రామాయణ తాళ వృక్షము - 1

 



విమర్శకుడు: ఇది వరకే చాలామంది రామాయణాన్ని ఎంతో సుందరంగా ఇంకెంతెంతో సురుచిరంగా వ్రాసి ఉన్నారు కదండీ.

  మీ గురువుగారెందుకు మరలా వ్రాసినట్టు? 

కవి విరాట్ శిష్యుడు: తిన్న చపాతీలే రోజూ ఎందుకు తింటున్నాము?
తిన్న ఉప్మావే,తిన్న పెసరట్టే ఎందుకు తింటున్నాము? అందుకే రామాయణాన్ని మళ్ళీ వ్రాసానని మా గురువు గారు సెలవిచ్చారు.

విమర్శకుడు: భోజనం చెయ్యడం,కాపురం చెయ్యడంలాంటి 
హీనమైన ఉపమానాలేమిటండీ? 
అవి భౌతికాలు. 
అందరూ చేసేవి,చేయగలిగేవి.

రామాయణం ఆధ్యాత్మికం. 
 రోజూ చేసే సంధ్యావందనమే మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్టే, 
రోజూ చేసే ప్రాతఃపూజ ప్రతి రోజూ చేస్తున్నట్టే 
రామాయణాన్ని మళ్ళీ నేను వ్రాస్తున్నాను 
అంటే ఎంత అందంగా ఉండేదండీ? 

కవి విరాట్ శిష్యుడు: తమరు నోరు మూయించండి. 
మా గురువు గారిని సరి దిద్దే స్థాయి తమకు లేదు.

విమర్శకుడు: కైక “అడవి కోడి” కూసినట్టుగా నవ్విందని వ్రాసారేమండీ విడ్డూరంగా? కేకయ రాజకుమార్తె, దశరథుని భార్య,మహా రాణి కైక. ఆవిడ “అడవి కోడి” కూసినట్టు నవ్వడమేమిటండీ? రామ!రామ! 

కవి విరాట్ శిష్యుడు: మా గురువు గారు కొంగ్రొత్త ప్రయోగములు చేయుటలో దిట్ట. 

విమర్శకుడు: కైక రాముడిని సీతను గదిలోకి తోయడమేమిటి, 
మళ్ళా ఆ  గది తలుపులు మూసి తీసి నవ్వుతుందా? (గది తల్పులు మూసి తీసెడున్‌) 
 కైక ఏమైనా మన పక్కింటి తాయారక్కా? 
అదీ రాజ మందిరంలో రాముడి తల్లి, మహారాణి కైక ప్రవర్తన! 
ఎంత దరిద్రంగా ఉందండీ ఇది.
కొంచమైనా సున్నితత్వము, సౌకుమార్యము లేని ముతక వ్యవహారం! 

కవి విరాట్ శిష్యుడు: మా గురువు గారి స్థాయి మీవంటి విమర్శక పిపీలికాలకు అర్థం కాదులెండి. 

విమర్శకుడు: విశ్వామిత్రుడంతటి మహర్షి దశరథుడంతటి మహారాజు వద్దకు సహాయం కోసం వచ్చి, “పిచ్చి నృపా! మేమైనా నీకు కొడుకును తింటామా? మాతో పంపు.” అంటాడా?
 ఇదేదో మధ్య తరగతి ఆసామి కూరగాయలు అమ్మే వాడి దగ్గర, “నేనేమైనా ఎగ్గొట్టి పోతానా? రేపిస్తానులే నీ డబ్బులు” అన్నంత సామాన్యంగా ఉందిగానీ ఒక పౌరాణిక పాత్ర పలుకుతున్నట్టు ఉందా ఏకోశానైనా?

మూల రామాయణంలోని పాత్రల ఔన్నత్యాన్ని చెడగొట్టి ఏదో మామూలు మనుషులన్నట్టు వారిని దిగజార్చి మళ్ళీ పైగా ఇదేదో తపస్సు చేసి రాసినట్టు గొప్పలు పోవడమన్నది నిజంగా విడ్డూరాలలోకెల్లా విడ్డూరం.

కవి విరాట్ శిష్యుడు: మా గురువు గారిని విమర్శించే స్థాయి మీవంటి ఆముదం చెట్లకు లేదు. 







ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన