కాఫీ యుద్ధంలో గెలవడం ఎలా?
హమ్మయ్యా పనంతా అయిపోయిందని కొత్త కోడలు
కాసేపు వీడియో గేమ్ ఆడుకుంటోంది.
కొత్త కోడల్ని సతాయించడాన్ని ఆనందిస్తోన్న కొత్తగా అత్త గారైన అత్తగారు, టీవీ సీరియల్ చూస్తూ కాఫీ తెమ్మని కోడల్ని కేకేసింది.
ఇది ఆ రోజులో ఆరోసారి.
కొత్త కోడలికి చిర్రెత్తుకొచ్చింది.
బండబారి భూతేంద్రనాథ్ రాసిన “కోడలిగా గెలవడానికి 66 పాకుడురాళ్ళు” అన్న పుస్తకం తీసింది.
అందులో కాఫీ సతాయింపు గురించి ఉందేమో వెతికింది.
Yes, ఉంది!
“కాఫీ యుద్ధంలో గెలవడం ఎలా?” అన్న ఉప శీర్షికే ఉంది.
మీ అత్తగారు గడిగడికీ కాఫీ తెమ్మని వేధిస్తోందా?
ఇక్కడే మీరు emotional కాకుండా తెలివిగా ఆలోచించాలి.
మీ అత్తగారి కాఫీలో వేపాకు కషాయం కలిపి, మీరు మాత్రం చక్కెర వేసుకోండి.
ఈ కాఫీ ఒక్క గుక్క తాగగానే, రెండు రకాల ప్రతి చర్యలు రావొచ్చు. ఒకటి- మీ అత్తగారు కాఫీ గ్లాసును ఎత్తి కొట్టవచ్చు.
రెండు- మీ ఆయన్ను పిలిచి ఆ కాఫీని రుచి చూడమని అడిగి మిమ్మల్ని ఇరుకున పెట్టొచ్చు.
మొదటి reaction వల్ల మీకే లాభం. మీ ఆయన దృష్టిలో మీకు positive points, మీ అత్త గారికి negative points వస్తాయి.
రెండో reaction వస్తే మీరు చాకచక్యంగా వ్యవహరించి, ఆయనకెందుకులే అత్తయ్యా, చక్కెర తక్కువైందేమో నేనే తాగి చూస్తా. అని ఆ వేప కషాయం కాఫీని నవ్వుతూ గటగటా తాగెయ్యాలి.
ఇలా రెండు మూడు సార్లు చెయ్యండి చాలు. మీ అత్త గారు మిమ్మల్ని కాఫీ పెట్టమని అడగడం మానేసి తానే కాఫీ పెట్టుకోవడం మొదలు పెడుతుంది.
కొత్త కోడలికి ఈ చిట్కా నచ్చేసింది.
వేపాకు పొడి కొనడానికి బజారుకు వెళ్ళింది.
ఇంతలో అత్తగారు చూస్తున్న సీరియల్లో హీరో మొహం మారడంతో ఆ ఎపిసోడ్ ముగిసింది.
కాఫీ ఇంకా రాలేదు.
అత్తకు చెడ్డ కోపం వచ్చింది.
ఈ కోడలికి బుద్ధి చెప్పడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ బండబారి భూతేంద్రనాథ్ రాసిన “అత్తగా గెలవడానికి 66 పాకుడురాళ్ళు” అన్న పుస్తకం తీసి వెతికింది.
అందులోనూ “కాఫీ యుద్ధంలో గెలవడం ఎలా?” అన్న ఉపశీర్షిక ఉంది!
మీ కోడలు ఎన్నిసార్లు పిలిచినా కాఫీ ఇవ్వకుండా అవిధేయత ప్రకటిస్తోందా? అయితే ఒక పని చెయ్యండి- కోడలు తెచ్చిన కాఫీ గ్లాసుని విసిరి కొట్టండి. అయితే ఇది మీ అబ్బాయి ఇంట్లో లేనప్పుడే సుమా. లేకపోతే మీకు negative points వస్తాయి.
మీ కోడలు మీమీద కోపంతో ఒక్కోసారి కాఫీలో ఉప్పు కలపొచ్చు, కారం కలపొచ్చు, వేపాకు కషాయం కూడా కలపొచ్చు.
అప్పుడు మీ అబ్బాయి దగ్గరలో ఉంటే, పిలిచి అతని చేత తాగించండి.
మీ కోడలు తెలివిగా అడ్డు పడొచ్చు. తనే తాగుతానని ఆ కాఫీ కప్పు లాక్కోవచ్చు. ఇక్కడే మీరు చాకచక్యంగా వ్యవహరించి ఆ కాఫీని మీ అబ్బాయి గొంతులో పోసి మీ కోడలి నిర్వాకం బయట పెట్టాలి.
కొత్త అత్తగారికి ఈ చిట్కా నచ్చేసింది.
కోడలు ఇచ్చే next కాఫీ కోసం ఎదురు చూడసాగింది.
కొత్త కోడలు బండబారి చిట్కా వాడి కాఫీలో వేపాకు కషాయం కలిపి అత్త గారికి అందించింది.
అత్త గారు అది ఒక్క గుక్క తాగి, దాని విపరీత రుచికి అదిరిపడి ఆ కాఫీ గ్లాసును విసిరి కొట్టబోయి, అంతలో బండబారి చిట్కా గుర్తొచ్చి, తమాయించుకుని, కొడుకును పిలిచి తాగమంది.
ప్రమాదాన్ని గుర్తించిన కోడలు, ఆయనకెందులే అత్తయ్యా, నే చెప్తాగా అంటూ ఆ కాఫీ కప్పు లాక్కుని తాగబోతుండగా,
కోడలిని కాఫీ కోర్టులో దోషిగా నిలబెట్టగలిగే అపూర్వ అవకాశం కోల్
పోతున్నందుకు కంగారు పడి, ఆ అత్త గారు, ఆ సదరు వేప కషాయం కాఫీని కోడలు చేతిలోంచి లాక్కుని కొడుకు గొంతులో పొయ్యడానికి ప్రయత్నిస్తుండగా, కొడుకు తన చేతిలోని బండబారి భూతేంద్రనాథ్ విరచిత “కొడుకుగా విజయానికి 66 పాకుడు రాళ్ళు” అన్న పుస్తకాన్ని అడ్డు పెట్టి విజయవంతంగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని కాలర్ ఎగరేసాడు.
అతని చేతిలోని ఆ పుస్తకాన్ని చూసి అదిరి పడ్డ అత్త గారు-కొత్త కోడలు, దాన్ని లాక్కుని చూడగా, అందులో “కాఫీ యుద్ధంలో గెలవడం ఎలా?” అన్న ఉప శీర్షిక ఉంది!
మీ అమ్మా, భార్యా కాఫీ విషయంలో గొడవ పడి మధ్యలో మిమ్మల్ని లాగి పరీక్ష పెట్టవచ్చు. మీరస్సలు ఆ గొడవలో తలదూర్చకండి.
మీ ఆవిడ కాఫీలో వేపాకు కషాయం కలపొచ్చు. అది మీ చేత తాగించి, కాఫీ కోర్టులో మీ ఆవిడను ముద్దాయిని చెయ్యాలని మీ అమ్మ ప్రయత్నించవచ్చు. అప్పుడు మీరు అక్కడినుండి తలవంచుకుని బయటికి వెళ్ళిపోవడమో, లేదా ఆ కాఫీని ఇద్దరి గొంతుల్లోనూ పోయడమో చెయ్యండి.
ఇది చదవగానే అత్త గారికి, కొత్త కోడలికి కోపం నషాళానికి అంటింది.
ఇద్దరూ చెరో చీపురు పట్టుకుని బండబారి ఇంటికి బయల్దేరారు.
వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పటికి బండబారి కాఫీ తాగుతున్నాడు.
వాళ్ళ అవతారాలను చూసి వాళ్ళు అత్తా కోడళ్ళనీ,
కాఫీ యుద్ధంలో ప్రత్యర్థులనీ గ్రహించాడు.
వెంటనే రెండు కాఫీ దళాలు తీసి, కాఫీ మంత్రాలు పఠించగానే,
కాపచ్చీనో భూతం,
చికరీ దెయ్యం,
ఎస్ప్రెసో రాక్షసుడు
ప్రత్యక్షమై ఆ అత్తాకోడళ్ళ వెంటబడ్డాయి.
దాంతో వాళ్ళిద్దరూ చీపుళ్ళక్కడ పారేసి
అమ్మోయ్! నాయనోయ్! కాఫోయ్!
అంటూ ఇంటి వైపుకి పరుగులు తీసారు.