The Mentors

 


హలో! నేను ప్రముఖ కవి YMK ని మాట్లాడుతున్నానమ్మా. 
బ్రాందీ జ్యోతిలో మీరు వ్రాసిన “పువ్వుల నవ్వులు” చదివి ఎంతో ఆనందించా. 
ఇంత  అద్భుతమైవ కవిత ఎవరు రాసారా అని ఆరా తీసి మీ ఫోన్‌ నెంబరు సంపాదించి వెంటనే ఫోన్‌ చేస్తున్నా.

కవయిత్రి వసంత: బీభత్స అకాడెమీ అవార్డు గ్రహీత YMK గారా? 
ఓహ్‌! నా చెవుల్ని నేనే నమ్మలేక పోతున్నా సార్‌! Thank you సార్‌!!
చిన్నతనంలో మీ కవితలు చాలా చదివాను సార్‌! 

YMK:  నీలో మంచి ఫైర్‌ ఉందమ్మా. 
కానీ ఎంతసేపూ పువ్వులూ ఆకులేనా? 
నీ చుట్టూ చూడు. ఎన్నెన్ని అన్యాయాలు? ఎన్నెన్ని మోసాలు? 
ఈసారినుండీ సామాజిక స్పృహతో కవితలు రాయి. 
ఆలోచించు. నువ్వు చించగలవ్‌,నాకు తెలుసు!

నా కవిత ఒకటి వినిపిస్తా విను. దీనికి వావర్స్ బంట్‌ అవార్డొచ్చింది సుమీ. 

 ఎర్రెర్రని దారుల్లో..
 అరుణోదయ చాలుల్లో.. 
 ఎరుపెక్కిన సూరీడు.. 
 ఎరుపెక్కిన సూరీడుకి
 ఎర్రెర్రని బూట్లున్నయ్‌!
 బూట్ల కింద చీకట్లను
 చూసావా కామ్రేడ్? 

ఇదిగో, నా రైలు సహచరి, ప్రముఖ ఉద్యమకారిణి AZM తో మాట్లాడు. 


AZM: హలో! అమ్మా, వసంతా! నీ కవిత చదివి నా మనసు రెపరెపలాడింది. నీలో కవితాహృదయం ఉంది. స్పందించే లక్షణం ఉంది. నువ్వు నీ కవితాశక్తిని సమాజపు కర్కశ కోరల్లో నలిగిపోతున్న స్త్రీల వైపుకు తిప్పాలి. సరేనా? 

వసంత: అలాగేనండీ. ఒక సందేహం. ఇందాక YMK గారు మిమ్మల్ని రైలు సహచరి అని ఎందుకు అన్నారండీ? మీరిద్దరూ భార్యాభర్తలు కాదా? 

AZM: హహ, జీవితం రైలు ప్రయాణంలాంటిది కదమ్మా. అందుకే నన్నతడు “రైలు సహచరి” అంటాడు. నేనతన్ని “రైలు సహచరుడు” అంటాను. ఇది వరకు నాకు,అతనికి రైలు సహచరులు కొంత కాలానికి వేరే బోగీలోకి వెళ్ళిపోయారు.  బీడీ కట్టల దండలు మార్చుకుని మేమిద్దరం రైలు సహచరులమైయ్యాం. 

వసంత: బీడీ కట్టల దండలా??

AZM: శ్రమలో, పనిలో అలిసి సొలిసిన శ్రమైక జీవులకి ఆనందాన్నిచ్చేది బీడీయే కదమ్మా? అందుకే వారి మీద గౌరవంతో బీడీ దండలు మార్చుకుని ఒక్కటైయ్యాం. మా పిల్లల పేర్లు కూడా పెద్దవాడి పేరు “ఉప్పు”, చిన్న వాడి పేరు “నిప్పు” . బీద వాడికి కావాల్సింది గంజిలో ఉప్పు, పప్పు చేసుకోడానికి నిప్పు కదమ్మా. అందుకే ఆ పేర్లు పెట్టాం. 

వసంత: చాలా కొత్తగా ఉందండీ మీరు చెప్పేవి వింటుంటే. నాది ఏదో చిన్న ప్రపంచమండీ. మావారు ఉద్యోగం చేస్తారు. నేను వంట చేస్తాను. మాకో పాప. 

AZM: ఓహో, వంటంతా నువ్వే చేస్తావా? మీ ఆయనేం చెయ్యడా? 

వసంత: అవునండీ. నేనే చేస్తాను. ఆయన బిజీగా ఉంటారు. పైగా ఆయనకు వంట రాదు. 

AZM: ఎంథ ఘోరం! బానిస బతుకు! గిన్నెలు కూడా నువ్వే తోముతావా? 

వసంత: అవునండీ.. 

AZM: ఎంథ ఘోరం! బానిసకొక బానిస బతుకు! పిల్లను కూడా నువ్వే చూసుకుంటావా? 

వసంత: అవునండీ.. 

AZM: ఎంథ ఘోరం! బానిసకొక బానిసకొక బానిసవన్న మాట! ఈ రోజు మీ ఆయన్ను కడిగి పారెయ్‌! ఎన్నాళ్ళీ వెన్నెముక లేని బతుకు? వంటింటి కుందేలువా నువ్వు? ఆడ పులివి! లేచి గర్జించు! నీకు నా పుస్తకాలు కొన్ని పంపుతున్నా. అవి చదువు, చైతన్యం వచ్చేస్తుంది. ఓకేనా? 

వసంత: సరేనండీ. మీ పుస్తకాలు చదువుతా. మా ఆయన్ను కడుగుతా. 

అలా ఫోన్‌ mentoring తో కొన్ని నెలలు గడిచాయ్‌. 

హలో, నేను YMK with AZM మాట్లాడుతున్నానమ్మా. విస్కీ జ్యోతిలో నీ కవిత చూసా. 

రేయ్‌, మొగాడా!
నీ కాలి కింద చెప్పులాగా
పరీక్షలో స్లిప్పులాగా
జడకు పెట్టిన క్లిప్పులాగా
నేనెందుకు బతకాలిరా?

అన్న నీ కవిత చదివి నా గుండె ఉప్పొంగింది. Keep it up! 
అవును, ఇప్పుడెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? 

వసంత:  గిన్నెలు తోమడం మీదా, పప్పు రుబ్బడం మీదా మా ఆయనతో గొడవ పడి పుట్టింటికొచ్చేసా. ఏదో ఉద్యోగం చేసుకుంటూ, నా పూజలేవో చేసుకుంటూ, కవితలు రాసుకుంటూ బతుకుతున్నా సార్‌!

AZM: ఎంత శుభవార్త చెప్పావమ్మా!
 నీలో చైతన్యం రెక్కలు విప్పింది.
 స్వేచ్ఛావిహంగంలా గగనతలంలో హాయిగా ఎగురుతూ పదిమందికి స్ఫూర్తినివ్వాలి. తెలిసిందా?
 నీలో చైతన్యమైతే వచ్చిందిగానీ పూజలు అవీ అంటున్నావంటే పాత రోతని నువ్వింకా వదిలిపెట్టలేదు. 

రాముడు సీతకి అగ్ని పరీక్ష ఎందుకు పెట్టాడు? ఆలోచించావా? 
అసలు రాముడు దేవుడెలా అయ్యాడు? చించావా?

లేదు.

ఏమీ ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పూజలు చేస్తున్నావ్‌. 
నీకు నా మాజీ రైలు సహచరుడు రాసిన “అసలు దేవుడెవరు?”, “రామాయణ కషాయం” ఇంకా మరికొన్ని నాస్తిక హేతువాద పుస్తకాలు పంపుతాను.
 అవి చదివితే ఆ మిగతా చైతన్యం కూడా నీలో వచ్చేస్తుంది. ఓకేనా? 


అలా ఫోన్‌ mentoring తో కొన్ని నెలలు గడిచాయ్‌. 


వసంత పూజలు మానేసి నాస్తికురాలై కొత్త కవిత్వం వ్రాయసాగింది.

YMK and AZM ల  రా.రా.వె పార్టీలో కార్యకర్తగా కూడా చేరింది.  


వసంత: సార్‌! YMK గారు! మేడం, AZM గారు! 
రాముడు మతం మార్చుకున్నాడు అని నేను రాసిన కవిత మీద ఎవరో కేసు పెట్టారు సార్‌! 

స్టేషన్‌లో ఉన్నా. మీరే కాపాడాలి సార్‌!!

YMK with AZM: తెలిసిందమ్మా. 
నేను AZM ను మాట్లాడుతున్నా. అక్కడే ఉండు.
 
YMK ఇప్పుడే “భావ స్వేచ్ఛకు మతోన్మాద సంకెళ్ళు” అన్న వ్యాసాన్ని బ్రాందీ జ్యోతికి పంపుతున్నారు. 

నేనేమో “ఉన్మాదానికి లేదా హద్దు” అన్న వ్యాసం వాసి విస్కీ ప్రభకు పంపుతున్నా. 

ఒక రోజు గడిచింది. పత్రికల్లో అలజడి అలలు లేస్తుండగా-

YMK with AZM: హలో, వసంతా, నీకోసం ఇవాళ మేమంతా కదిలి వస్తున్నాం. 

వసంత: హలో, YMK సార్‌, మా అమ్మానాన్నా, మా ఆయనా వచ్చి నన్ను విడిపించి తీస్కెళ్ళారు. దారిలో గుడికెళ్ళి పూజ చేయించుకుని ఇంటికి వస్తున్నాం. (కన్నీళ్ళతో)

YMK with AZM: ఆ! ఎంథ పని చేసావ్‌? 

అసలు నిన్నెవడు బయటికి రమ్మన్నాడు??

నీకోసం రా.రా.వె, పొ.పొ.వె, ప్ర.ప్ర.గ,సరసం,నీరసం వంటి అనేక తాతన్యశీల సంస్థల వాళ్ళమంతా నినాదాలు ఇచ్చుకుంటూ స్టేషన్‌ దగ్గర గొడవ చేసి నిన్ను బయటికి తీసుకొద్దామనుకున్నాం. 

ఇంతలో కొంపలంటుకు పోయినట్టు బయటికొచ్చావ్‌. 
బయటికి రావడమేకాక గుడికి కూడా వెళ్ళావ్‌!  

నీలో చైతన్యం బ్లాక్‌ అయ్ పోయింది!
ఫో! నీ బూర్జువా మతతత్వ పాత దెయ్యాల కొంఫలోకి ఫో!

 పార్టీనుండి నిన్ను వెలివేస్థున్నాం! ఫో!

You are dismissed! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

కుబెగ్గరేరా!