అర్హత పొంది ఆకాంక్షించు

 

విలువైన దుస్తులు, సకలాభరణాలు ధరించి ఏనుగు మీద ఊరేగింపుగా వెళుతున్న రాజును చూసి ఈర్ష్య పడ్డాడు తోటమాలి. 


పంతులు గారు, ఎప్పుడూ వీళ్ళేనా రాజులు? నేను కాలేనా? అని అడిగాడు దోవన పోతున్న పండితుడిని. 

రాజు కావాలంటే చిన్నతనం నుండీ యుద్ధవిద్యల్లోను, ఇంకా అనేక శాస్త్రాల్లోను ఆరితేరి ఉండాలి. 
దానికోసం ఎన్నో యేళ్ళు పరిశ్రమ చెయ్యాలి. 
పరిపాలన ఎలా చెయ్యాలో కొంతకాలం ఇతర మిత్ర రాజ్యాల రాజుల వద్ద ఉండి నేర్చుకుని రావాలి. 
మన రాజ్య పరిపాలన విషయమై కొన్నేళ్ళపాటు రాజుకు సహాయంగా ఉండాలి. 
ఇంత వ్యవహారం ఉంది, తెలిసిందా? 
అన్నాడు పండితుడు. 

అయితే ఏంలెండి, తరువాత హాయిగా సింహాసనం ఎక్కుతాడు అన్నాడు తోటమాలి అసూయగా. 

రాజ్య పాలన అంత తేలిక కాదు. 
ఆర్థిక శాఖ, సైనిక శాఖ వంటి అనేక శాఖల అధికారులతో నిరంతరం చర్చిస్తూ ఆయా శాఖలను, వాటి పనితీరును గమనిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ ఉండాలి. 
ఇన్ని రాజ్య వ్యవహారాలలోనూ పక్క రాజ్యాల వారు ఎవరైనా దండయాత్రలకు సన్నాహాలు చేసికుంటున్నారా, వారి ఎత్తులు ఏమిటన్నది ఎప్పటికప్పుడు వేగుల ద్వారా తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. 
ఎప్పుడు రాజ్యం మీదకు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు గనుక, ఏమరుపాటు లేక ఏ యుద్ధానికైనా సన్నద్ధంగా ఉండాలి అని వివరించాడు పండితుడు.

అయితే ఏంలేండీ, హాయిగా రాజ భోగాలు అనుభవిస్తూ ఉంటాడుగా? 

రాజు మృత్యువుకు సిద్ధంగా ఉండాలి. 
ఇంటా బయటా శత్రువులతో రాజు నెత్తి మీద కత్తి ఎప్పుడూ వేలాడుతూ ఉంటుంది. వినోద కాలక్షేపాలు ఉన్నా రాజ్య వ్యవహారాలు ఊపిరి సలపనంత పెద్దవి.
ఇంకా శత్రువులు కోట మీద దాడి చేసినప్పుడు తాను ఓటమి పాలైతే భార్యాబిడ్డలను తీసుకుని అడవుల పాలవవలసి రావచ్చు. 
ఇవన్నీ తెలుసు కాబట్టి రాజు భోగాలు అనుభవిస్తూ ఉన్నా అందులో మునగడు అన్నాడు పండితుడు. 

అయితే ఏంలేండీ, రాజుకు ఎవరి మాటా వినక్కర్లేదు. 
అందరూ రాజుకు భృత్యులేగా. 

నువ్వనుకుంటున్నది తప్పు. రాజు తన ప్రధాన మంత్రుల మాట వినవలసి ఉంటుంది, తనకన్నా ఎక్కువ అనుభవం కలవారు కనుక. 
అధికారుల మాటా, సలహాదారుల మాటా పెడచెవినా పెట్టకుండా విని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 
ప్రజల విషయంలోను, పాలన విషయంలోను, దండన విషయంలోను రాజ ధర్మాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. 

ఇంతకీ నేను రాజు కావాలంటే ఏం చెయ్యాలో చెప్పలేదు తమరు? 
అన్నాడు తోటమాలి చిరాగ్గా. 

నువ్వూ రాజు కావొచ్చు. 
నీ మాట వినే వారిని వందల్లోను, వేలల్లోను తయారు చేసుకుని, వారికి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చి, ఇప్పుడున్న రాజు మీద తిరుగుబాటు చేసి, గెలిస్తే నువ్వు సింహాసనాన్ని అధిష్టించవచ్చు. 

అప్పుడు కూడా నువ్వు రాజ్య పాలన విషయాలన్నీ ఆకళింపు చేసుకుని, అందరినీ సమన్వయ పరుచుకుని పరిపాలన చేయవలసి ఉంటుంది. 

నీకు అర్థం కాకపోయినా, ఆసక్తి లేకపోయినా సరే, కవులను, పండితులను, కళాకారులను ఆదరించవలసి ఉంటుంది. 

మొత్తంగా నీ ప్రవర్తనా జీవన విధానం పాత రాజు జీవన శైలిని పోలి ఉండాలి. 
లేకపోతే ప్రజల్లో అసంతృప్తి బయలుదేరి తిరుగుబాటు వస్తుంది. 

అర్హత పొంది ఆకాంక్షించు. 

అర్థమైందా? 
అన్నాడు పండితుడు. 

అయితే ఇప్పుడేంటీ?  నేను రాజును కాలేనంటారా? 
 అన్నాడు తోటమాలి విసుగ్గా. 


అదిగో అక్కడ చెట్టు పక్కన నిలబడి మన మాటలు వింటున్నాడే, అతడు రాజు గారి గూఢచారి. ముందు అతన్నించి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు. తరువాత రాజు కావడం గురించి ఆలోచిద్దూగానీ అన్నాడు పండితుడు. 

గూఢచారా? ఓరి నాయనోయ్‌! చెప్పారు కాదే పంతులు గారూ? 
బతికుంటే బలుసాకు తినవచ్చు! 
ముందు పరిగెత్తి నా తోటలో ఎక్కడైనా దాక్కుంటా!
అంటూ పిక్కబలం కొద్దీ తన తోట వైపుకి పరుగు తీసాడు ఆ తోటమాలి. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి