The quotation Master!

 


సుబ్బారావు రిటైరై విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు. 

ఉన్నట్టుండి తెలిసిన వారికి తెలిసిన వారికి తెలిసిన వారి ద్వారా తన చిన్ననాటి స్నేహితుడు జోగారావుతో ఎన్నెన్నో ఏళ్ళ తరువాత లంకె కలవడం ఎంతో సంతోషంగా అనిపించింది. 

జోగారావు చిన్నతనంలో మహనీయుల సూక్తులన్నీ ఒక పుస్తకంలో వ్రాసుకునే వాడని గుర్తు చేసుకున్నాడు సుబ్బారావు.

 ఇప్పుడు తనే సూక్తులు వ్రాసే స్థాయికి ఎదిగాడట! 
చాలా సంతోషమని స్నేహితుడిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు సుబ్బారావు. 

అలా WhatsApp లో లంకె కలిపాడో లేదో మరుసటి రోజు ఉదయం స్నేహితుడు జోగారావు నుండి శుభోదయం message వచ్చింది. 

నిన్నటి నిన్నల్లో రేపును వెదుక్కో కానీ రేపటి రేపుల్లో నిన్నను వెదక్కు.

శుభోదయం! 🌹

అన్న ఆ సూక్తిని చదివి తికమకపడ్డాడు సుబ్బారావు. వెంటనే జోగారావుకు ఫోన్‌ చేసి, రేయ్‌ జోగీ, ఈ సూక్తికి అర్థమేమిటిరా అని అడిగాడు ఆసక్తిగా.

ఆ సూక్తి తాను ఎందుకు రాసాడో ఓ రెండు గంటలు వివరించాడు జోగారావు. సుబ్బారావుకు సూక్తీ అర్థం కాలేదు, దానికి తన స్నేహితుడిచ్చిన వివరణా అర్థం కాలేదు. 

మరుసటి రోజు ఉదయం స్నేహితుడినుండి మళ్ళీ శుభోదయం message వచ్చింది సుబ్బారావుకు. 

నిన్ను నిన్నుగా చూడలేని ఈ లోకానికి నిన్ను నువ్వుగా ఇచ్చుకోకు.

శుభోదయం! 🌹

సుబ్బారావుకు ఇదీ అర్థం కాలేదు. 

మళ్ళీ స్నేహితుడికి ఫోన్‌ చేసాడు గానీ, ఈసారి కూడా డిట్టో.
 
సూక్తికన్నా స్నేహితుడిచ్చిన వివరణ 
ఇంకా క్లిష్టంగా అనిపించింది సుబ్బారావుకు.

ఇక ఆ తర్వాతనుండీ ఆ సూక్తులను చదివి ఫోన్‌ చేయడం మానేసాడుగానీ,
 ఆ రోజువారీ సూక్తి గురించి రోజంతా ఆలోచించడం మానలేదు. 

నీలో ఉన్న నిన్నుని నీలో లేని నిన్నుగా చూసే ఈ లోకాన్ని 
నీ నిన్నలలోంచి భాగించు‌. 

శుభోదయం! 🌹

నిజాయితీలోంచి పుట్టే స్వార్థానికి మరణశాసనం రాయి మిత్రమా!

శుభోదయం! 🌹

అందాన్ని ప్రేమించు కానీ అందాన్ని ఆశించకు
బంధాన్ని ఆశించు కానీ బంధాన్ని ప్రేమించకు!

శుభోదయం! 🌹

చింతకు చితి పెట్టేవాడు కాదు విజేత 
విజేతకు చింత పెట్టేవాడు కాదు విజేత
విజేతకు జోతలిచ్చే వాడు కాదు విజేత !

శుభోదయం! 🌹

ఇలాంటి చిత్ర విచిత్రమైన శుభోదయం సూక్తి ఉదయాన్నే చదవడం, వేరే పని ఏమీ లేదు గనుక దాని గురించే ఆలోచించడం,
 ఆ ఆలోచనల వల్ల సుబ్బారావుకు అజీర్తీ, ఆందోళనా పెచ్చరిల్లడం జరిగిపోతున్నాయి.

ఈ శుభోదయం సూక్తుల గురించి స్నేహితుడికి 
బుద్ధి చెప్పాలనుకున్నాడు సుబ్బారావు.

మరుసటి రోజు స్నేహితుడు జోగారావు కన్నా ముందే 
తనొక శుభోదయం సూక్తి పంపాడు.

సూక్తులు చదివి బాగుపడ్డ వాడు లేడు
సూక్తులు చదవక చెడ్డవాడు లేడు !
 
శుభోదయం! 🌹

ఆ రోజు జోగారావునుండి ఏ శుభోదయం సూక్తీ రాలేదు. 

మరుసటి రోజు మాత్రం జోగారావు నుండి, 

సూక్తిని చదివిన వాడు కాదు 
సూక్తిని జీర్ణించుకున్న వాడే జఠర పుష్టి ఉన్న జగజ్జేత! 

శుభోదయం! 🌹

అన్న శుభోదయం సూక్తి  వచ్చింది. 

అది చూసి ఒళ్ళు మండింది సుబ్బారావుకు. 

సూక్తులు చదివి లోకులు బాగుపడతారు అనుకునే వాడు శుంఠ! 

శుభోదయం! 🌹

అన్న శుభోదయం సూక్తిని మరుసటి రోజు జోగారావుకు పంపాడు. 

ఇంక ఈ దెబ్బతో జోగారావు నుండి సూక్తులు రావని అనుకుని సంతోషించాడు సుబ్బారావు.

అయితే ఆ సంతోషం ఒక్క రోజు కన్నా ఎక్కువ నిలవలేదు. 

సూక్తిని వినని వాడు వెధవ,చదవని వాడు చవట ! 

శుభోదయం! 🌹

అన్న జోగారావు సూక్తి చదివి ఒళ్ళు మండిపోయింది సుబ్బారావుకు. 

పనికిమాలిన సూక్తులు పంపేవాడు పింజారీ వెధవ !

శుభోదయం! 🌹

అన్న సూక్తి పంపాడు స్నేహితుడికి. 

మరుసటి రోజు ఉదయం జోగారావు మళ్ళీ శుభోదయం చెప్పాడు-

తనకు అర్థం కాని సూక్తులన్నీ వ్యర్థం అనుకునే వాడు వెధవాయి!

శుభోదయం! 🌹

ఇది చదివి తల పట్టుక్కూచున్నాడు సుబ్బారావు. 

ఆ తరువాత నుండీ స్నేహితుడి శుభోదయం messages ను పట్టించుకోవడం మానేసాడు సుబ్బారావు.

అలా రెండేళ్ళు గడిచాయి. 

ఆ తరువాత కొన్ని రోజులు జోగారావు నుండి శుభోదయం messageలు రావడం ఆగిపోయాయి. 

కొద్ది రోజులు ఊరుకున్నా, ఎంతైనా చిన్ననాటి స్నేహితుడు కదా, ఏమైందోనని విచారిస్తే, ప్రస్తుతం జబ్బు పడి మంచం పట్టినట్టు తెలిసింది.

ఆస్పత్రికి వెళ్ళి మంచం పట్టి, మాట్లాడలేని స్థితిలో ఉన్న స్నేహితుడిని చూడబోయాడు సుబ్బారావు. 

జోగారావు తన మంచం దిండు కింద నుండి ఓ పుస్తకం తీసి సుబ్బారావు చేతిలో పెట్టాడు.

ఆ పుస్తకం మీద “శుభోదయం సూక్తులు” అన్న శీర్షిక, దాని కింద, 
రచన: Quotation Master జోగా రావు  అని ఉండడం చూసి  అవాక్కైయ్యాడు సుబ్బారావు.

తాను మంచం పట్టడడం వల్ల రోజూ పొద్దున్నే స్నేహితులకు 
శుభోదయం సూక్తులు పంపలేక పోతున్నానని తెగ బాధ పడి,
తన సూక్తులన్నీ పుస్తకంగా వేయించి, తనను చూడ వచ్చిన స్నేహితులకు ఇలా పంచుతున్నారన్నయ్యా! అంది జోగా రావు భార్య.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన