మతిలేని గమ్మత్తయ్యకు సంగీత వాత

 


గమ్మత్తయ్య కొత్తగా అధికారంలోకి వచ్చాడు. 


గమ్మత్తయ్యకో  మతం ఉంది.
అది రెట మతం.

గమ్మత్తయ్యకో వాదం ఉంది.
అది పెడ వాదం. 

 ఓ రోజు గమ్మత్తయ్య పళ్ళు తోముకుంటుంటే కిచ్‌ కిచ్‌ మని శబ్దం రావడం గమనించాడు. 

కిచ్‌ కిచ్‌
కిచ్‌కిచ్‌ కిచ్‌!

కిచ్‌ కిచ్‌
కిచ్‌కిచ్‌ కిచ్‌!

అందులో ఒక కొంగొత్తైన లయ ఉందని తోచి గమ్మత్తుగా ఎగిరి గంతేశాడు గమ్మత్తయ్య.

పళ్ళు తోముకుని కిటికీలోంచి బయటకు చూస్తే గుర్రాల సకిలింపు వినబడింది. 

అందులోనూ ఒక గమ్మత్తైన లయ ఉందని తోచింది గమ్మత్తయ్యకు.

తరువాత రథం మీద అలా వ్యాహ్యాళికి బయలుదేరాడు గమ్ము.

గుర్రాలను ఛెళ్‌ ఛెళ్‌ మని కొడుతున్న శబ్దంలోను, 
గుర్రాల గిట్టల డుగ్‌ డుగ్‌ చప్పుడులోను, 
రథ చక్రాల జుక్‌జూ జుక్‌జూ తిరుగుడులోను 
లయ ఉందని, 
సంగీతం దాక్కుని ఉందని 
గమ్మత్తయ్యకు గబుక్కున తోచి పోయింది.

ఇంతలో దోవలో పల్లె పడుచుల హుం హుం అని దంపుళ్ళ చప్పుళ్ళు, 

దంచవే దంచు!
దం దం దంచు!
గమ్మత్తుగా దంచు! 

అన్న వారి పాటలు, 

ఒహోం ఒహోం బీం!
ఒహోం ఒహోం బీం! 
హైసా! హైసా!

అన్న పల్లకీ బోయీల పలుకుల్లో లయను గమనించి పులకలెత్తి పోయాడు గమ్మత్తయ్య.

అన్నిటా అంతటా సంగీతమే నిండి ఉన్నట్టు మత్తుగా గమ్మత్తుగా అనుభూతి  చెందిపోయాడు గమ్మత్తయ్య.

ఇంతలో దోమ ఒకటి గమ్మత్తయ్య చెవి వద్ద జుయ్‌ జుయ్‌ జుయ్‌ అని లయబద్ధంగా సంగీతం పాడగా, 
ఒడలు పులకరించిన గమ్మత్తయ్య తన మెడలోని ముత్యాల దండ తీసి ఆ దోమ మెడలో వేసి సన్మానించాడు. 

అన్నిచోట్లా సంగీతం నిండిపోయి ఉంటే, తన రాజాస్థానంలో శాస్త్రీయ సంగీతకారులను పోషించడం ఎందుకు? 

ధనం వృధా! 

వారినెందుకు గౌరవించాలి? 

గౌరవం వృధా!

ఏమిటి వారి గొప్ప? 

తీసి అవతల పారెయ్‌! 

ఈ వార్త తెలిసి  రాజాస్థానంలో ఉన్న శాస్త్రీయ సంగీత కళాకారులు పరుగు పరుగున వచ్చి, తరతరాలుగా తాము రాజాశ్రయంలో ఉండి తమ కళలతో రాజును, రాజ పరివారాన్ని, ప్రజలను ఆనందింపజేస్తున్నామని, ఇలా ఉన్నట్టుండి పొమ్మనడం భావ్యం కాదనీ పరిపరి విధాలా వేడుకున్నారు.

ఏమిటి మీ గొప్ప? 

శాస్త్రీయ సంగీతమే సంగీతమనే రోజులు ఎప్పుడో పోయాయి. నోర్మూసుకుని అవతలికి నడవండి! 

నా రాజ్యంలో శాస్త్రీయ సంగీతకారులు ఉండడానికి వీల్లేదు! 
మీకందరికీ రాజ్య బహిష్కరణ! 

అన్నాడు గమ్మత్తయ్య సుతి తప్పకుండా. 

చేసేది లేక తమ సమస్త సంగీత పరికరాలు తీసుకుని, రాజ్యంలోని శాస్త్రీయ కళాకారులందరూ పక్క రాజ్యానికి చేరుకుని ఆ రాజు ఆశ్రయం పొంది అక్కడ తమ కళను ప్రదర్శిస్తూ గౌరవప్రదంగా జీవించసాగారు. 

అలా కొన్ని రోజులు గడిచాయి.

అన్ని రాజ్యాల రాజుల సమావేశం జరపడానికి ఈసారి గమ్మత్తయ్య రాజ్యం వంతు వచ్చింది. 

అన్ని రాజ్యాల రాజులు గమ్మత్తయ్య రాజ్యానికి చేరుకున్నారు.

పళ్ళేల మీద గరిటెలతో లయబద్దంగా వాయిస్తున్న వాద్యగాళ్ళతో ఆహ్వానం ఏర్పాటు చేసాడు గమ్మత్తయ్య.

ఠంగ్‌! ఠంగ్‌! 
ఠంగ్‌!

ఠంగ్‌! ఠంగ్‌! 
ఠంగ్‌!

ఠంగ్‌! ఠంగ్‌! 
ఠంగ్‌!

అది విని మిగిలిన రాజులందరూ చెవులు మూసుకుని విస్తుపోయారు.

ఇదొక వినూత్న ప్రయత్నం. వినే చెవులుండాలి కానీ అన్నిచోట్లా సంగీతమే! అన్నాడు గమ్మత్తయ్య మత్తుగా.

ఆ తరువాత 
ఆడ వాళ్ళు ఇళ్ళల్లో పాడుకునే పాటలు,
 పిల్లలు బళ్ళల్లో పాడుకునే పాటలు, 
మగవారు పనుల్లో పాడుకునే పాటలు వినిపించారు. 

ఆ సమావేశం ముగిసిపోయి రాజులు తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయేటప్పుడు వారి వీడ్కోలు సందర్భంగా,
రంపపు కోతలు, 
కత్తి నూరుళ్ళ చప్పుళ్ళతో, 
మధ్య మధ్యలో గుర్రాల సకిలింపులు, 
ఏనుగుల ఘీంకారాలతో 
సంగీతం వినిపించబడింది.

అది విని రాజులందరూ చెవులు మూసుకుని విస్తుపోతూ వారి వారి రాజ్యాలకు పారిపోయారు. 

మరుసటి సంవత్సరం పక్క రాజ్యంలో రాజుల సమావేశం ఏర్పాటు చేయబడ్డది. 

మొదటగా జానపద సంగీతంతోను, నృత్యాలతోను స్వాగతం ఏర్పాటు చేయబడింది. 

రాజులందరూ హర్షామోదాలు తెలిపారు.

గమ్మత్తయ్యకు ఇది బాగా నచ్చింది.

తరువాత ప్రత్యేక శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.

ఆ సంగీతానికి రాజులు ఎంతో ఆనందిస్తున్నట్టు కనబడింది. 

గమ్మత్తయ్యకు ఇది బాగా నచ్చలేదు.

పైగా ఆ శాస్త్రీయ సంగీత కళాకారులంతా తన రాజ్యంనుండి తాను తరిమికొట్టిన వారు! 

ఆతిథ్యమిస్తున్న రాజును అడిగాడు, ఈ శాస్త్రీయ కళాకారుల గొప్ప ఏమిటి? పరికించి చూడండి, అన్నిటా అంతటా అందరి నోటా సంగీతమున్నది అని ఆవేశపడ్డాడు.

ఆ రాజు గమ్మత్తయ్య చెత్త ప్రశ్నకు ఒత్తుగా నవ్వి, పని చేసుకునేటప్పుడు శ్రమ తెలియకుండా ప్రజలు పాడుకునే పాటలు మాకూ ఉన్నవి. వాటిని మేమూ ఆనందిస్తాం. 

కానీ, శాస్త్రీయ సంగీతం కేవలం శ్రమను మర్చిపోయేలా చేసేదే కాదు, అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చేది.

ఈ సంగీతాన్ని అనేక సంవత్సరాలు అదే పనిగా సాధన చేసి ఆ తరువాత మనకందిస్తారు ఈ కళాకారులు.
 అందుకే వారికి పోషకులు కావాలి. 

శాస్త్రీయ సంగీత వాయిద్యాలు, 
శాస్త్రీయ సంగీతం 
దానిలో పలికే క్లిష్టమైన సంగతులు అన్నీ 
మానవ నాగరికతకు,సంస్కృతీవైభవానికి చిహ్నాలు అన్నాడు దర్పంగా.

వాళ్ళంతా ఒకప్పుడు నా ఆస్థాన విద్వాంసులు అని చెబుదాం అనుకున్నాడు కానీ చెప్పలేక పోయాడు గమ్మూ.

సమావేశం ముగిశాక రథం మీద ఇంటి దారి పట్టాడు.

దోమ ఒకటి చెవి దగ్గర గుయ్‌ గుయ్‌ మని సంగీతం పాడింది. 

గమ్మత్తయ్యకు ఒళ్ళు మండి దాన్ని ఠప్‌ మని కొట్టబోయాడు. 

అది ఎగిరి మళ్ళీ చెంప మీద వాలింది.

మళ్ళీ ఠప్‌ మని కొట్టబోయాడు. 

అది మళ్ళీ ఎగిరి రెండో చెంప మీద వాలింది.

ఠప్‌ ఠప్‌ 
ఠప్‌! 

ఠప్‌ ఠప్‌ 
ఠప్‌! 

ఠప్‌ ఠప్‌ 
ఠప్‌! 

గమ్మత్తయ్య చెంపలు పగిలాయి గానీ దోమ దొరక లేదు.

లయబద్ధమైన మీ తాళం బాగుంది మారాజా! అన్నాడు ముందు కూచుని రథం తోలుతున్న రథ సారథి.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన