రామాయణ తాళ వృక్షం - 4

 



విమర్శకుడు: వాల్మీకి రచనలో సీతా మహాసాధ్వి పతి ఎక్కడ ఉంటే అక్కడే తనకు స్వర్గమని రామునికి నచ్చజెప్పి రామునితో బాటే అడవి బాట పడుతుంది. 

కవి విరాట్టు సృష్టించిన సీత, రాముడు తన తల్లిని చూసుకుంటూ ఇక్కడే అయోధ్యలోనే ఉండమంటే, అబ్బే, భర్త లేకుండా అత్తింటిలో ఉన్న స్త్రీని మరుదులు,అత్తలు చులకనగా చూస్తారని మహా గడుసుగా లాజిక్కు లాగుతుంది!

పాత్రల మూలస్వభావాన్నే చంపివేసే అసమంజసమైన ఊహపోహలు. 

కవి విరాట్టు శిష్యుడు: మా గురువు గారు రామాయణ రచనలో కొత్త పోకిళ్ళు పోయినారు. అది మీవంటి వారికి అర్థము కాదులెండి. 

విమర్శకుడు: కౌసల్య ఎదలో గరడు కరడు
                   లై పొంగు లొలయు పయస్స్వాదు నిర్జర
                   నిర్ఝర ధారలు నిక్కి నిక్కి

 కరళ్ళు కరళ్ళుగా పొంగుతాయా తల్లి పాలు ఎక్కడైనా? 

పయస్స్వాదు నిర్జర నిర్ఝర ధారలట! 

సున్నితత్వము చచ్చినది! 
సౌకుమార్యము,సౌందర్యము వేయి వ్రక్కలైనవి ఈ ధారలలో! 

కవి విరాట్టు శిష్యుడు: ఇవన్నీ అర్థము కావలెనన్నచో మీవంటి విమర్శకులు వేయి జన్మలెత్తవలెను. 
             
విమర్శకుడు: పాపమా సీతమ్మ తల్లి అడవిలో నడువలేక నడువలేక నడుస్తూ అలిసిపోయి “ఆ చెఱువు ఒడ్డున కాసేపు విశ్రమిద్దామా” అని అడుగుతుందట. దానికి మీ గురువు గారి రాముడు, ముద్దూ ముచ్చటా తెలియని బండబారిన చవకబారు భర్త వలే- “విశ్రాంతి తీసుకోవడం కోసం అయోధ్య వదిలి వచ్చావా?” అంటాడుట అర్థం పర్థం లేకుండా. ఇదీ మీ గురువు గారి కవిత్వము. 

కవి విరాట్టు శిష్యుడు: ఈ కల్పనలలోని సౌందర్యము మీకు తెలియవలెనంటె మా గురువు గారి ఉపన్యాసములలో వారిచ్చిన వివరణలు వినవలెను. 

విమర్శకుడు: నిజమేనయ్యా, కవి గారు వచ్చి వివరిస్తేగానీ అర్థం కాని అసంబద్ధ అల్లికలు మీ గురువు గారి పద్యములు వాటి వెనుకనున్న నిగూఢార్థములు! సరి!సరి!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన