ఈ లోకాన వింతలిన్నన్ని కావయా!
ఒకానొక వ్యక్తి తనను తాను కుక్కతో identify చేసుకుని ఆధునిత సాంకేతికతను వాడి కుక్కగా మారాడు.
అది విన్న లోకం ఎప్పటివలే మొదట కళవళపడి
ఆనక ఎప్పటివలే సర్దుకుపోయింది.
అతన్ని చూసి ఇదేదో బావుందనుకుని
ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్ఫూర్తి పొంది
కొన్ని వేలమంది కుక్కలుగా మారారు.
అది చూసి స్ఫూర్తి పొంది మరి కొందరు
తమను తాము పిల్లులతోను,
కోతులతోను,
జిరాఫీలతోను,
పులులతోను,
సింహాలతోను
identify చేసుకుని,
ఆధునిత సాంకేతికతను వాడి
ఆయా జంతువులుగా మారిపోయారు.
అలా మారిపోయాక,
కుక్కులుగా మారిన మనుషులు పిల్లులుగా మారిన మనుషులతో పోట్లాడ్డం,
కోతులుగా మారిన మనుషులు కుక్కలుగా మారిన మనుషులను చూసి కాట్లాడ్డం,
ఇత్యాది జరుగుతుంటే,
ఇలా జంతువులుగా మారిన మనుషుల కోసం
ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయబడ్డది.
కుక్కగా మారిన మనిషి ఒకడు మామూలు మనిషిని కరిస్తే,
కరవడం కుక్కల సహజ లక్షణం కనుక,
కుక్కగా మారిన మనిషి ప్రస్తుతం కుక్క మానసిక స్థితిలో ఉన్నాడు కనుక, కుక్కగా మారిన మనిషిది ఏమీ తప్పు కాదని
కుక్కగా మారిన మనిషికి అనుకూలంగా తీర్పు ఇవ్వబడింది.
సింహంగా మారిన మనిషి మామూలు మనిషి మీద దాడి చేస్తే,
ఆ మనిషి ఆ సింహాన్ని చంపితే,
సింహంగా తనను తాను మార్చుకున్నా,
అతడు మనిషే కాబట్టి,
అతన్ని చంపడం నేరమని
మామూలు మనిషికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబడింది.
ఈ తీర్పులకి విసిగి,
ప్రజలు ఆ న్యాయమూర్తి గారిని ఇంట్లో పెట్టి తాళం వేస్తే,
అప్పుడు అక్కడ ఆ న్యాయమూర్తికి జ్ఞానోదయమై,
తనను తాను పందికొక్కుగా identify చేసుకుని,
ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని
పందికొక్కుగా మారి,
ప్రస్తుతం తన ఇంట్లోనే బొరియలో నివసిస్తున్నాడు.
కథ కంచికి, మనం సర్కస్‌కి.