సాహితీ గిరీశాలకి థౌజెండ్‌వాలా!
అలివేణి: చిరివాడ తుప్పారావు గారు, ఏదో వికట నాటకము వ్రాసి తెలుగునాట గొప్ప పేరు సంపాదించినారే?
(తుప్పారావు జమీందారీ ఫాయలో కుర్చీలో కూచుని చిరునవ్వులు చిందించును.)
అలివేణి: మీ నాటకమందు వైదికుల మీదే అన్ని వేళాకోళాలు, వెటకారాలు,వక్రభాష్య వికటానందాలు సృష్టించినారు.
మరి ఇతర కులములలో కూడ “ఓలి” అను ఆచారమున్నదిగా.
దానిని విమర్శిస్తూ వ్రాయలేకపోయారే?
ఆలాగున వ్రాస్తే వారందరూ వచ్చి తందురని భయమా మీకు?
(తుప్పారావు కొంత ఇబ్బందిగా కదులును.మీసములు తిప్పుకొనును.)
అలివేణి: వైదికులైతే దేహశుద్ధి వంటి హింసాత్మక చర్యలకు పాల్పడరన్న ధైర్యమేమో?
ఇంతకీ తమరి వికట నాటకము చదివి వైదిక సంఘములో సంస్కరణ బయలుదేరినదందురా లేక వైదిక వర్గము సమాజములో నవ్వులపాలైనదందురా తుప్పారావు గారూ?
(తుప్పారావు కొంత ఇబ్బందిగా కదులును.ముక్కు గోకుకొనును.)
అలివేణి: విధురులైన వైదిక వయోవృద్ధులందరూ చిన్న బాలికలను పెళ్ళాడుటకు అంగలార్చుచూ వరుసలో నిలబడుదురని మీరు మీ వికట నాటకములో వ్రాసినారు, మిగిలిన కులములలోని పురుషులందరూ పులుగడిగిన ముత్తెములైనట్టు.
పోనీ,కాసేపు అట్లే అనుకొందుము.
ఆ సదరు పురుషుడు వైదికుడై ఉండవలెను.
అతడు విధురుడై ఉండవలెను.
అతడు వయోవృద్ధుడై ఉండవలెను.
అతనికి ఆ వయస్సులో మళ్ళీ పెళ్ళావలెనన్న దుర్భుద్ధి పుట్టవలెను.
ఇవన్నియూకాక అతడు బాలిక తండ్రికి అత్యధికముగ శుల్కమిచ్చి, అతనిని లోబరచుకొని, అతని చిన్ని కుమార్తెను పెళ్ళాడగలిగిన ధనికుడై ఉండవలెను.
ఇన్నీ కుదిరిన వైదిక బ్రాహ్మణ పురుషులు ఎంతమంది ఉండి ఉందురండీ తుప్పారావు గారూ?
అటువంటి పెండ్లిడ్లు ఎన్ని జరిగినవో తమ వద్ద లెక్కలున్నవా?
(తుప్పారావు కొంత ఇబ్బందిగా కదులును.కాలు మీద కాలు వేసుకుని దర్పమును ప్రదర్శించును.)
అలివేణి: ఆ వైదిక బాలికల తండ్రులందరు కూడా ఈడూజోడూ చూడక కాసులమ్ముడుబోవు కఠినాత్ములని సృజన చేసిరి.
ఇది మీకు సబబేనా తుప్పాజీ?
అందరూ తమ బాలికలను ధనికులైన విధుర వయోవృద్ధులకు ఇచ్చి పెండ్లి చేయుచుంటే ఇక పెండ్లి కావలసిన బాలుర పరిస్థితి ఏమి?
(తుప్పారావు చిరునవ్వులు చిందించును కాని కొంత ఇబ్బందిగా కదులును.శాలువా సరి చేసికొనును.)
అలివేణి: వైదికాచారములు పాటించు వారు ఛాందసులన్నట్లు తమరి వికట నాటకమున చిత్రించిరి.
మరి వీరేశలింగము పంతులు గారు విధవావివాహములు చేయిచున్నారని తెలిసి అనేక వైదిక తండ్రులు వితంతువులైన తమ బాలికలకు పునర్వివాహము చేయుమనుచూ తమ వద్దకు వచ్చుచూ ఉండెడివారని వారు తమ స్వీయచరిత్రలో వ్రాసి ఉంటిరే?
దానికేమందురు?
(తుప్పారావు కొంత ఆలోచనలో పడినట్టు తోచును. కాలు మీద కాలు మార్చుకుని దీర్ఘశ్వాస బీల్చుచూ దిక్కులు చూచును.)
అలివేణి: మీ వికట నాటకమున సంఘ సంస్కరణ ఏమియూ లేదండీ తుప్పారావు గారూ!
వైషమ్యపూరిత వక్రీకరణము తప్ప.
(తుప్పారావు అప్పుడిక నోరు తెరచును.)
తుప్పారావు: పాపా, అలివేణీ, అదిగో, అటు చూడుము.
నా నాటకమును ఆహాఓహో అనుచున్న సాహితీ పీఠాధిపతులైన
నా శిష్యప్రశిష్యులను చూడుము.
నా నాటక విజయమునకు అదియే సాక్ష్యము!
(తాతాచారి,అరుణశ్రీ, వెవ్వెవ్వే వెంకోజీ, జెఫ్ఫా భాయి, పైత్యాయని,పప్పుల పెద్దమ్మ తదితరులు వారి వారి సాహితీ పీఠములపై కూర్చుని కనిపించుదురు.)
అలివేణి: హహ్హహ్హ! తెలుసునండీ తుప్పారావు గారు! సాహితీ గిరీశములు! సాహితీ సన్నాసులు! సాహితీ నాంచారమ్మలు!
(ఇంతలో ఢాం! ఢాం! ఢాం! అని పెద్ద శబ్దము పుట్టెను.
అక్కడ పెద్ద కలకలము రేగెను.
అందరూ వారి వారి పీఠములు దిగి అటూఇటూ పరుగులు తీయసాగిరి.
ఆ కంగోళీలో తాతాచారి కింద పడెను, ఆ పడుటలో ముందు పళ్ళు రాలెను,నడుము విరిగెను.
వెంకోజీ ముక్కు పగిలెను, ఇంకనూ అక్కడ ఉన్న సాహితీ సర్కసు వారు గంతులు వేయుచూ నలుదిక్కులా పరుగులు తీయసాగిరి.)
తుప్పారావు: ఏమిటి అలివేణీ! ఏమిటా కలకలము?
అలివేణి: వారి పీఠముల కింద థౌంజెడ్‌వాలా అను గొలుసు టపాసును వెలిగించితినండీ తుప్పారావు గారు!
తుప్పారావు: గొలుసు టపాసా? అది ఏమి?
అలివేణి: ఇదిగోనండీ, మీ కుర్చీ కింద కూడ ఒక గొలుసు టపాసు కట్టితిని. దీనినిలా వెలిగించుదును. అది ఏమో మీకునూ తెలియును.
( అని వెలిగించబోవును.)
తుప్పారావు: అమ్మయ్యోయ్, అలివేణీ!
(అనుచూ తన తన్యాతుల్కమును చేతబట్టి విజయనగరము బొంకులదిబ్బ వైపునకు పరుగుతీయును)
(అది చూచి అలివేణి విరగబడి నవ్వును)
(సమాప్తము)