జననీ శతపత్ర స్వర్ణ సీమా!

 


అది శతపత్రానదీ తీరం. 

కొన్ని వేల ఏళ్ళుగా నాగరికత వర్థిల్లుతూ వస్తున్న తీరం.

అందుకని అక్కడి ప్రజలు మాది శతపత్రి అని చెబుతారు.

మేం శతపత్రోళ్ళం అంటారు అక్కడి పల్లె ప్రజలు.

శతపత్రానది అంటే పూజనీయం ప్రజలకు.

ఆ నదీతీరంలో శతపత్రమ్మ తల్లి గుడి కూడా ఉంది,
 శతపత్రోళ్ళను తమ చల్లని చూపులతో కాపాడుతూ.

అక్కడ బంగారం పండుతుంది.

అందుకని అక్కడి ప్రజలు మాది స్వర్ణ సీమ అని చెబుతారు.

మేం సొర్నసీమోళ్ళం అని అంటారు అక్కడి పల్లె ప్రజలు.

అక్కడ విలసిల్లుతోంది అలా ఆ శతపత్ర స్వర్ణసీమ.

*********

అయితే అప్పటి అక్కడి ప్రభువులకు ఒక ఆలోచన వచ్చింది.

ఆ రాజ్యానికి తమ నాయకుడు పిచ్చయ్య పేరు పెట్టాలని. 

ఆ మరుసటి రోజే ఆ సీమ, “పిచ్చి సీమ” గా నామకరణం చేయబడ్డది.

జనం ఇదేమీ పట్టించుకోలేదు.

శతపత్రి అని, సొర్న సీమ అని ఎప్పట్లాగే చెప్పుకున్నారు.

కొందరు మాత్రం పిచ్చయ్యకు పిచ్చి అభిమానులుగా మారారు.

*********

తరువాత కొన్నేళ్ళకు కొత్త ప్రభువులు రాజ్యాన్ని ఏలడానికి వచ్చారు.

ఆ ప్రభువులకు ఆ రాజ్యానికి తన నాయకుడు పుల్లయ్య పేరు పెట్టాలని ఆలోచన వచ్చింది.

ఆ మరుసటి రోజే ఆ సీమ, “పిచ్చి పుల్లయ్య సీమ” గా నామకరణం చేయబడ్డది.

జనం ఇదేమీ పట్టించుకోలేదు.

తమది శతపత్రి అని, సొర్న సీమ అని ఎప్పట్లాగే చెప్పుకున్నారు.

కొందరు మాత్రం పుల్లయ్యకు పిచ్చి అభిమానులుగా మారారు.

**********

తరువాత కొన్నేళ్ళకు కొత్త ప్రభువులు రాజ్యాన్ని ఏలడానికి వచ్చారు.

ఆ ప్రభువులకు ఆ రాజ్యానికి తన మతానికి దేవుడు జూపిటర్‌ పేరు పెట్టాలని ఆలోచన వచ్చింది.

ఆ మరుసటి రోజే ఆ సీమ, “పిచ్చి పుల్లయ్య జూపిటర్ సీమ” గా నామకరణం చేయబడ్డది.

జనం ఇదేమీ పట్టించుకోలేదు.

తమది శతపత్రి అని, సొర్న సీమ అని ఎప్పట్లాగే చెప్పుకున్నారు.

కొందరు మాత్రం జూపిటర్‌ మతంలోకి మారారు.

**********

తరువాత కొన్నేళ్ళకు కొత్త ప్రభువులు రాజ్యాన్ని ఏలడానికి వచ్చారు.

ఆ ప్రభువులకు ఆ రాజ్యానికి తన మతానికి దేవుడు కోరల మార్కయ్య‌ పేరు పెట్టాలని ఆలోచన వచ్చింది.

ఆ మరుసటి రోజే ఆ సీమ, “పిచ్చి పుల్లయ్య జూపిటర్ కోరల మార్కయ్య‌  సీమ” గా నామకరణం చేయబడ్డది.

జనం ఇదేమీ పట్టించుకోలేదు.

తమది శతపత్రి అని, సొర్న సీమ అని ఎప్పట్లాగే చెప్పుకున్నారు.

అయితే కొత్త ప్రభువుకు ఇది నచ్చలేదు. 

అతడు తన గణాలను ప్రజల్లోకి పంపి శతపత్రి అన్నది మన భాష కాదని, స్వర్ణం కూడా మన భాష కాదని, అది మన మీద రుద్దబడినదని, శతపత్రమ్మను పూజించడం మూఢనమ్మకమని, అవన్నీ కాలం చెల్లిన విశ్వాసాలనీ నూరిపోయసాగారు. 

ఈ గణాలతో జూపిటర్‌ మతావలంబకులు, పిచ్చయ్య అభిమానులు, పుల్లయ్య అభిమానులు కూడా చేరారు.

వీళ్ళ ప్రచారానికి ప్రజల్లో కూడా క్రమక్రమంగా తమ పాత విశ్వాసాలు సన్నగిల్లిపోయి చివరకు చాలామంది ప్రజలు ప్రభువుల వారు పెట్టిన PPJKM సీమ అనే తమ ప్రాంతాన్ని పిల్చుకోసాగారు.

ఇంకా ఎవరైనా పాత పేర్లతో పిలుస్తారేమోనని 
పాత పేర్లతో పిలిస్తే నేరంగా చట్టం చేసాడు ఆ ప్రభువు. 


దాంతో శతపత్రి, సొర్న సీమ అన్న పేర్లు మరుగున పడిపోయాయి. 

శతపత్రమ్మ మీద భక్తి ఇప్పుడు కేవలం తిరునాళ్ళలో వేడుకగా మారింది. 

శతపత్రానది కేవలం నీళ్ళిచ్చే ఓ వనరు. 


*************

అలా యాభై యేళ్ళు గడిచాయి. 

ఆ PPJKM సీమలోకి యాభై ఏళ్ళ క్రితం ఆ సీమను వదిలి హిమాలయాలకి వెళ్ళిన సాధువొకడు తిరిగి వచ్చాడు.

తను శతపత్రి వాడినని, ఫలానా వారి కొడుకునని స్థానికులతో చెప్పాడు.

ఇది PPJKM సీమయ్యా. శతపత్రి అంటావేం? 
అన్నది  అక్కడి మారిన తరం.

అదేం పేరు? ఎవరు పెట్టారు? 

ఇది శతపత్రి!

మనమంతా శతపత్రమ్మ తల్లి బిడ్డలం!

ఈ సీమ పచ్చని పంటలు పండి స్వర్ణ సీమ అయిందంటే ఇక్కడ గలగల పారుతున్న ఆ శతపత్రమ్మ భిక్ష అని అరిచాడు ఆ సాధువు, అందరికీ వినబడేటట్టుగా.

శతపత్రి అన్న మాట చెవిన పడగానే చాలామంది వయోవృద్ధులు బయటకు వచ్చారు.

అవును, ఇది శతపత్రే. 
మన స్వర్ణ సీమ.
 శతపత్ర స్వర్ణ సీమ
అన్నారు కళ్ళు తుడుచుకుంటూ.

మన సీమ పేరు శతపత్రి.
మనమంతా శతపత్రానది బిడ్డలం.
ఇదే మన స్వర్ణ సీమ.
ఇదే బంగారు పంటలు పండే శతపత్ర స్వర్ణ సీమ
అనుకున్నారు ప్రజలు.

మబ్బులు విడిపోయాయి.

సూర్యుడు ధగధగా వెలిగాడు.

శతపత్రోళ్ళు శతపత్రమ్మ తల్లికి మొక్కారు.

ప్రభువులకు దడ పుట్టించి చట్టాన్ని గడగడలాడించారు.

 PPJKM సీమ అని వ్రాసి ఉన్న ప్రతి సూచికను పీకి అవతల పారేశారు. 

శతపత్ర స్వర్ణ సీమ అని బంగారు అక్షరాలతో సీమ ఆరంభంలో చెక్కించుకున్నారు.

 
తమది శతపత్రి అని, సొర్న సీమ అని ఎప్పట్లాగే చెప్పుకున్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన