పాట గొంతు నులుముకున్న చోట

 




అనగనగా ఒక దేశం.
అందులో అనగనగా ఒక గ్రామం.

దున్నే వాడిదే భూమి! 

దున్నే వాడిదే భూమి! 

అన్నాయి అక్కడ కొత్తగా పుట్టిన ఎర్ర తలలు.

అది విన్న అఱక దున్నే కౌలు రైతుకు వెర్రి ఆశ పుట్టింది.

ఆరుగాలం శ్రమించేది నువ్వు! 
భూస్వామికి ఎందుకివ్వాలి కౌలు? 

అని రెట్టించాయి ఆ ఎర్ర వలలు.

నిజమే! నిజమే! 
తలలూపారు రైతులు. 

ఎర్ర తలల ఎర్ర వలలు ఆ రైతులకు వెర్రి మొర్రి కలలు పుట్టించాయి. 

మంటను ఎగదోసీ ఎగదోసీ రైతును తమ వైపు తిప్పుకుని,
 భూస్వామిని, అతని కుటుంబాన్ని పట్టపగలే చంపాయి ఎర్ర తలలు!

చూసారా, ఈ ఇల్లు, ఈ సంపద? 
అంతా మీరు శ్రమ కోర్చి కూర్చిందే!
తీసుకోండి! తీసుకోండి!
అన్నాయా రక్తసిక్త హస్తాల ఎర్ర తలలు.

అది విన్న ఆ బీద రైతుకు వెర్రి ఆశ పుట్టింది.

రైతు మొదటిసారి దొంగ అయ్యాడు, ఏ అపరాధభావమూ లేకుండా. 

ఆ తరువాత తన భూమి తనకే అనుకున్నాడా పిచ్చి రైతు.

ఆగండాగండి, ఇది ఉమ్మడి ఆస్తి. 
ఇక్కడ వ్యక్తిగత ఆస్తులకు చోటు లేదు!

భూమంతా కలిపి ఒకే మొత్తం చేస్తున్నాం.
అందరూ అందులో శ్రమించి పని చెయ్యాలి. 
ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచాలి

అన్నాయవి, సిద్ధాంతాల ఎర్ర తలలు.

రైతు మొదటిసారి కూలీ అయ్యాడు, ఏ దారీ లేక.

వ్యవసాయం జరిగింది.
ఫలసాయం వచ్చింది.
పంచేది మాత్రం ఎర్ర తలలే!

మనిషికి ఇంత.
మగవాడికి ఇంత.
అడ మనిషికి ఇంత.
ముసలి వారికి ఇంతే.
జబ్బు పడితే ఇంకా చానా కొంతే. 

ఎందుకు?

ఎందుకంటే శ్రమను బట్టి వాటా! 

మరి మిగిలింది? 

సుదూర తీరాల్లో ఉన్న ఆమ్రేడ్స్ కు పంపాలి!

ఎందుకు?

దేశమంతా రైతాంగాన్ని ఇలాగే విముక్త పరచడానికి!

మళ్ళీ పంట వేసారు. 
వ్యవసాయం నడిచింది.
ఫలసాయం వచ్చింది.
పంచేది మాత్రం ఎర్ర తలలే!


ఈసారి పంపకాలు జరపలేదు!

ఆగండాగండి, ఇకనుండీ మనది సమిష్టి జీవితం!
సమిష్టి ప్రయాణం! అన్నాయా రాద్ధాంతాల ఎర్ర తలలు.

ఎక్కడికీ ప్రయాణం?
వడి వడిగా అడుగులు వేసుకుంటూ 
విప్లవం వైపుకి! 

అంతా కలిసి గ్రామ భోజనశాలోనే భోజనం చెయ్యాలన్నారు.
ఇళ్ళల్లో వంట చెయ్యరాదు.
పంట సరుకులు, వంట చెఱుకులు నిలవ చెయ్యరాదు.

తిండికి రేషన్!
బట్టకు రేషన్‌!

ఎందుకు?

ఎందుకంటే దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది.
ప్రజలంతా త్యాగాలు చెయ్యాలన్నారు.

రైతు వెట్టి చాకిరీకి బందీ అయ్యాడు, మరో ఆలోచన చేసే సత్తా లేక.

తల్లులు బిడ్డలను గ్రామ శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి పనికి రావాలన్నారు.
ముసలి వాళ్ళు సైతం పని చెయ్యాలన్నారు.
జబ్బు పడ్డ వాళ్ళూ లేచి రావాలన్నారు.

పని.పని.పని.
విప్లవం. విప్లవం.విప్లవం.

పని చెయ్యకపోతే?
ఎదురు ప్రశ్నిస్తే?

శత్రువు!
విప్లవానికి శత్రువు!

శత్రువుని ఏం చెయ్యాలి? 

హింసలు పెట్టాలి!
శిక్షలు వెయ్యాలి!
ప్రాణాలు తియ్యాలి!

రైతులు భూస్వామిని గుర్తు చేసుకున్నారు,రహస్యంగా.
కౌలు తీసుకునే వాడే,
పండగలకి, పబ్బాలకి సొంత ఖర్చుతో భోజనాలు పెట్టేవాడు.
అందరికీ రెండు జతలు బట్టలు పెట్టేవాడు.
ఊళ్ళో ఉత్సవాలకి తనే ఆధ్వర్యం వహించేవాడు, సొంత డబ్బు ఖర్చు పెట్టేవాడు.
తగాదాలొస్తే న్యాయంగానే తీర్పు చెప్పేవాడు. 

ఎర్ర తలలు మతమంటే మౌఢ్యమన్నారు.
ఊళ్ళో పండగలు లేవు.
ఉత్సవాలు లేవు.

విప్లవ గీతాలే పాడాలి.
డోలు విప్లవ డోలు.
డప్పు విప్లవ డప్పు.
సన్నాయి విప్లవ సన్నాయి. 

ఎర్ర తలల ఎర్ర వలల్లో చేపల్లా చిక్కారు రైతులు. 

రైతులంతా ఎక్కడో కడుతున్న ఆనకట్ట కోసం పని చెయ్యడానికి గ్రామం ఖాళీ చేసి వెళ్ళాలన్నాయవి!
రైతుల పిల్లలను మరోచోట పని చేసేందుకు తరలించాలన్నాయి!

రాబోతోన్న అరుణారుణ మహా విప్లవానికి సమిధలు కావాలన్నాయి.
ఆ సమిధలు మీరే కావాలన్నాయి.


అదిగో చివరాఖరికి,
 ఆ వెర్రి రైతు ఎర్ర తలలు సృష్టించిన 
ఎర్ర భూతం కోరలు తోమే బానిస అయ్యాడు. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన