రామేశ్వరం పోయినా!

 



ఆకువాడలో పేద్ద సాహితీ సభ.

ప్రముఖ సాహితీవేత్త ఉర్లగడ్డ గారు బీభత్స అవార్డు పొందిన తన గ్రంథరాజాన్ని తానే ఆకాశానికి ఎత్తుకుంటూ ఎప్పటివలే తన ప్రసంగం కొనసాగించారు. 

నా పుస్తకాన్ని బూతు అని, పౌరాణిక పాత్రను కించపరిచానని, ఇంకా ఏమేమో పనికిరాని విమర్శలు చేసారు, కొందరు పండితులు. అసలు పండితులు ఉండేదే ఇటువంటి పనికిమాలిన విమర్శలు చెయ్యడానికి. 
నేను చానా పెద్దమనిషినని, నాకు బీభత్స అవార్జు వచ్చిందని, వారందరికీ అసూయ. 
అసలు నా పుస్తకాన్ని బూతు అనేవారికి ఒకటే సమాధానం చెబుతున్నా. మనకు శృంగారము అనేది నవరసాల్లో ఒక రస్నా. ఈ రస్నా గురించి ఎంత రాసినా తనివి తీరదు. ఇంకా ఇందులో అమలినము,సరసము,విరసము,నీరసము లాంటివెన్నో రకాలున్నాయని హిందీ కవి చంపక్‌రాయ్‌ బాడురీ చెప్పాడు. నేను అదంతా ఎత్తి తీసుకొచ్చి తెలుగులో పులిమాను. ఏం తప్పా? తప్పుకాదే? 

మరొక వక్త వెల్లుల్లి గడ్డ గారు పైకి లేచి ఎప్పటి వలె తన రిపీటెట్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. 

నాకు భారత ప్రభుత్వం నుండి మందార రత్న, గులాబీ భూషణ్‌, మల్లెశ్రీలాంటి అవార్డులన్నీ వచ్చాయి కానీ ఈ సమాజం నన్ను గుర్తించ లేదు. నేను వైస్‌ ఛాన్సలర్‌, ఛాన్సలర్‌, ప్రభుత్వ సలహాదారు, కేంద్ర కమిటీ మెంబరు, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వంటి పదవులెన్నో నిర్వహించాను గానీ ఈ సమాజం నాకు సమాన అవకాశాలు ఇవ్వలేదు. నేను ప్రభుత్వ ఖర్చుతో విమానాల్లో తిరిగాను, అయిదు నక్షత్రాల హోటెళ్ళల్లో ఉన్నాను కానీ ఒక విందులో నాకన్నా ముందు పక్కనున్నాయనకు వంకాయ కూర వడ్డించి నన్ను అవమానించారు. 


మరొక వక్త  కంద గడ్డ గారు పైకి లేచి ఎప్పటి వలె తన పునః ప్రసారంలాంటి తన‌ ప్రసంగాన్ని కొనసాగించారు. 

నేను 60ల్లో హలం ఛందస్సుతో నా ప్రయాణం ప్రారంభించా. తరువాత జ్యోతి లక్ష్మీ ఛందస్సు, జయమాలినీ ఛందస్సు, సిల్కు స్మిత ఛందస్సు ఇలా తయారు చేసుకుంటూ వెళ్ళా. తరువాత సావిత్రి ఛందస్సుతో మొదలెట్టి ,పోయిన నెల సమంతా ఛందస్సు వరకు తయారు చేసుకుంటూ పోయా. ఛందస్సే నా జీవితం. ఛందస్సు తెలిస్తే కవి అయిపోయినట్టే. ఈనెల రష్మికా మందన్న ఛందస్సులో కొన్ని కవితలు పంచబోతున్నా. మచ్చుకు ఒకటి-

రష్మికా రేష్మికా
చాలిక చిలుకా
మెలికా కొలకా
మోనికా మొలకా! 


మరొక వక్త గెనిసి గడ్డ గారు పైకి లేచి ఎప్పటి వలె తన గొప్ప సినీ కవిత్వాన్ని  ప్రేక్షకుల మీద రుద్దుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

నా సినిమా పాటలను రసహీన అపటుత్వ అర్థహీన సాహిత్యంగా కొంతమంది విమర్శించారు. అయినా నేనా విమర్శలను పట్టించుకోలేదు. ఉదాహరణకు ఇటీవల హిట్టైన నా పాట- 

నీకు నాకు
కాడ్‌ బరీస్‌
సగం సగం
సగం సగం! 

అన్నదే తీసుకోండి. అందులో, నీకు నాకు కాడ్‌ బరీస్‌ అనడం అనేది సినీ సాహితీ చరిత్రలోనే ఒక అపురూప ప్రయోగం. 

ఇక సగం సగం అని నాలుగు సార్లు వచ్చింది. 
అంటే, మొత్తంలో one forth అనుకుని సామాన్య ప్రేక్షకుడు పొరపడే అవకాశం ఉంది కాబట్టి నేనీ పాయింట్‌ ని ఇంతగా స్ట్రెస్‌ చేసి చెబుతున్నాననమాట.

సగం సగం అని ఒకసారి హీరోయిన్‌ అంటుంది. ఒకసారి హీరో అంటాడు. అంటే సగం సగం అని ఇద్దరూ ఒప్పుకుంటున్న ఒక అపురూపమైన సన్నివేశం. దీని గురించి గజేంద్ర మోక్షంలో కూడా ఉంది. ఇందుగలడందు లేడని…


ఇదంతా చూస్తున్న ఓ ప్రేక్షకుడు పక్కనున్న తెలుగు వాడితో,
 ఆస్ట్రేలియా సాహితీ సభలకువెళ్ళా, అమెరికా సభలకు వెళ్ళా, సింగపూరు సభకి వెళ్ళా. ఎక్కడ చూసినా వీళ్ళే వక్తలు. 
పాడిందే పాటరా అన్నట్టు ఇవే మాటలు. 
భారత్‌కు వచ్చినా వీళ్ళేనా?
 రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు! 
అంటూ వాపోయాడు. 




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన