తాతాయణ కథ

 




తాతాజీ! తాతాజీ! వాడు బెత్తంతో నా చేతి మీద కొడుతున్నాడు తాతాజీ! 

నువ్వే వాడినేదో చేసి ఉంటావ్‌! 
అందుకే వాడు నిన్ను కొడుతున్నాడు.

వాడు కుడి చేతి మీద కొడుతుంటే ఎడమ చేయి చూపించాలి. 
కుడి పిర్ర మీద కొడుతుంటే ఎడమ పిర్ర చూపించాలి. 
సరేనా?

సరే, తాతాజీ. ☹️

తాతాజీ! తాతాజీ! వాడు ఎగిరెగిరి వీపు మీద తంతున్నాడు తాతాజీ!

నువ్వు వాడి మనోభావాలను దెబ్బతీసి ఉంటావ్‌.
 అందుకే వాడు నిన్ను కొడుతున్నాడు. 

నీ వీపు వాడికి అందక ఎగరాల్సి వస్తోంది.
 కనుక కింద కూచుని వంగో. 
వాడు ఎంత కొట్టినా శాంతంగా భరించు.
 
శత్రువులో కూడా నారాయణుని చూడడమే దైవత్వం.
 దైవాన్ని చేరుకోవాలంటే దెబ్బలు ఓర్చుకోవాలి. అర్థమైందా? 

అర్థమైంది,తాతాజీ. ☹️

తాతాజీ! తాతాజీ! మీరు బనీను ఎందుకు వేసుకోరు తాతాజీ? 

దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బనీను వేసుకునే స్తోమత వచ్చేవరకూ నేను బనీను వేసుకోరాదని తీర్మానించుకున్నా. 

మనం బనీను వేసుకోడం మానేస్తే ఎదుటి వాడికి బనీను ఎలా వస్తుంది తాతాజీ?

నువ్వు నన్నే ఎదురు ప్రశ్నలు వేస్తున్నావ్‌. అంటే నా పెంపకంలోనే లోపం ఉంది. అందుకు నాకు నేనే శిక్ష విధించుకుంటున్నా. ఒక రోజు భోజనం మానేసి పస్తు పడుకుంటా. 

తాతాజీ!! ☹️

మీరు భోజనానికి వేపాకు ముద్దలు, జిల్లేడు పాలు ఎందుకు తీసుకుంటారు తాతాజీ?

భగవంతుడిని చేరుకోవాలంటే జిహ్వను జయించాలి. 
జిహ్వాచాపల్యాన్ని త్యజించాలి. తెలిసిందా?

మరి భగవంతుడే మనిషికి తినడానికి ఇన్ని రకాల పదార్థాలు సృష్టించి ఇచ్చాడు కదా,తాతాజీ? 
సరైన ఆహారం తీసుకుని దేహాన్ని రక్షించుకోవడము ధర్మమే కదా తాతాజీ? 

నువ్వు నన్నే ఎదురు ప్రశ్నలు వేస్తున్నావ్‌. అంటే నా పెంపకంలోనే లోపం ఉంది. అందుకు నాకు నేనే శిక్ష విధించుకుంటున్నా. నాలుగు రోజులు భోజనం మానేసి పస్తు పడుకుంటా. 

తాతాజీ!! ☹️


తాతాజీ!తాతాజీ! వాడు నా ఇల్లు తగలబెట్టడానికి వస్తున్నాడు తాతాజీ!!

వాడి మనసును జయించడంలో నువ్వు విఫలమైయ్యావ్‌.
 శత్రువునైనా సరే ప్రేమ,శాంతి,క్షమలతో జయించాలి.
 వాడిలో ఈశ్వరుడిని చూసి వాడి ముందు సాగిలపడాలి. 

నువ్వే వాడికి అగ్గి పెట్టె, కిరసనాయిలు డబ్బా అందివ్వు. 
అంతటితో వాడి హృదయం శాంతించి పశ్చాత్తాప పడి నీ అగ్గి పెట్టె, కిరసనాయిలు డబ్బా నీ చేతిలో పెట్టి అక్కడినుండి వెళ్ళిపోతాడు. తెలిసిందా? 

సరే,తాతాజీ. ☹️

తాతాజీ!తాతాజీ! వాడు నన్ను పిచ్చి వాడిలా చూసి నా ఇల్లు తగలబెట్టి పోయాడు తాతాజీ!!

 వాడిలో మార్పు తీసుకురావాలన్న నీ ప్రయత్నాలు ఫలించలేదంటే నీ సంకల్పం బలంగా లేదని, నీ హృదయం ఇంకా ఇతరుల పట్ల మెత్తబడలేదని అర్థమౌతోంది.
 ఈశ్వరుడిని చేరుకునే మార్గం నీకింకా అవగతం కాలేదని తెలిసి నాకు అంతులేని విచారం కలుగుతోంది. 

నీకు సరైన మార్గం చూపించలేక పోవడం నా లోపమే. అందుకు నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. 
నెల రోజులు ఒక్కపొద్దు ఉపవాస దీక్ష తీసుకుంటున్నాను. ఖళ్‌..ఖళ్‌..

తాతాజీ!! ☹️



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన