జోకర్ మీద వాల్మీకి బాణాలు!
జిక్కీ జోకర్ రావు గట్టిగా ఊపిరి పీల్చి,
పెద్ద ఆచార్యుడి పోజు పెట్టి,
దేశంలో మూడు వందల రామాయణాలున్నాయి తెలుసా? అన్నాడు.
మూడు వందలున్నా,
అన్ని కథల్లోను రాముడే హీరో,
రావణాసురుడే విలన్ కదా జోకర్?
అన్నాడు దారిన పోయే దానయ్య.
అవుననుకో, అని నసిగాడు జోకర్ రావు.
కానీ, బౌద్ధ రామాయణంలో వేరేగా ఉంటుంది. తెలుసా?
అన్నాడు అంతలోనే.
దశరథ కథ, అనామక జాతకం,అతీత జాతకం అని ఆ బౌద్ధ కథల్లో ఎన్నో రకరకాల కల్పనలు ఉన్నవి కదా జోకర్?
అడిగాడు దానయ్య.
అవును. ఒక కథలో సీత రాముడికి చెల్లెలు అని ఉంది,తెలుసా?
అన్నాడు జోకర్ రావు.
అయితే ఏమిటి జోకర్?
మిగిలిన బౌద్ధ కథల్లో అలా లేదుగా?
ఒక్కో కథలో ఒక్కోలా ఉన్న అన్యధర్మంలో పుట్టిన కథలు మనకు ప్రామాణికం ఎలా అవుతాయి జోకర్? అడిగాడు దానయ్య.
ఆ మాటకు సమాధానం చెప్పకుండా,
వాల్మీకి వశిష్టుడికి గోవు మాంసం వండి పెట్టినట్టు
భవభూతి తన రామాయణం నాటకంలో రాసాడు తెలుసా?
అని డబాయించాడు జోకర్ రావు.
8 వ శతాబ్ది కవి స్వకపోల కల్పనలా? లేక
రామాయణ కర్త వాల్మీకా మనకు ప్రమాణం?
సరి, నీకు తెలియని విషయం ఒకటి చెబుతా విను.
అథర్వణ వేదకాలం నాటికి మనకు చెఱుకు పంట బాగా తెలుసు. చెఱుకు ప్రస్తావన ఉన్న అనేక మంత్రాలు ఆ వేదంలో ఉన్నవి.
స్కాంద పురాణంలో చక్కెరను ధేనువు ఆకారంలో పోత పోసి దానానికి,నైవేద్యానికి ఉపయోగించాలని ఉంది.
దీనినే శర్కరాధేనుః అంటారు.
విప్రులు,ఋషులు జంతువులను చంపరాదని నియమం కనుక దాని బదులు ఈ చక్కెరతో చేసిన ఆవు బొమ్మను అతిథులకు పెట్టేవారు.
ఇలాగే బెల్లంతో చేసిన ధేనువు గుడ ధేనువు.
అన్నాడు దానయ్య.
ఈ సమాధానంతో తెల్లమొహం వేసిన జోకర్ రావు,
వాల్మీకి ఒక్కడే అని నమ్మకం ఏముంది?
ఎంతమంది వాల్మీకులున్నారో?
అన్నాడు డాంబికంగా.
రేయ్, అడ్డ గాడిదా,
ఇప్పటిదాకా నీ జడ్డి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చా.
రామాయణ కర్తనైన నా ఉనికినే ప్రశ్నిస్తావురా?
నేనింకా నా విలువిద్య మరువలేదు రా!
అని హూంకరిస్తూ,
దారిన పోయే దానయ్య వాల్మీకి రూపంలోకి మారి ఝాంఝామ్మని బాణాలు వదలడం,
ఆ బాణాల దెబ్బకి జిక్కీ జోకర్ రావు పరుగు లంకించుని,
ఆ పరుగో పరుగులో రావణ లంకకి చేరడం జరిగిపోయాయి.
అలా లంకలో పడ్డ జోకర్ రావు ఇంత వరకూ తిరిగి రాలేదు.
లంఖిణి మింగేసిందని కొందరు,
త్రిజట ఎత్తుకుపోయిందని కొందరు అనుకున్నారు.