అత్తయ్య ఆరోగ్య సూత్రాలు

 

మేం కాఫీలు,టీలు మానేశామే అంది అత్తయ్య మంచి నీళ్ళందిస్తూ. 


మరి?

నేనూ మీ మామయ్యా పొద్దున్నే కషాయం తాగుతున్నామమ్మా. 

ఇన్ని లవంగాలు,ఇన్ని మిరియాలు,ఇన్ని మెంతులు,ఇన్ని తులసాకులు,ఇన్ని ధనియాలు,ఇన్ని సోనాముఖి ఆకులు వేసి మరగగాచి గటగటా తాగేసి, తర్వాత ఆ ఘాటు గురించి ఇద్దరం చెరి కాస్తా తేనె నాకుతున్నాం అంది “ఇన్ని” అన్నప్పుడల్లా చేత్తో కొలత చూపిస్తూ. 

టిఫినుకు దోసెలు,ఇడ్లీలు మానేశాం అంది మళ్ళీ.

మరి? 

మొలకలొచ్చిన పెసలు, కారెట్టు ముక్కలు, బీట్రూటు రసము ఇలా ఏదో కాస్త నోట్టో వేసుకుంటున్నాం. 

మధ్యాహ్నం భోజనానికి కూరలు,పప్పులు మానేశాం. 
ఊరగాయలు అసలే ముట్టట్లేదు అంది మళ్ళీ సాగదీస్తూ.

మరి? 

అవిశాకు, గుంటగలగరాకు, నల్లేరు, అతిబల,మహాబల ఇలాంటి ఆకులు పచ్చివి, ఏదో అంత నానబెట్టిన పప్పు, ఆముదంతో కాల్చిన చపాతీలు, కొర్రలు,సామలు,తైదులు,రాగులు వీటితో జావ.
 ఇదీ మా భోజనం.  

సాయంకాలం అదీ ఉండదు.
 ఇంత రాగి జావలో అంత మజ్జిగ కలుపుకుని చెరి కాస్తా తాగేసి చెరో రెండర్టి పళ్ళు తినేసి నడుం వాలుస్తాం. 

ఇవన్నీ చెయ్యమని ఎవరు చెప్పారత్తయ్యా?

టీవీలో అంతెన, బాదర్ బలి, నేచర్‌ స్వామి వీళ్ళు చెప్పే సహజ జీవన విధానాలన్నీ రోజూ నోట్సు రాసుకుంటుందమ్మాయ్‌ అన్నాడు మామయ్య అందుకుంటూ. 

నీళ్ళు కూడా కుళాయి నీళ్ళు వాడ్డం లేదు మీ అత్తయ్య. 
వాన నీళ్ళు మంచివని చెబితేనూ, అవి రాగి గంగాళంలో పట్టి నిలవ చేసి వాడుతోంది అన్నాడు నిస్సహాయంగా. 

అంటే ఇందాక నాకిచ్చినవి? 

కిందటేడు కురిసిన వర్షం నీళ్ళు! 
ఒంటికి చాలా మంచిదే అంది అత్తయ్య చేతులు తిప్పుతూ. 

అయ్య బాబోయ్‌! సరే గానీ అత్తయ్యా, మీ రాత్రి భోజనం జావలు అవీ చేసుకుంటారేమో. 
నాకలవాటు లేదుగానీ, నేనలా విద్యార్థి భవన్‌ కి వెళ్ళి వెన్న దోసెలు తినేసొస్తా.

విద్యార్థి భవన్ లో వెన్న దోసెలా? తిని ఎన్నాళ్ళయిందో. 
కాస్తాగవే, నేనూ తయారై వస్తా 
అంది అత్తయ్య అదరాబాదరాగా లేస్తూ.

అదేమిటే, మరి మన డైటింగు?
 అన్నాడు మామయ్య కొచ్చెన్‌ మార్కు మొహం పెట్టి. 

ఒక్క రోజు వెన్న దోసెలు తింటే ఏమీ అయిపోదులేద్దురూ!
మీరూ లేవండి అలా వెళ్ళొద్దాం 
అంది అత్తయ్య మామయ్యను హడావిడి చేస్తూ. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి