అది చూపేనా విరి తూపేనా
నువ్వేనా అని ఎన్ని రకాలుగా అంటారో బాలు.
ఎన్ని రకాల విరుపులు చూపించవచ్చో అన్ని రకాలుగా.
బాలు వినిపించే లోతైన భావం ఘాటైన తేనీరు రుచిలా కమ్మేస్తుంది.
అది చూపేనా
విరి తూపేనా
దగ్గర ఆగిపోతానంతే! నాకు నచ్చేవి అందమైన కళ్ళు. ఆ తరువాత అందమైన కనుబొమలు. మనుషుల్ని మర్చిపోతాను గానీ వాళ్ళ కళ్ళు పలికించిన భావాలను మాత్రం మర్చిపోలేను.
హీరోల్లో NTR వి, కథానాయికల్లో సావిత్రివి అందమైన కళ్ళు.
తూపు అంటే బాణం. విరి తూపు పూల బాణం.
చూపు విరి తూపు.
నిన్నేనా
అది నేనేనా
కలగన్నానా?
కనుగొన్నానా?
కనుగొన్నానా అనడం గమ్మత్తు.
తొందర
వందర
చేసేనా
చిందర వందర ఉందిగానీ, తొందర వందర అనడం ప్రయోగం!
మళ్ళీ మళ్ళీ
కల వచ్చేనా?
ఇల మల్లెల మాపై
విచ్చేనా?
మాపు అంటే సాయంత్రం. మల్లెలు సాయంకాలాలు విచ్చుతాయి.
మల్లెల మాపు అనేది మల్లె పూలంత అందమైన ఊహ.
ఆత్రేయ గారికి మల్లెపూలంటే ఇష్టమనుకుంటా.
చాలా పాటల్లో మల్లెలు విచ్చుతాయి.
అన్నీ తూనీగల్లాంటి తెలుగు పదాలు.
ఎక్కడా అరచెంచా బరువు లేని ఏడు మల్లెలెత్తు తెలుగు.
తెలుగు వచ్చి, ఈ పాటను ఆనందించగలిగే వాడు ఈ భూమి మీద
అందరికన్నా అదృష్టవంతుడు.