షీలా కీ జవానీ!

 


పెళ్ళి కాని ప్రకాష్‌ అమిరికాలో సాఫ్ట్వేర్‌ కూలీ ఉద్యోగం చేస్తూ రోజులు దొర్లిస్తున్నాడు.

ఎప్పటివలె అతడొక రోజు భడేల్‌ బ్రదర్స్ కి కూరలు కొనడానికి వెళ్ళాడు.

అతగాడు కూరలు కొంటున్నంతసేపూ,

My name is షీలా!
షీలాకి జవానీ! 

అన్న పాట పాడిందే పాటగా వినిపించింది.

కూరలు కొని కారెక్కి విదేశీ దేశీ రేడియో ఆన్‌ చెయ్యగానే, 

My name is షీలా!
షీలాకి జవానీ! 

అన్న పాటను ఆ రేడియో మారుమోగుతోంది.

ఆ తర్వాత బిర్యానీ దొరుకుతుందని, 
దేశీ దివాలీ కార్యక్రమానికి హాజరయ్యాడు.

అక్కడ డించక్‌ డించక్‌ డీజేలో,

My name is షీలా!
షీలాకి జవానీ! 

అన్న పాటకు 
ఆంటీస్‌ & అంకుల్స్, 
బాయ్స్ & గరల్స్ 
డాన్సాడుతుంటే 
తనకొచ్చిన ఒక్క తీన్‌మార్‌ స్టెప్పు వేసి,
 బిర్యానీ తిని ఇంటికి వచ్చాడు.

మరుసటి రోజు ఆదివారం కావుటచే 
స్థానిక తెలుగు కార్యక్రమానికి హాజరై నాడు. 

అందులో మళ్ళీ,

My name is షీలా!
షీలాకి జవానీ! 

అన్న పాటకు ఔత్సాహికులు నృత్య ప్రదర్శన ఇవ్వగా 
అది చూసి తరించి ఇంటికి వస్తుండగా, మళ్ళీ కారులో,

 My name is షీలా!
షీలాకి జవానీ! 

అన్న పాట వెంటబడింది.

ఏతావాతా పెళ్ళికాని ప్రకాష్‌ ఆ పాటకి, 
ఆ పాటలోని షీలాకి connect అయిపోవడం జరిగిపోయింది.

అతని తన్హాయి ముదిరి,
 షీలా అనబడే అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నట్టు, 
కలిసి పాటలు పాడుతున్నట్టు ఊహించుకుంటూ 
అమందానంద మందారమకరందంలో ఓలలాడసాగాడు. 

షీలా అన్న పేరున్న అమ్మాయి కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ, 
విఫల ప్రయత్నుడై, 
వికల మనస్కుడై, 
ఒక రోజు తల్లీ తండ్రీ పెళ్ళి గురించి చీవాట్టులు పెట్టడానికి ఫోన్‌ చేయగా, తాను “షీలా” అన్న పేరున్న అమ్మాయిని తప్ప మరొకరిని చేసుకోనని, తనకి పెళ్ళి సంబంధం తెస్తే ఆ పేరున్న పెళ్ళి కూతురినే తేవాలని ఖరాఖండిగా తెగేసి చెప్పాడు.

వారు ఉత్తర భారత దేశపు పేరున్న
దక్షిణ దేశపు అమ్మాయి కోసం 
తెలుగు దేశమంతా జల్లెడ పట్టి 
చివరికి నార్త్ లో సెటిలవడం చేత 
పిల్లకి షీలా అన్న పేరు పెట్టుకున్న 
సౌత్‌ తెలుగు మద్రాసీ సంబంధం ఒకటి తీసుకొచ్చారు.

పేరుతో సహా, ఆ పిల్ల ఫుల్‌ మేకప్‌ తో ఉన్న ఫొటో మన పెళ్ళికాని ప్రకాష్‌ మనసును దోచెయ్యడం చేత ఆ సంబంధం ఖాయమైపోయింది.

తాంబూలాలు ఇచ్చేసారు కనుకా, 
ఇక తన్నుకు చావడమే మిగిలి ఉన్నది కనుకా, 
మన పెళ్ళికాని ప్రకాష్‌ తన షీలాకి రోజూ గంటలు గంటలు మాట్లాడే కిరణ జన్య సంయోగ క్రియలో భాగంగా ఓ రోజు, తనకి కాబోయే షీలాకు,

 పంజాబీ షీలాని,
గుజరాతీ షీలాని,
యూపీ షీలాని,
బీహారీ షీలాని

తాను ఎలా ఎలా ప్రేమించి పెళ్ళాడడాన్కి ప్రయత్నించిందీ,
 వారంతా మొదట ఈ తెలుగు గోంగూర పచ్చడి గాడిని 
చూచి ముచ్చట పడినా,
 
ఆనక సదరు ఉత్తరదేశ షీలాలు-

పనీర్‌ బటర్‌ మసాలా, 
సర్సోంకా సాగ్‌, 
బైంగన్‌ కా బర్తా,
దాల్‌ మఖానీ ల వైపుకి
 వెళ్ళిపోయిన తన వ్యథాభరిత “షీలాన్వేషణ” గురించి,
 
తనకు కాబోయే షీలాకు,
తనకు తానే పెట్టుకున్న “షీల పరీక్ష” లో భాగంగా 
చెప్పేసి, ఊపిరి పీల్చుకున్నాడు.

ఇదంతా విని షాలా షాకైన షీలా, 
తన తండ్రికి వివరం ఉప్పందించగా, 
అది విని షాలా పరేషాన్‌ అయిన షీలా తండ్రి, 
ఈ షీలాత్‌ మదపిచ్చితో కొట్టుమిట్టాడుతున్న 
మీ అబ్బాయో బద్మాష్‌ కనుక పిల్లనివ్వనని 
పెళ్ళికాని ప్రకాష్‌ తండ్రితో కుండ బద్దలు కొట్టాడు. 

ఆ కోపంలో పెళ్ళికాని ప్రకాష్‌ తండ్రి,
పెళ్ళికాని ప్రకాష్‌కి ఫోన్‌ చేసి,
నానా తిట్లు తిట్టగా, 
తనకు దొరికిన తన తెలుగు షీలా 
అలా వెళ్ళిపోవడం గురించి 
మన పెళ్ళికాని ప్రకాష్‌ హృదయం కషాయం అవగా,
 మందు కొడుతూ, 

My name is షీలా!
షీలాకి జవానీ! 

అన్న పాటను అపార్టుమెంటు దద్దరిల్లేలా పెట్టుకుని,
 షీలా లోలుడై, 
షీలా సాగర మధనం వల్ల 
తనలో పుట్టిన షీలాహలాన్ని పానం చేస్తూ 
దుఃఖిత హృదయుడై ఉండగా, 

గండరగొండి మేనేజరు రాజ్య లక్ష్మి నుండి 
ఆఫీసు పని గురించి మెస్సేజ్‌ వచ్చింది.

ఏడుపు వస్తే ఏడవ వచ్చు గానీ,
 ఆఫీసు పని మాత్రం చెయ్యాలి కనుక, 
System on చేసి, 
రాజ్యలక్ష్మికి మెయిల్‌ రాసి, 

Subject: Sheela ki Jawani 

అని type చేసి send కొట్టాడు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన