ప్రేమ కవితా పిపాసి!

 


గురువు గారు, ఇన్నిన్ని ప్రేమ గీతాలు 
ఎలా రాయగలుగుతున్నారండీ? 

చాలామంది వనితలు మిమ్ములను ప్రేమించుట చేతా?


పిచ్చివాడా, కవిని ఎవరూ ప్రేమించరురా నాయనా. 

కవే అందరినీ మూగగా ప్రేమిస్తూ 
కవిత్వం రాస్తూ ఉంటాడు.

అదేమిటి గురువు గారు, 
కవిని ప్రేమించే వనితలే ఉండరా?

ఉండొచ్చు. 
వారంతా కవిత్వాన్ని చూసి ప్రేమించి, 
కవిని చూసాక పారిపోతార్రా, వెర్రివాడా! 

ఎంచేత గురువు గారు? 

ఈ కవిగాడొక ఊహా ప్రపంచంలో జీవించే ఊహాజీవి. 
వీడికి, నిజ జీవితానికి చుక్కెదురురా, అబ్బాయ్‌!

వీడి నాన్‌ ప్రాక్టికల్‌ వేషాలు చూసి 
ఆ వచ్చిన పిల్ల అట్నించటే పోతుంది.

 వీడు భగ్న హృదయుడై మళ్ళీ కవిత్వం రాస్తాడు! 


మరి పెళ్ళి చేసుకుంటే భార్య ఉంటుందిగా, గురువు గారు? 

చెప్పాగా, 
వీడొక ఊహా జగత్తులో విహరించే,  
నాన్‌ ప్రాక్టికల్‌ , ఎమోషనల్‌ జీవి అని.

వీడికెప్పుడూ ఉన్నది చాలదు. 

ఊహాసుందరి కావాలి! 

ఆవిడ ఈ బాహ్య జగత్తులో ఎక్కడా దొరకదు 
కాబట్టి వీడు నిత్య విరహజీవి! 

ఓరి,వీడి విరహం తగలెట్ట! 
ఏం మనిషండీ ఈ కవి అనే జీవి? 

అలా అనెయ్యకు, 
అదిగో, సరిగ్గా ఆ బలహీనత వల్లే అతడు నిత్యం కవిత్వం చెప్పగలుగుతున్నాడు, 
అజరామరమైన ప్రేమ గీతాలు రాయగలుగుతున్నాడు! 

ఓ! అదా,గురువు గారు. బావుంది!

అయితే మంచి కవిత్వం రావాలంటే
అతని మానాన అతన్ని వదిలేయాలంటారు, అంతేగా? 

సరిగ్గా పట్టావ్‌. అంతే! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు