గుడు గుడు గుంచం - ఉప్మా రాగం
హెలో, చక్రధర రావు గారు, ముందుగా మీరు తయారు చేసిన కొత్త వంటకం, “గుడు గుడు గుంచం” with tagline
“దిబ్బలో ఇడ్లీ-కనుక్కో ఉప్మా“ కు అంతర్జాతీయ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలండీ.
సైన్సులో PhD చేసిన మీరు హోటెల్ బిజినెస్‌లోకి రావడానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా?
ధన్యవాదాలండీ. హోటెల్ బిజినెస్‌లోకి నా ప్రయాణం అనుకోకుండా సంభవించిందండీ.
నేను “అరటి నార-గోగు నార లక్షణాల తులనాత్మక పరిశీలన” మీద ఉప్మాకియా యూనివర్శిటీ నుండి PhD చేసి పట్టా సంపాదించాను గానీ నాకు ఉద్యోగం రాలేదు.
అప్పుడు ఖాళీగా ఇంట్లో ఉంటూ వంటింట్లో కూచుని అమ్మ చేస్తున్న వంటని పరిశీలిస్తూ క్రమంగా ఆసక్తి పెరిగి, వంట గురించి నోట్సు రాసుకోవడం మొదలెట్టా.
పోపులో ఆవాలు ముందు ఎందుకు వెయ్యాలి?
ఏ ఉష్ణోగ్రత వద్ద అవి చిటపటలాడతాయి?
మినపప్పు, శనగ పప్పు వేగడానికి ఎంత సమయం పడుతుంది?
గారె పిండిలో నీరు ఎక్కువైతే నూనె ఎందుకు పీలుస్తుంది?
గారె పిండిలో ఎంత నీరు కలిపితే గారెలు తయారౌతాయి?
చపాతీ పిండిలో నీరు కలిపితే, పాలు కలిపితే,నెయ్యి కలిపితే చపాతీల రుచి ఎలా ఎలా మారుతుంది?
ఇలాంటివన్నీ శ్రద్ధగా సైన్సుపరంగా ఆలోచిస్తూ రాసుకుంటూ ఉండేవాడిని.
మధ్యాహ్నాలు ఎవరూ లేనప్పుడు వంటింట్లో దూరి,
నూనె వాడకుండా నువ్వులు,కొబ్బరి,వేరుశెనగ వాడి నూనె రుచి తెప్పించడం ఎలా?
చింతపండు వాడకుండా నిమ్మకాయ,మామిడి కాయ లాంటివి వాడి అదే రుచిని తెప్పించడం ఎలా?
తీపి,పులుపు,ఉప్పు,కారం వీటిని సమపాళ్ళలో వాడి “ఉమామి” రుచి తేవడం ఎలా?
లాంటి అనేక ప్రయోగాలు చేస్తుండేవాడిని.
అలా నాకు ఉద్యోగం రాక రెండేళ్ళు గడిచాయి.
ఓ రోజు బజార్లో తోపుడు బండి దగ్గర బజ్జీలు తింటూ చూస్తే ఆ బజ్జీలు వేస్తోంది మా సీనియర్! అది చూసి చెగోడీ అయ్యా!
“ఈత నార-గన్నేరు నార లక్షణాల తులనాత్మక పరిశీలన” అన్న అంశం మీద మా ప్రొఫెసర్ దగ్గరే PhD చేసి పట్టా పుచ్చుకున్నాడు!
పదేళ్ళుగా ఉద్యోగాల కోసం వేటాడి, చిన్న చిన్న teaching ఉద్యోగాలు అవీ చేసి ఎన్నో అవమానాలు పడి, విసిగి వేసారి ఈ సెంటర్లో ఈ బజ్జీల బండి పెట్టుకున్నాడట!
బజ్జీలు తినేసి పక్కన బెల్లం జిలేబీ బావుంటుందని ఎవరో చెబితే అక్కడికి వెళ్ళి ఆ జిలేబీలు వేస్తోంది ఎవరో చూసి గులాబ్ జామయ్యా!
“జిల్లేడు నార-జనప నార లక్షణాల తులనాత్మక పరిశీలన” అన్న అంశం మీద మా ప్రొఫెసర్ దగ్గరే ఆరేళ్ళు పరిశోధన చేసి PhD పట్టా పుచ్చుకున్న మా సీనియర్!
బండి మీద తన పేరుతో బాటు డిగ్రీ కూడా రాసుకున్నాడు.
వాళ్ళని చూసి నా తల తిరిగిపోయింది. ఇంటికొచ్చి చింతపండు బెల్లం పాకంతో చేసిన లాలీపాప్ నోట్లో వేసుకుని నా పరిస్థితి ఏమిటా అని తీవ్రంగా ఆలోచించా.
నా సీనియర్ల మార్గం పట్టడమే బెటరనిపించింది.
వెంటనే మా అమ్మతో చర్చించి ఆవిడ సహాయంతో ముందు చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించా.
ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త కొత్త టిఫిన్లు చేసా.
అది క్లిక్కయ్యాక పెద్ద హోటెల్ పెట్టా.
తరువాత అలా అలా విస్తరించుకుంటూ వెళ్ళిపోయా.
షుగరు వాళ్ళకి, బీపీ వాళ్ళకి, గుండె జబ్బులున్న వాళ్ళకి ఇలా 14 రకాల జబ్బులకి మా దగ్గర వేరే వేరే మెనూలుంటాయ్.
మీకున్న జబ్బేమిటో మా సర్వర్స్ కి చెబితే ఆ మెనూ తెచ్చిస్తారు.
మేం వడ్డించే ప్లేట్లు, స్పూన్లు కూడా ఎడిబుల్!
తిన్నాక ఎవరి ప్లేట్లు, స్పూన్లు వాళ్ళే తినేసి వెళ్తారు కనుక మాకు శుభ్రం చేసే పని కూడా ఉండదు!
ఇంకో విషయం, నా బజ్జీల బండి సీనియర్‌కి, జిలేబీ బండి సీనియర్‌కి నేనే ఉద్యోగాలిచ్చా. సిటీలో రెండు బ్రాంచీలు వాళ్ళే చూస్తారు.
నా పెళ్ళి కూడా చాలా విచిత్రంగా జరిగింది. పెళ్ళి చూపులకి ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి ప్రశ్నలడిగి జవాబులు రాబట్టే వాడిని.
మైసూరుపాకు గుల్లగా రావాలంటే ఏం చెయ్యాలి?
జంతికలు కరకరలాడాలంటే ఏం కలపాలి?
రోటి పచ్చడి రుచిగా రావడానికి రహస్యం ఏమిటి?
దోసె పిండిలో మినప్పప్పు, బియ్యం పాళ్ళు ఏమిటి?
ఇలాంటి ప్రశ్నలు అడిగి అమ్మాయిలను disqualified గా declare చేసుకుంటూ వెళ్ళేవాడిని.
ఓ పెళ్ళి చూపుల్లో మాత్రం నాకు సరైన జోడీ దొరికింది.
నేనడిగిన అన్ని ప్రశ్నలకీ సమాధానం చెప్పడమే కాదు,
కల్యాణ రసం, మిరియాల చారు, టమోటా చారు, వెల్లుల్లి చారు,
వాము చారులను తులనాత్మక పరిశీలన చేసి వాటి మధ్య పోలికలను, తేడాలను వివరించమని అడిగింది! ఆ ప్రశ్న విని సాంబారయ్యా!
ఇంతకీ తన పేరు చారుమతి. సేమ్యాకియా యూనివర్శిటీ నుండి
“ తాటి బెల్లం-చెఱకు బెల్లం లక్షణాల తులనాత్మక పరిశీలన” అన్న అంశం మీద ఏడేళ్ళు పరిశోధన చేసి PhD పట్టా పుచ్చుకుంది!
ఉద్యోగం కోసం అయిదేళ్ళు తిరిగి,
చిన్న చిన్న ఉద్యోగాల్లో జీవితం ఊరగాయ అయిపోవడం ఇష్టం లేక
ఊరగాయలు తయారు చేయించి విదేశాలకు పంపే సంస్థ
“PhD పచ్చళ్ళు” ను పెట్టి లాభసాటిగా నడుపుతోంది!
ఇప్పుడు నా వ్యాపారమంతా తనే చూస్తుంది.
ఇంతకీ, నా “గుడు గుడు గుంచం” అన్న అంతర్జాతీయ బహుమతి పొందిన వంటకం గురించి మీకు చెప్పనే లేదు.
దాని tagline “దిబ్బలో ఇడ్లీ-కనుక్కో ఉప్మా“.
అంతర్జాతీయ పోటీ కదా, ఎవ్వరూ ఆలోచించని కొత్త వంటకం చెయ్యాలని ఎన్నో ప్రయోగాలు చేసా. ఇక్కడో విషయం చెప్పాలి,
నా బిజినెస్ ఎంత పెరిగినా నా సొంత వంటింటి లాబ్‌లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటా.
ఇంతకీ ఆ ప్రయోగాల ఫలితమే నా గుడు గుడు గుంచం వంటకం.
ముందుగా నేతితో ఎర్రగా కాల్చిన పెద్ద దిబ్బ రొట్టి.
దాన్ని మీరు మా హోటెల్ స్పెషల్ లేత కొబ్బరి పచ్చడి, వేరు శెనగ పచ్చడి,ఘుమ ఘుమలాడే సాంబార్‌తో తింటూ ఉండగా,
రొట్టి సెంటర్‌లో, లోపల ఇడ్లీ!
ఆ ఇడ్లీ రుచిని మీరు ఆస్వాదిస్తూ ఇడ్లీ సెంటర్‌ని కట్ చెయ్యగానే
అక్కడో వడ!
మీరు ఆశ్చర్యపోతూ దాన్ని తింటుండగా, సగం వడ వడలానే ఉంటుంది, అద్భుతమైన రుచితో!
వడ రెండో సగం కట్ చేస్తే పరిమళాలు వెదజల్లుతూ ఉప్మా!
ఇదేనండీ, మా “గుడు గుడు గుంచం” with tagline “దిబ్బలో ఇడ్లీ-కనుక్కో ఉప్మా“!
ఈ గుడు గుడు గుంచాలు రెండు ఆర్డర్ చేస్తే చాలు,
మీకు ఒకేసారి దిబ్బ రొట్టి, ఇడ్లీ,వడ,ఉప్మా with two చట్నీస్ and Sambar తో తిన్న ఆనందం కలిగి కడుపు నిండి పోతుంది!
కావాలంటే మీరు ఇతర హోటెల్స్ లో దొరికే అయిటమ్స్ తో తులనాత్మక పరిశీలన చేసుకోవచ్చు.
చాలా సంతోషమండీ, చక్రధర రావు గారు! మీ “PhD Scholars” హోటల్స్ మరింత బాగా successful గా run అవ్వాలని, మీ బిజినెస్ ఇంకా బాగా డెవెలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. Thank you so much for your time!