అగ్నిమీళే పురోహితం
అదేదో సిన్మాలో అమెరికా నుండి వచ్చిన పదహారేళ్ళ పిల్ల, ఆ సినిమాకి హీరోయిన్, పురోహితుడు మంత్రం సరిగ్గా చెప్పలేక పోతే తాను అందుకుని చదివినట్టు తీసారు చూసారా అన్నగారూ?
చూసాను తమ్ముడు.
ఇంకో సిన్మాలో పురోహితులను వెకిలిగా హాస్యగాళ్ళుగా చూపించారు, చూసారా అన్నగారూ?
చూసాను తమ్ముడు.
పెళ్ళళ్ళలో పురోహితుడి కన్నా వీడియోగ్రాఫర్‌కే గౌరవం,మర్యాద. గమనించారా అన్నగారూ?
చూసాను తమ్ముడు.
లక్షలు,లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు.
పురోహితుడికి ఇవ్వాలంటే ఏడుస్తారు, చూసారా అన్నగారూ?
చూసాను తమ్ముడు.
పూజ చేయించే పురోహితుడి మీదే ఎకసెక్కాలు ఆడుతూ ఉంటారు, చూసారా అన్నగారూ?
చూసాను తమ్ముడు.
అన్నింటికీ పొడిపొడిగా చూసానంటారే అన్నగారూ?
మీ అభిప్రాయం చెప్పండీ?
పుట్టుకతోనే ఆ సంప్రదాయంలో పుట్టి అనేక సంవత్సరాలు శిక్షణ పొంది, అనేక సంవత్సరాలు అదే వృత్తిలో ఉన్న పురోహితుడి మంత్రాల్లో నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు తప్పులు కనుక్కోవడం అన్నది హాస్యాస్పదంగా అనిపించడం లేదూ తమ్ముడూ?
అవునన్న గారు.
బాగా చెప్పారు.
అన్య మతాల వారు ఎవరైనా తమ priest class ని తామే హేళన చేసుకోడం ఎప్పుడైనా చూసావా? కనీసం సినిమాల్లో?
లేదన్న గారు.
మంచి point చెప్పారు.
తన ఇంటిలో జరుగుతున్న పెళ్ళి తంతుకి భగవంతునికి, వధూవరులకి అనుసంధాన కర్తగా మంత్రోచ్చారణ చేస్తూ పెళ్ళిని నడిపిస్తున్న పురోహితుడిని హేళన చేస్తే భగవంతుడిని, వారి ఇంటి దైవాన్ని వారే అవమానించుకున్నట్టు కాదూ?
నిజం అన్న గారు.
సరిగ్గా చెప్పారు.
పురము యొక్క హితము కోరి పూజలు,వ్రతాలు,పెళ్ళిళ్ళు చేయించే పురోహితుడిని గౌరవించడం, అతడికి తగిన ధన సత్కారం చేసి అతని జీవనయాత్రకు తోడ్పడడం హిందూ ధర్మ రక్షణలో భాగం కాదూ?
అవునన్న గారు.
చాలా బాగా చెప్పారు.
సరే నాయనా,
ఈవేల్టికీ ప్రశ్నోత్తరాలు చాలు.
ఇక లేద్దాము.
సంధ్య వార్చడానికి వేళవుతోంది.
స్వస్తి.