మ అంటారమ్మా.

 మన TCube channel కి అయిదు లక్షలమంది subscribers ఉన్నారమ్మా.

రోజూ మాఇంటి మేడెక్కి, 
వలగ రాణివి నీవె పాట దగ్గిర్నుంచీ  
జిల్‌జిల్‌జిల్‌జిల్‌ జిగేలు రాణీ వరకు 
అన్నీ ఆడేస్తా!

డాన్సాడేటప్పుడు కట్టుడు పళ్ళు 
గొంతుకు అడ్డం పడకుండా 
తీసి పక్కన పెడతా. 

👀 👀

అదేమిటండీ, చీరలు మార్చుకుంటూ 
అటూఇటూ తిరుగుతున్నారు?

నన్నందరు TCube lovely ‌ భామ అంటారు.

నా TCube channel కి యాభై లక్షలమంది subscribers ఉన్నారు.తెల్సా?

నేను చానా అందంగా ఉంటా కదా. 

చక్కగా రెడీ అయి ఊరికే కళ్ళు తిప్పుతూ, నడుం తిప్పుతూ, జడ తిప్పుతూ, మూతి తిప్పుతూ నడుస్తా, బాగ్రౌండ్‌లో ఓ సిన్మా పాట పెడ్తా. 

ఇలా వీడియో upload చేస్తానో లేదో  మీరు చాలా అందంగా ఉన్నారు మేడం అంటూ ఒకటే కామెంట్లు, లైకులు,లవ్వులు.హీహీ..

బావుందండీ భామ గారు! 

Social service అన్న మాట. 


👀 👀


ఇంతలో TCube తన business policy మారుస్తున్నట్టు ప్రకటించింది. 

ఇకనుండీ TCube channel నడుపుతున్న వారే, వారి ఛానెల్ ని పెట్టుకోవడానికి TCube కి డబ్బులు కట్టాలి. 

అంతేకాదు, ఒక్కో view కి $200 చొప్పున TCube కి ఆ ఛానెల్‌ నడిపేవారే కట్టాలి. ఇది రేపటినుండి అమల్లోకొస్తుంది అని ప్రకటన.


అంతే! 

ఈ వార్త విన్న TCube బామ్మలు,భామలు, పెద్దమ్మలు,అక్కయ్యలు అందరూ పొలోమని లగెత్తుకుని పోయి, 
systems లో login అయి,
వాళ్ళ వాళ్ళ ఇసక తక్కెడ పేడ తక్కెడ ఊకదంపుడు ఛానెల్స్ ని 
ఒక్క క్లిక్కుతో ఢామ్మని డిలీట్‌ చేసి పడేస్తే, 

అంతా పాయె! 😆


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన