డబ్బు > బంధుత్వం < అవసరం
నేను మధ్య తరగతి వాడిని.
నాకు కొంతమంది డబ్బున్న బంధువులు,
కొంతమంది డబ్బు లేని బంధువులు ఉన్నారు.
డబ్బున్న బంధువులు తక్కువ మాట్లాడతారు.
డబ్బు లేని బంధువులు ఎక్కువ మాట్లాడతారు.
నేను కొన్నిసార్లు ఎక్కువగాను, కొన్నిసార్లు తక్కువగాను మాట్లాడతాను.
డబ్బున్న బంధువులు గీత అవతల నిలబెట్టి మాట్లాడతారు.
డబ్బు లేని బంధువులు గీత లోపలికి వచ్చి మాట్లాడతారు.
నేను గీత మీద నిలబడి అటూఇటూ కాకుండా మాట్లాడతాను.
డబ్బున్న బంధువులు గుంభనంగా ఉంటారు.
డబ్బు లేని బంధువులు సాయిలా పాయిలాగా ఉంటారు.
నేను కొన్ని సార్లు గుంభనంగాను, కొన్నిసార్లు సాయిలా పాయిలాగాను ఉంటాను.
చిన్నతనంలో నా డబ్బున్న బంధువులు ఇంగ్లీషు నవల్లు చదివే వారు.
నా డబ్బులేని బంధువులు హాయిగా ఆటలాడుకునే వారు.
నేనేమో తెలుగు పుస్తకాలు చదివేవాడిని.
డబ్బున్న బంధువులు డబ్బు తెచ్చే చదువులు చదివి ఇంకా ఇంకా డబ్బు తెచ్చే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు.
డబ్బు లేని బంధువులు ఏవో దొరికిన చదువులు చదివి చిన్న ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
నేను నా తాహతుకు మించిన చదువు అప్పు చేసి చదువుకుని మా నాన్న కన్నా మంచి ఉద్యోగమే సంపాదించాను.
డబ్బున్న బంధువుల ఇంటికి శుభకార్యాలప్పుడు నా తాహతుకు మించిన బహుమతులు తీసుకు వెళతాను.
అవి వాళ్ళ కంటికి ఆనవు.
నా ఇంట్లో శుభకార్యాలప్పుడు నా డబ్బులేని బంధువులు వారి తాహతుకు మించి బహుమతులు తెస్తారు.
అవి నాసిరకం, చైనా బజారు సరుకుని నా భార్య రుసరుసలాడితే నాకూ అలాగే అనిపిస్తుంది.
అవసరానికి అక్కరకొస్తారని నా డబ్బున్న బంధువులతో నేనూ,
నా డబ్బు లేని బంధువులు మంచిగా ఉంటాము.
అవసరానికి అక్కరకొస్తానేమోనని నా డబ్బులేని బంధువులు నాతో మంచిగా ఉంటారు.
ఏం సహాయం చేయాల్సి వస్తుందో అని మేమెంత దగ్గర కావాలని చూసినా మా డబ్బున్న బంధువులు మాత్రం మమ్మల్ని సాధ్యమైనంత దూరం పెడతారు.
ఓసారి అప్పు కోసం నా డబ్బు లేని బంధువులు డబ్బున్న బంధువుల్ని అడిగితే వారేదో చెప్పి తప్పించుకున్నారు.
డబ్బు లేని బంధువులు చేసేది లేక నా దగ్గరికొస్తే, నన్ను కదా అడుగుతున్నారు అని గొప్పగా అప్పిచ్చాను కానీ ఆ తరువాత వారు ఎంతకీ తిరిగివ్వలేదు.
కొన్నాళ్ళు వేచి చూసి నా డబ్బు తిరిగివ్వమని అడిగితే, ఆ, ఇచ్చేస్తాంలే, వెధవ డబ్బు, నీ మొహాన కొడతాం అన్నారు బంధుత్వం వల్ల వచ్చిన చనువుని వాడుకుంటూ.
మాటలు మిగిలాయిగానీ డబ్బు రాలేదు.
ఇంక ఈ జన్మలో వీళ్ళకి అప్పివ్వ కూడదని శపథం చేసుకున్నా.
ఇలా కాలం గడుస్తుండగా ఓరోజు మా డబ్బులేని బంధువొకడు కాలం చేసాడు.
బంధువు కదా అని చూడ్డానికి వెళ్ళాను.
డబ్బున్న బంధువులు చూడ్డానికి రాలేదు గానీ, ఫోన్ చేసి పరామార్శించారు.
వాళ్ళు ఫోన్ చేయడమే మహా అదృష్టమన్నట్టు మా డబ్బు లేని బంధువులంతా అంత విషాదంలోనూ ఆనందపడ్డారు.
అయితే అక్కడో చిక్కు వచ్చి పడింది.
దహన సంస్కారాలకు ఓ యాభై వేలు డబ్బు తక్కువ పడింది.
పోయింది బంధువు కదా అని, నా దగ్గర ఉన్న ఇరవై వేలు చేతిలో పెట్టాను.
వాళ్ళ మొహంలో అసంతృప్తి కదలాడింది.
మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, బంధువు పోతే ఆమాత్రం యాభై వేలు ఇవ్వలేడా అని నాకు వినిపించేటట్టే అనుకున్నారు.