మతిమరుపు చిలక వలకు పడిందోయ్‌!

 




గాలిమేడల ఆశాజీవి Illusion City లో Software ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

కానీ ఆనందంగా లేడు.

పని ఒత్తిడితో పాటు 
బాస్‌ ఉన్మత్త రావు పెద్ద ఇత్తడి కావడం చేత 
రోజూ తత్తిడి బిత్తిడి అవుతున్నాడు.

ఉద్యోగం అతని 
అందమైన వంకీల జుట్టును 
ఎత్తుకు పోయింది. 

బట్ట తల అతని 
పెళ్ళికి గట్టి మట్టి గోడలా 
అడ్డు నిలిచింది. 

కనీసం పెళ్ళి చూపుల వరకైనా రప్పిద్దామని 
జుట్టున్నప్పటి పాత ఫొటోలు పంపి 
మోసం చేసాడు కొన్నాళ్ళు. 

ఫలితం లేదు.

పదేళ్ళ నాటి పాత ఫొటోలు ఫేక్‌బుక్‌ లో పెట్టి ఆడపిల్లల్ని attract చేద్దామనుకున్నాడు. 
కొంత సఫలం అయ్యాడు కూడా.
 కానీ ఆశాజీవి అసలు స్వరూపం అవగతం కాగానే వాళ్ళంతా అక్కడినుండి పరారయ్యారు. 

తన ప్రయత్నాలన్నీ చిత్తడి చిత్తడి అవుతున్నాయని 
ఎంతెంతో విచారించాడు ఆశాజీవి. 

ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా దుప్పటి కప్పి, 
జీతం వస్తోంది కనక హాయిగా ఎంజాయ్‌ చేద్దామని, 
Illusion City లోని ఓ మెగా బార్‌కి వెళ్ళి 
మందు పట్టించాడు ఆశాజీవి. 

అదేం మందో, తాగేటప్పుడూ సుఖం లేదు,
 తాగిన తర్వాత హాంగోవరు, చెవి రింగింగు, పొట్ట గార్గ్లింగులతో 
అది వరకు ఉన్న సుఖం కూడా పోయింది గాలిమేడల ఆశాజీవికి. 

పోనీ వీకెండ్స్ సినిమాలు చూద్దాం అనుకున్నాడు.
 అవేం సినిమాలో నరుక్కుని చంపుకుని తెరంతా రక్తసిక్తం.
 దానికి తోడు గుండెల మీద కొడుతున్నట్టు థియేటర్‌ సౌండ్లు. 
అవేం పాటలో అదేం లోకమో. ఆశాజీవికి ఆసక్తి పోయింది.

పోనీ వీకెండ్స్ సంగీతం నేరుద్దామనుకున్నాడు. 
గొంతు నొచ్చింది గానీ సరళీ స్వరాలు దాటి 
ముందుకెళ్ళ లేక పోయాడు.

తోబుట్టువులకు పెళ్ళిళ్ళై పోయాయి.
అమ్మానాన్నలు ఆశాజీవి మీద ఆశలు వదులుకుని మనవలతో కాలక్షేపం చేస్తున్నారు.
స్నేహితులకు పెళ్ళిళ్ళై పోయాయి. 
వాళ్ళంతా వారి వారి సంసారాల్లో ఈతలు కొడుతూ బిజీగా ఉన్నారు. 

ఆశాజీవి ఒంటరి వాడై నిరాశాజీవిగా రూపాంతరం చెందాడు. 

అసలీ ఉద్యోగాలు ఊడిగాలు ఎందుకు చెయ్యాలి?

ఎందుకీ పిల్లల్ని కనడం?
వాళ్ళను పెంచడంలో 
అరిగిపోయి, 
కరిగిపోయి,
శిథిలమైపోయి 
ఏదోరోజు చావడం? 

ఎందుకు?
ఎందుకు?
ఎందుకు?

అన్న ప్రశ్నలు ఉదయించగా ఓరోజు ఉదయం కారెక్కి 
అరుణారుణ కాంతుల మీదుగా నర్మదా నదీతీరానికి చేరుకున్నాడు. 

అక్కడో ఆశ్రమం వద్ద ఆగాడు. 

ఆశ్రమంలో స్వామీజీ ఆప్యాయంగా చాయ్‌ ఇచ్చి 
అతిథి సత్కారం చేసేటప్పటికి ఆశాజీవికి ప్రాణం లేచివచ్చింది.

స్మామీజీతో పాటు నర్మదకు వెళ్ళి స్నానం చేసాడు.
 స్వామీజీ ధ్యానం చేసుకుంటుంటే కూర్చుని చూసాడు. 
నర్మద నీళ్ళు,గాలి ఔషధికృతమని
ఎటువంటి జబ్బులైనా పోతాయని స్వామీజీ చెప్పగా విని ఆనందించాడు.  

స్వామీజీ తరువాత పూజ చేసుకోవడం, తనే స్వయంగా చపాతీలు, కూర చేసి నర్మదా నదికి నైవేద్యం పెట్టాక, ఆశ్రమంలో ఉన్న భక్తులతోబాటు ఆశాజీవికీ పెట్టడంతో, ఆ పవిత్ర వాతావరణంలో ఆశాజీవి మానసిక వ్యాకులత అంతా చేత్తో తీసేసినట్టుగా పోయింది. 

ఆ భక్తులంతా నర్మదా పరిక్రమ చేస్తున్న యాత్రికులు. 
స్వామీజీ ఎప్పుడు ఏ యాత్రికుడు వచ్చినా భోజన సదుపాయాలు కల్పిస్తారట!
స్వామీజీ వయసు ఎనభై యేళ్ళ పైమాటే. 

 నర్మదలో స్నానం చేస్తూ,
ఆశ్రమంలో భోజనం చేస్తూ,  
భక్తులతో చాయ్‌ తాగుతూ 
కాలం గడుపుతుంటే ఆశాజీవికి 
అంతులేని ఆనందం కలుగుతోంది. 

ఏ బంధాలు లేని ఈ జీవితం 
అతనికి చెప్పరాని సంతోషం కలిగిస్తోంది. 

అలా వారం రోజులు గడిచాయి.
 ఆశాజీవి ఇక అక్కడే ఆశ్రమంలో ఉండిపోదలిచాడు.
ఇక Illusion City లో తనకేముంది?
ఒత్తిడి, అశాంతి,ఆందోళన,అవహేళన తప్ప? 

స్వామీజీ దగ్గరకు వెళ్ళి ఆమాటే చెప్పాడు.
తను సన్యాసం తీసుకుందామనుకుంటున్నాడు.
తన savings అంతా ఆశ్రమానికే ఇస్తాడు.
తన కారు కూడా ఆశ్రమం పనులకు ఇచ్చేస్తాడు. 

స్వామీజీ నవ్వి ఊరుకున్నాడు.

ఇంకో వారం రోజులు గడిచాయి.
ఓరోజు ఉదయం ఇంటినుండి ఫోన్‌ వచ్చింది.
ఏదో పెళ్ళి సంబంధం ఖాయమైంది.
బట్టతల ఓకే. అది అసలు వాళ్ళకో విషయమే కాదుట.
పిల్ల ఫొటో WhatsApp లో పంపారు. 

ఆశాజీవి WhatsApp తెరిచి పిల్ల ఫొటో చూసాడు.
ఎన్నో ఏళ్ళు నిస్పృహలో ఉన్న ఆశాజీవికి ఆ పిల్ల రంభకి చెల్లెలిలా, ఊర్వశికి కజిన్‌ సిస్టర్‌లా అనిపించింది. 

గాలిమేడల ఆశాజీవి అప్పటికప్పుడు ఊహల్లో పేకమేడలు కట్టేసాడు.

ఇంతలో మరో ఫోన్, కొలీగ్‌ నుండి.

బాస్‌ ఉన్మత్త రావ్‌ రిజైన్‌ చేసి వెళ్ళిపోయాడు! 

ఆహా! ఆశాజీవిలో ఆనందం మొలకెత్తి క్షణాల్లో మహావృక్షమైంది. 

గాలిమేడల ఆశాజీవిని 
అలా మాయ కేకేసింది.
మోహం కాటేసింది.

ఆశ్రమం అసలు గుర్తేలేదు.

జీవితం తనకివ్వబోయే లస్కుటపా లబ్జులను తల్చుకుంటూ
రయ్యిమని Illusion City వైపుకు సాగిపోయాడు!



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన