DJ టిల్లు కొట్టు! బాక్సులు పలిగేటట్టు! 🥁



 


సంగీత్‌ కి డీజే టిల్లు పాట అని group లో message వచ్చింది అన్నది నా శ్రీమతి ఉత్సాహంగా.

యాభై ఏళ్ళు వచ్చాక కొత్తగా డాన్సులెక్కడ చెయ్యనూ? అన్నా గాభరాగా.

చాల్లే ఊరుకోండి. 
అమెరికాలో యాభై అంటే ఇరవై అయిదు 
అంది మా ఆవిడ తన తెల్ల వెంట్రుకల్ని అద్దంలో చూసుకుంటూ.

నీకు నలభై ఆరు అంటే ఇరవై ఆరా ఇక్కడ అన్నా వెటకారంగా.

మీకు నోటి లెక్కలు సరిగ్గా రావనుకుంటా.
 నలభై ఆరులో సగం ఇరవై మూడు అంది ఆట పట్టిస్తూ. 

ఏమైనా సరే, ఈ డాన్సులూ అవీ నావల్ల కాదు. 
అసలు ఈ సంగీత్‌లు అవీ మన దక్షిణ భారత దేశ సంప్రదాయమే కాదు. 
పూర్వం మన పెద్ద వాళ్ళు మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి డాన్సు చెయ్యడం చూసామా అసలు?
 అన్నా చిరాకు ముంచుకొస్తుండగా.


చాల్లే ఊరుకోండి. మీరూ మీ పాత చింతకాయ పచ్చడి చరిత్రలు.
 మన friends group అంతా నేర్చుకుని చేస్తున్నారు.
 మనమూ నేర్చుకుని చెయ్యాల్సిందే. 
ముందు ఇంట్లో నేర్చుకుంటే వారం రోజుల తర్వాత zoom లో కలిసి practice చెయ్యొచ్చుట. 

ఇదిగో, ఇప్పుడే practice video వచ్చింది.
 లేవండి, లేవండి. Steps చూసుకుందాం అంది ఉత్సాహం పట్టలేక.

ఈ పాటేమిటో? ఈ steps ఏమిటో?
 అర్థం పర్థం లేని సాహిత్యం! 
దానికి మన అర్థం పర్థం లేని ఎగురుడూను అన్నా తిక్క రేగుతుండగా.

మా ఆవిడ నా సణుగుడుకు respond అయ్యే స్థితిలో లేదు. 
Already video లో steps చూసుకుంటూ ఎగురుతోంది. 

ఏమిటో నడుం తెగ తిప్పుతున్నావు కుర్ర పిల్లలాగా.
 అసలు నడుం ఉందా నీకసలు? 
అన్నా సందు దొరికింది కదా అని మాఆవిడ మీద ఒక పంచ్‌ వేస్తూ.

ముందు మీరు పాంటు పైకి లాక్కోండి, పొట్ట చూడలేక ఛస్తున్నా అని అంత ఎగురుడులోనూ నా మీద నా పంచ్‌కి డబల్‌ పంచ్‌ వేసి నా నోరు మూయించింది మా ఆవిడ (నా పంచ్‌లు మాత్రం బాగా వినిపిస్తాయి ఆవిడకి). 

ఏమిటో కాళ్ళు ఆడుతుంటే చేతులాడించడం మర్చిపోతున్నా. 
చేతులాడిస్తుంటే కాళ్ళు కదలడం లేదు అన్నా నీరసంగా. 

ఏమీ లేదండీ, చాలా సింపుల్‌! 

ఇదిగో, ఇటు తిరిగి ఇలా టేబుల్‌ తుడుస్తున్నట్టు ఇలా ఇలా అనండి.
అటు తిరిగి మళ్ళీ టేబుల్‌ తుడుస్తున్నట్టు ఇలా ఇలా అనండి.
అదే fast గా four times చెయ్యండి. అంతే! 

Next, పాం పడగ step ఇలా చెయ్యండి.
Next, తాడును పైకి లాగుతున్నట్టు ఇలా. 
Next, చేతులు పైకెత్తి… 

ఇలా చేస్తూ చెప్పుకుంటూ పోయింది మాఆవిడ మహోత్సాహంగా. 

అలా అలా individual గాను, zoom లో group గాను practice బ్రహ్మాండంగా జరిగింది. 

అసలు రోజు రానే వచ్చింది. 

వేదిక మీద నాకు ఒక్కటీ గుర్తుకు రాక 
పక్క వాళ్ళను కాపీ కొడుతూ ఏదో అయిందనిపించా. 

తీరా వీడియోలో చూస్తే అందరూ మా బాపతే.

విభిన్న శరీరాకృతులు
విభిన్న భంగిమల్లో 
విభిన్న వేగాలతో
ఎగురుతున్న ఆ దృశ్యము చూసి, 

అప్పుడప్పుడూ తీసి చూసుకుని నవ్వుకోవడానికి పనికొస్తుంది దాచి పెట్టు అన్నా విరగబడి నవ్వుతూ, మా ఆవిడ కోపంగా చూస్తుండగా. 

ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ, బాక్సులు పలిగేటట్టు అన్న లిరిక్‌ రాగానే ఆవిడ నడుం టక్‌ మని పట్టేసి, పాటైందాకా వేదిక మీద అలా శిలారూపం దాల్చి నిలబడి పోయింది! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి