మీసాభాస



 

మీసాల గురించి విడాకుల దాకా వచ్చిందా?

 అదేమిట్రా విడ్డూరం?

అవున్రా. 
మా ఆవిడ నిమ్మ కాయలు నిలబెట్టేంత పెద్ద పెద్ద మీసాలు ఉన్న వాడినే చేస్కుంటా అని షరతు పెట్టింది. 

“మీసాల సొగసులు” అన్నది తన అభిమాన పుస్తకమట!

ఓస్‌! మీసాలే కదా అని పెళ్ళి నాటికి పెంచవచ్చులే అని సరేనన్నా. 

తర్వాత? మీసం పెంచావా మరి?

పెంచాలని ఎన్నో ప్రయత్నాలు చేసానురా. 

“మీస వర్థినీ తైలం”,
 “మీసకేశ సువర్థినీ తైలం”, 
“పంచరత్న మీసతైలం” 
లాంటివి ఎన్నెన్నో పేరొందిన మీస తైలాలు పట్టించా. 

పని చేసాయా మరి? 

ఉన్న మీసం ఊడింది!

అయ్యయ్యో, అప్పుడేం చేసావ్‌?


పెళ్ళి రోజు రానే వచ్చింది. 

చేసేది లేక పెట్టుడు మీసంతో పెళ్ళి తంతు కానిచ్చా. 

నా గుబురు మీసాలు చూసి మా ఆవిడ ఎంతో సంతోషించింది. 
కానీ ఆవిడ సంతోషం ఒక్క రోజు కూడా నిలవలేదు. 

పెళ్ళైన మరుసటి రోజు, అబ్బ! ఎంత బాగున్నాయో మీ గుబురు మీసాలు, దర్జాగా! అంటూ లాగబోయింది. 

అప్పుడు?

తప్పించుకుందామని శతవిధాలా ప్రయత్నించా. 
కానీ మా ఆవిడ వదిలితేనా? 
అలా లాగిందో లేదో ఇలా చేతిలోకి ఊడొచ్చాయి! 

తర్వాత?

తర్వాతేముందీ, నే మోసపోయాను దేవుడో అంటూ సోకన్నాలు మొదలు పెట్టింది.

ఇదిగో, ఈ మీస రహిత భర్త నాకు వద్దు, నాకు మీసాలు ఇప్పించండీ, సారీ, విడాకులు ఇప్పించండీ, అని కోర్టులో కేసు వేసిందిరా. 

ఎంత పని జగిరింది! ఇప్పుడేం చేస్తావురా? 

మీస సహిత మగాడైనా, 
మీస రహిత మగాడైనా 
ఈ మీసావమానాన్ని భరించగలడా చెప్పు? 

అందుకే మీసాల కోసం వీసా తీస్కుని ‌ముస్టాచ్ నగరానికి పోతున్నా. 

ముస్టాచ్ నగరానికెందుకురా? 

అక్కడ “మీస వీవింగ్‌” చేయించుకుని సొంత మీసాలతో వస్తానని, 
మీసాల సూర్య నారాయణ మూర్తి సాక్షిగా ప్రమాణం చేస్కున్నారా. 

తిరిగొచ్చేటప్పుడు నేను విమానం దిగుతుంటే, నా మొహం మీద చిరునవ్వుండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలిరా! 
అదే నా శపథం!!

మంచిదిరా! మీసాల విక్రమార్కా! శీఘ్రమేవ సుమీస ప్రాప్తిరస్తు! 

అంటూ మన వాడు ఈ విక్రమార్కుని మీసావేశాన్ని మననం చేస్కున్నాడు-


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన