విద్యానవద్యా విదుషా న హేయా
తాతయ్యా, మన ఊళ్ళో రామయ్య చదువు లేకపోయినా లిక్కర్ బిజినెస్‌లో కోట్లు సంపాదించాడు. తెలుసుగా.
అవునురా. తెలుసు.
పెద్దగా చదువుకోని సోమయ్య ఏవో వ్యాపారాలు చేసి నల్లధనం బాగా వెనకేశాడు. తెలుసుగా.
అవునురా. తెలుసు.
ఇప్పుడు లోకమంతా డబ్బు వచ్చే పనులే చేస్తూ డబ్బు చుట్టూతా తిరుగుతోంది కదా తాతయ్యా!
అన్నీ తెలిసి ఇంకా ఎందుకు తాతయ్యా మనం మాత్రం ఈ వేదం,సాహిత్యం ఇవన్నీ పట్టుకు వేలాడ్డం?
డబ్బు రాని విద్యలు? శాస్త్రాలు?
పండితులు,తత్వవేత్తలు,సత్యానేషులు ఉండేది డబ్బు కోసం కాదురా పిచ్చి వాడా!
జ్ఞానం ఆధారంగా నిర్మింపబడింది కాబట్టే భారత దేశ సంస్కృతి ఇప్పటి వరకూ నిలబడి ఉంది.
ఇక్కడ రాజు సైతం పండితుడిని,కవిని,సన్యాసిని చూడగానే లేచి నిలబడి సత్కరిస్తాడు.
ఇక్కడ ధనవంతుడు, ధనహీనుడు కూడా జ్ఞానం ముందు మోకరిల్లుతాడు.
శాస్త్రానికి, సాహిత్యానికి జీవితాన్ని ధారపోయాలి, పండితుడు,కవి.
బీదరికానికి జడవకుండా,కష్టనష్టాలకి కుంగిపోకుండా శాస్త్రపరిశ్రమ చెయ్యాలి.
ఆ శాస్త్రాలను,జ్ఞానాన్ని ముందు తరాలకి అందివ్వాలి.
లేకపోతే శాస్త్రం,భాష,సాహిత్యం ఏదీ నిలవదు.
నశించి పోతుంది.
అది ఆ జాతికే తీరని నష్టం.
నిరక్షరే వీక్ష్య మహాధనత్వం
విద్యానవద్యా విదుషా న హేయా
విద్యలేని వారు,వినయ దూరులైన వారు మహాధనవంతులైపోవడం చూసి పండితులైన వారు విద్యను త్యజించరు అని ఆ ఆర్య వాక్యానికి అర్థం.
అర్థమైందా మనవడా?
తెలిసింది తాతయ్యా. కళ్ళు తెరిపించావు. నమోనమః 🙏