మాటలోని తీట తెలుగు సినీ పాట!
సినిమా పాట రాద్దామనుకుంటున్నా బావా! సలహా చెప్పు.
సినిమా పాట వెరీ సింపుల్ బామ్మర్దీ.
హిందీ పాటనుకో,
ప్యార్, ఇష్క్,మొహబ్బత్,దీవానా,
మస్తానా,సజనా,సాజన్,దిల్,మస్ త్
ఇలాంటి పడికట్టు పదాలు డబ్బాలో వేసి కుదిపితే
permutations & combinations కింద ఎన్నో పాటలు పుట్టించొచ్చు.
హిందీ కాదు బావా,నేను తెలుగు పాటలు రాసి సినిమా వాళ్ళకి చూపించి ఏమైనా అవకాశం ఇస్తారేమో ట్రై చేద్దామనుకుంటున్నా బావా!
ఓకే. తెలుగు సిన్మా పాట్లైనా సింపులే.
చూడు, నాటు అన్న పదం తీస్కున్నావనుకో. దానికి ప్రాసగా,
నీటు,గోటు,మీటు,హాటు,స్వీటు,కా టు,తీటు
ఇలాంటి పదాలు వేసి మాంఛి రొమాంటిక్ పాట రాయొచ్చు.
అంతా బావుంది కానీ బావా, ఆ చివరి పదం “తీట” అని ఉండాలేమో?
హహ్హహ్హ! బాగా గమనించావ్ బామ్మర్దీ!
ఎవరైనా అడిగితే దానికి-
“you too have తీట” అన్న అర్థంలో “తీటు” అని చమత్కరించామని చెబుతాం!
ఓహో! ఓకే,బావా!
అంతే బామ్మర్దీ! అలివేణీ! అని పాట మొదలెట్టామనుకో,
తరువాత ఇంక - నా రాణీ అని, నడుం వీణ అని, నువ్వు జాణ అని ఇలా కొట్టేస్తాం!
జడ,మెడ,తొడ,వడ,యాడ,ఆడ,ఈడ,రగడ, మగడ,మీగడ,ఆవడ ఇలాంటి పదాలన్నీ కలిపి కొట్టావంటే టాప్ హీరోకి మాస్ డ్యూయెట్ రెడీ!
సింపులో సింపులస్య సింపులః !
ఓకే!ఓకే! త్యాంక్యూ బావా!
నువ్వు చెప్పిన దారిలో దూసుకుపోతా!
పాట రాసుకు పోతా!
కట్ చేస్తే నెల రోజులయ్యాక బామ్మర్ది ఈసురోమంటు తిరిగొచ్చాడు.
ఏమైంది బామ్మర్ది? మన ఐడియా సక్సెస్సా?
లేదు బావా, ఆ స్టూడియోల ముందు పాటలు రాసే రాతగాళ్ళు క్యూలో ఉన్నారు. వంద రూపాయలికి ఒకే పాటకు వంద versions రాసివ్వడానికి అక్కడ వాళ్ళంతా అక్కడ పడిగాపులు పడుతున్నారు. మనకెక్కడ దొరుకుతుందీ ఛాన్సు?
ఓ! అదా నీ సమస్య. ఒక పని చెయ్యి.
ఒక పాట రాసి, నువ్వే బాణీ కట్టి ఒక సింగింగ్ బెగ్గర్ తో సింగ్ చేయించి రికార్డు చెయ్యి.
చివర్లో ఇది ఫలానా రాంబాబు గారు రాసిన పాట, రోజూ రైళ్ళల్లో ఈ పాటతోనే అడుక్కుంటాను అని అతని చేత చెప్పించు.
అది YouTube లో వేసి వైరల్ చెయ్. ఓకే?
బామ్మర్ది రాంబాబు అలాగే చెయ్యడం,
ఆ బెగ్గర్ బ్రదర్ సింగింగ్ వీడియో వైరల్ కావడం,
ఆ తరువాత అతను టాలీవుడ్ లో
పెద్ద సినిమా పాటల రచైత కావడం
అలా అలా జరిగిపోయాయ్!
ఈ మధ్య హిట్టైన పాట,
ఆకు,వక్క
చెక్క,ముక్కా!
నీకే చుక్కా
చక్కా పక్కా!
పక్కా నీకే
కక్కా ముక్కా!
మన రాంబాబు రాసిందే!
ఈ పాటకు ఈ ఏడు మాస్కారా అవార్డు కూడా వచ్చింది.
అవార్డు అందుకుంటూ,
పై చరణంలో (చక్కా పక్కా లో) పక్కా అంటే పక్క, bed అని,
కింద చరణంలో (పక్కా నీకే లో) పక్కా అంటే, పక్కాగా, for sure అన్న అర్థంలో వింత సొగసు సాధించానని అతగాడు ఆనందభాష్పాలతో చెప్పగానే,
ఆ హాలులో కరతాళధ్వనులు మిన్నంటాయి.
అక్కడ చప్పట్లు కొడుతున్న వారిలో రాంబాబు బావ ముందు వరుసలో ఉన్నాడు.