రక్ష!రక్ష!జనార్దనా!

 



ఉద్యమాలే మా ఊపిరి. 

ఉద్యమాలే మా పార్టీకి ఇడ్లీ దోస పాయసం. 

మా పార్టీ మొట్టమొదటి ఉద్యమం, పురుషుల బహిర్భూమి వ్యతిరేక ఉద్యమం.

మా కార్యకర్తలు తెల్లవారు ఝూమునే దారి కాచి, బహిర్భూమికి పొలాల్లోకి వెళ్ళే వాళ్ళ చెంబులు లాక్కునే వాళ్ళు. ప్రతిఘటించిన వారిని చెంబుతోను, చేతిలో ఉన్న కర్రతోను చేతి కిందకొస్తే చెయ్యి దెబ్బ, కాల్కిందకొస్తే కాల్దెబ్బ టైపులో కొట్టి వారిని పరుగో పరుగు చేసేవారు.

నేను కూడా మిగిలిన కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేసిన వాడినే. 
ఓరోజు ఒకడి చేతిలో ఉన్న చెంబు లాక్కుంటుంటే, తన ఇంట్లో ఉంది ఒకటే చెంబని, తన చెంబు తనకివ్వమని ఒకటే కాళ్ళావేళ్ళా పడ్డాడు. కొంచెం జాలేసిందనుకో, అయినా మానవత్వం కన్నా ఉద్యమం ముఖ్యం కనుక అతనెంత బతిమిలాడినా అతని చెంబు అతనికి తిరిగివ్వలేదు. 

మొత్తంగా మా ఉద్యమం సఫలమై గ్రామంలో పురుషులకొక శౌచాలయం ఏర్పడింది. మేం ఎవరి దగ్గరైతే చెంబులు లాక్కున్నామో ఆ జనాలే వేరే దారిలేక అప్పు చేసి రెండు మరుగుదొడ్లు కట్టుకున్నారు. ఊరి మొత్తానికీ రెండేనా అని మీరడగ వచ్చు. అది వాళ్ళ ఖర్మ. మనమేం చేస్తాం. 
 
ఇదిగో, మా పార్టీ కార్యాలయంలో మీకు కనిపిస్తున్న చెంబులన్నీ అలా వచ్చినవే. అప్పటి ఉద్యమ విజయానికి గుర్తుగా ప్రదర్శనగా పెట్టి ఉంచాం. అంతటితో ఆ ఉద్యమానికి చరమగీతం పాడి స్త్రీల బహిర్భూమి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించాం. 

పురుషులతోటి ఓకేగానీ, స్త్రీలతో చాలా కష్టమైందండోయ్‌! వాళ్ళు మమ్మల్నందరినీ జుట్టు పట్టుకుని తన్నడానికి వచ్చారు. ఒకసారి ఒక రౌండు అందరినీ ఉతికారు కూడా. అయినా మేం జడవలేదు, వెనుకంజ వెయ్యలేదు. నడ్డి విరిగినా, డిప్ప పగిలినా ఉద్యమాన్ని కొనసాగించాం. చివరికి మా ప్రయత్నం ఫలించి వారూ అప్పులు చేసి తిప్పలు పడి ఒక శౌచాలయాన్ని కట్టుకున్నారు. 

అయితే, ఈ రెండు శౌచాలయాల నిర్వహణ మాదే. దానికి ఊరంతా మాకు నెలకింతా అని డబ్బు కట్టాలి. 

ఆ రెండు ఉద్యమాలూ విజయవంతంగా ముగిసాక 
తృతీయ పురుషుల బహిర్భూమి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించాం. 
అయితే, గ్రామంలో ఉన్నది ఇద్దరే తృతీయ పురుషులు. 
మా కార్యకర్తలు వాళ్ళ చెంబులు లాక్కోగానే,వాళ్ళిద్దరూ ఊళ్ళోంచి పారిపోయారు. దాంతో ఆ ఉద్యమం విఫలమై మాకు నిరాశ మిగిల్చింది.

ఆ ఉద్యమం ఎందుకు విఫలమైందో, ఆ వైఫల్యానికి కారణాలు ఏమిటో మా సెంట్రల్‌ కమిటీ విచారించి, ఆ ఉద్యమం ఒక చారిత్రక తప్పిదమని ప్రకటించింది. 

ఇప్పుడు మా తాజా ఉద్యమం, లింగ వివక్ష లేని శౌచాలయాల నిర్మాణం. మగ వారికి, ఆడ వారికి వేరు వేరు శౌచాలయాలుండడం వివక్షాపూరితం అని మేం గుర్తించాం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. పురుషులు,స్త్రీలు ఒకటే శౌచాలయం వాడితేగానీ సమాజంలో పేరుకు పోయిన ఈ లింగ వివక్ష పోదని గుర్తించాం. 

ఈ ప్రతిపాదనకు చాలామంది మగవారు, ముఖ్యంగా పావన నవజీవన బృందావన నిర్మాతలైన యువకులు వెంటనే  ఒప్పేసుకున్నారు కానీ మళ్ళీ ఆడవాళ్ళతోనే మాకు చిక్కు వచ్చిపడింది. 

వాళ్ళంతా మా ఉద్యమాన్ని అడ్డుకుంటూ మా కార్యకర్తలు ఎక్కడ కనపడినా చీపుళ్ళతో దాడికి దిగుతున్నారు. వీరి వెనుక బూర్జువా పెటీ బూర్జువా శక్తులు ఉండి ఉండవచ్చు. 

ఉద్యమాన్ని ఎలా ముందుకు నడపాలా అని సెంట్రల్‌ కమిటీ తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన