అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని!

 


సుబ్బారావు బండి మీద బీసెంట్‌ రోడ్‌లో వెళుతూ రోడ్డు మధ్యలో జనాలు గుంపులు గుంపులుగా ఆగిపోయి ఉండడం చూసి 

తనూ ఆగి చూసాడు.

అక్కడో రోడ్డు ప్రమాదం!

ప్రమాదంలో గాయపడ్డ బాధితులు రక్షించమని మూలుగుతున్నారు. కొందరు మంచినీరు ఇవ్వమని అడుగుతున్నారు.

సుబ్బారావు వెంటనే సెల్‌ ఫోన్‌ బయటకు తీసాడు.
అదంతా చక్కగా వీడియో తీసాడు. 
తర్వాత వేరే రూట్లో మెల్లిగా ఇంటికి పోయాడు.

ఇంటికి పోయి తను రికార్డు చేసింది నీట్‌గా ఎడిట్‌ చేసి, 
బాగ్రౌండ్‌లో “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని” అన్న పాట పెట్టి సోషల్‌ మీడియాలో పెట్టాడు. 

ఆ వీడియోకి ఎన్నో వేల లైక్స్, కామెంట్స్. 

అన్నయ్య గారు, మీదెంత గొప్ప మనసండీ. 
ఆ ప్రమాదం జరిగినప్పుడు మేమూ అక్కడే ఉన్నాం.
 మనకెందుకొచ్చిన గొడవా అని మావారు నన్నూ పిల్లల్ని 
పక్కవీథిలోంచి తీసుకొచ్చారు అంటూ ఓ చెల్లాయి ఫోన్‌ చేసింది.

మీరో హీరో! అంది మరో అమ్మాయి ఆరాధనగా.

అలా ఎన్నో ప్రశంసలు వచ్చాయి సుబ్బారావుకి.

మరోమాటు ఎవరో అత్యాచార బాధితురాలు.
 రోడ్డు మీద నిస్సహాయంగా అందరి సహాయము అర్థిస్తోంది.

సుబ్బారావు వెంటనే ఫోన్‌ బయటకు తీసి అంతా వీడియో తీసి, 
ఆనక ఇంటికెళ్ళాక, “ఈ దుర్యోధన దుశ్శాసన” పాటని బాగ్రౌండ్‌లో వేసి సోషల్‌ మీడియాలో పెడితే, మళ్ళీ విజిల్సు, చప్పట్లు వచ్చాయి.

అలా ఎక్కడ ఏ ప్రమాదాన్ని చూసినా, అన్యాయాన్ని చూసినా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టసాగాడు సుబ్బారావు.

అలా అలా మన కథ నడుస్తుండగా ఓ రోజు కాలం తీరి సుబ్బారావు కాలం చేసాడు. 

కాలం చేసిన సుబ్బారావును యమభటులు నరకానికి తీసుకుపోయారు.

నరకంలో చిత్రగుప్తుడు సుబ్బారావు పాపాల చిట్టా తీసాడు.

ప్రభూ, ఇలాంటి కేసులు మనకు ఇదివరకే చాలా వచ్చాయి. 
ఇతగాడి బాధిత వీడియోల సంఖ్య మొత్తం పది వేలు. 
వెంటనే తీర్పు ఇవ్వండి, అన్నాడు చిత్రగుప్తుడు యమధర్మరాజుతో.

యమ ధర్మరాజు, 
ఒక్కో వీడియోకి ఒకసారి నూనెలో వేయించడం, 
వెంటనే బయటకు తీసి వెయ్యి కొరడా దెబ్బలు కొట్టడం, 
మళ్ళీ వెంటనే ముక్కలు కింద కోసి ఉప్పూకారం జల్లడం 
అలా ఎన్ని వీడియోలు ఉంటే అన్నిసార్లు చెయ్యాలని తీర్పు ఇచ్చాడు, వెంటనే. 

ఇది అన్యాయం, అక్రమం!
 నేను నా వీడియోలతో  అక్కడ జరిగిన విషయాన్ని నలుగురికీ తెలియజెప్పాను, అది తప్పా?  
అన్నాడు సుబ్బారావు ఉక్రోషంగా ఆక్రోశిస్తూ.

ఆ మాటకు యమ ధర్మరాజు విరగబడి నవ్వాడు.

చూడు సుబ్బారావు జీవీ,
 నువ్వు పూర్వ జన్మలోను, ఈ జన్మలోను ఎన్నో పాపాలను మూట గట్టుకున్నావ్‌. 

నీలాంటి జీవులకు పాపక్షయం చేయడానికి  
పరమేశ్వరుడే బాధితుల రూపంలో వస్తాడు. 

అలా పదివేల సార్లు నీ ముందుకు వచ్చాడు. 

పదివేల సార్లూ నువ్వు చేయగలిగీ ఏ సహాయమూ చేయకపోగా 
ఆ నిస్సహాయుల ఆర్తనాదాలను వింటూ చూస్తూ వీడియో తీస్తూ కూచున్నావ్‌, అధమాధమ జీవీ! నీచాతినీచ మానవాధముడా!
 అని హూంకరించాడు యముడు.

ఇంతలో ఇంకా శిక్ష పడవలసిన వేరే జీవులు 
అక్కడ వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు కనుక యమభటులు 
సుబ్బారావుని అక్కడినించీ తీసుకుపోయారు.

యముని ఆజ్ఞ ప్రకారం యమభటులు సుబ్బారావును ఫ్రై చేయడానికి నూనె భాండీలో వెయ్యగానే, 
నూనెలో ఫ్రై అవుతున్న సుబ్బారావు,
 అక్కడ తనతోబాటు వీడియోలు తీసిన మనుషుల్ని గుర్తు పట్టి, 

నూనెలో వేగుతూ హాహాకారాలు చేస్తున్న వాళ్ళని, 
జేబులో ఉన్న ఫోన్‌ తీసి వీడియో తీయసాగాడు. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన