తెలుగు పాట-ప్లేటు పూరీ -2
ఉత్తరాల ఊర్వశీ
ప్రేమలేఖ ప్రేయసీ
ఉత్తరాలు అని పైన బహువచనం చెబుతున్నాడు కదా కవి,
కింద ప్రేమలేఖ ప్రేయసి అన్నాడే?
ప్రేమలేఖలు అని కదా ఉండాలి?
ట్యూనుకి కుదిరి ఉండదు. అర్థం చేసుకో.
పోనీ,
ఉత్తరాల ఊర్వశీ
చిత్తరాల ప్రేయసీ
అని వ్రాస్తే?
ఉత్తరాల ఊర్వశీ
ఆత్తరాల ప్రేయసీ
అని కూడా వ్రాయొచ్చు కదండీ?
ఏదో ఒకటి లేద్దూ సినిమా పాటకి.
కీచు కీచు పిఠ్ఠా!
నేలకేసి కొఠ్ఠా!
నిన్నొదిలి పెట్టేది ఎఠ్ఠా?
నీనోట పంచదార కొఠ్ఠా!
ఏమన్నా సాహిత్యమా అండీ? ఏమిటో ఈ వికట రొమాన్సు పాఠ.
పాఠ రాసేఠప్పుడు కవి గారికి జలుబు చేసి ఉంటుంది.
అయినా ఏదో ఒకటి లేద్దూ సినిమా పాఠకి.
కదలి వచ్చే నీలో
కడలి పొంగులు చూసా
కనుల నీడలలోనే
కవితలెన్నో రాసా
కడలి అంటే సముద్రము. మన సంప్రదాయంలో స్త్రీలను నదులతోను,
సముద్రాన్ని, “సముద్రుడు” కనుక పురుషుడితోనే పోలుస్తారు.
మరి కథానాయికలో “కడలి” పొంగులు చూడ్డం ఏమిటండీ?
ఏదో పాపం డబల్ మీనింగ్ కోసం తంటాలు.
మరీ అంత విశ్లేషించకండి.
సినిమా పాటను అలా పైపైన విని ఆనందించి వదిలెయ్యండి.
అప్పుడే టిక్కెట్టు కొనుక్కుని థియేటర్‌లో కూచున్న
మనలాంటి ప్రేక్షకుడికి ఆనందో బ్రహ్మ.
ఇక్కడ బుద్ధిని వాడరాదు.
మనసుకే జమకు ఝమా ఝమాఝమా ఝం!
(Google చెయ్యకుండా ఈ పాటలు ఏ సిన్మాలోవో మీకు గుర్తొస్తే మీరు తప్పకుండా సినీ అభిమానులే 😊)